వృద్ధురాలి నుంచి సంచి లాక్కున్న ఇన్స్పెక్టర్
చెన్నై: వరదలతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు ఆపన్నహస్తం అందించాల్సింది పోయి ఓ పోలీసు అమానవీయంగా ప్రవర్తించాడు. వృద్ధురాలిని నుంచి సహాయ సామాగ్రిని దౌర్జన్యంగా లాక్కుని చక్కా పోయాడు. చెన్నైలోని ఎంజీ నగర్ కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడంతో సదరు ఖాకీవాలా చిక్కుల్లో పడ్డాడు.
పెరియార్ కోయిల్ స్ట్రీట్ లో వరద బాధితులకు సహాయ సామాగ్రి అందిస్తుండగా ఎంజీ నగర్ పోలీసు స్టేషన్ కు చెందిన స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ కుమార్ బైకుపై అక్కడికి వచ్చాడు. బైకుపైనే కూర్చుని ఓ వృద్ధురాలి నుంచి సహాయ సామాగ్రి కలిగిన సంచిని దౌర్జన్యంగా లాక్కుకోవడం వీడియోలో స్పష్టంగా కనబడింది. 20 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో పోలీసుల దందాకు అద్దం పట్టింది.
బాధ్యతగా వ్యవహారించాల్సిన పోలీసు వృద్ధురాలి నుంచి సహాయ సామాగ్రి లాక్కోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని ఓ వలంటీర్ వ్యాఖ్యానించాడు. ఇన్స్ పెక్టర్ కు ఎవరూ అడ్డుచెప్పకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. అయితే వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో నగర కమిషనర్ టీకే రాజేంద్రన్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. మొత్తం వీడియో ఫుటేజీని చూసిన తర్వాత కుమార్ పై చర్యలు తీసుకుంటామన్నారు.