నాలుగింతలు మోత
⇒ ఈసీఆర్‌లో అమలు
⇒ స్థానిక వాహనాలకు నెలసరి చార్జి
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న చెన్నై–పుదుచ్చేరి ఈస్ట్ కోస్ట్ రోడ్డులో టోల్ చార్జీల మోత మోగనుంది. శనివారం నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయి. స్థానిక వాహనాలకు నెలసరి అద్దెగా చార్జీలను నిర్ణయించడం విశేషం.
చెన్నైకి సమీపంలో ఒకటి, మహాబలిపురం తదుపరి మరొకటి చొప్పున రెండు టోల్ గేట్లను ఈ మార్గంలో ఏర్పాటుచేశారు. అటు వైపు దూసుకెళ్లే వాహనాలకు ఇది వరకు ఉన్న చార్జీ కన్నా, నాలుగింతలు పెంచి దినసరి మోత మోగించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే, ఈ పరిసరాల్లో నిత్యం స్థానికుల వాహనాలు రోడ్డెక్కుతుంటాయి. కార్లలో పయనం సాగించే వాళ్లు మరీ ఎక్కువే.
స్థానికంగా ఉన్న వాళ్లను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేకంగా నెలసరి చార్జీ అమల్లోకి తీసుకు రావడం విశేషం. ఆమేరకు ఆటో, జీపు కార్లు వంటి లైట్ వెహికల్స్‌కు ఓ చార్జీ, ట్రక్స్, ప్రభుత్వ వాహనాలు, జేసీబీ వంటి వారికి, బస్సులకు ప్రత్యేకంగా వేర్వేరు చార్జీలను నిర్ణయించడం గమనార్హం. అయితే, నెలసరి టోల్ చార్జీ కార్డును పొందాలనుకున్న వాళ్లు తాము ఈసీఆర్ రోడ్డు పరిసరాల్లో నివాసం ఉంటున్నట్టుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించక తప్పదు. ఈ చార్జీలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి.
సాక్షి, చెన్నై : కోవళం, ముట్టుకాడు, మహాబలి పురం సమీపాల్లో భారీ వంతెనలు నిర్మించి ఈ మార్గాల్లో రెండుచోట్ల టోల్ ప్లాజాలు ఏర్పాటుచేశారు. రాజధాని నగరం చెన్నై నుంచి సముద్రతీరం వెంబడి పుదుచ్చేరి వరకు 135 కి.మీ దూరం ఈస్ట్ కోస్ట్ రోడ్డులో పయనం ఆహ్లాదకరంగా ఉంటుంది. చెన్నై నగరం విస్తరిస్తుండటంతో ఈసీఆర్‌లో నిర్మాణాలు ఎక్కువే.
బహుళ అంతస్తుల భవనాలు కోకొల్ల లు. అనేక విదేశీ, స్వదేశీ సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ ఎక్కువే. నిర్మాణపరంగా, అభివృద్ధిపరంగా శర వేగంగా ఈ పరిసరాలు దూసుకెళ్తున్నాయి. కోవళం, మహాబలిపురం, ముట్టుకాడు వంటి పర్యాటక కేంద్రాలు, థీమ్ పార్క్‌లు, రిసార్ట్స్‌లు కూడా ఈపరిసరాల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈసీఆర్ రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుని రూ.272 కోట్లతో అభివృద్ధి పరిచింది. చెన్నై నుంచి మహాబలిపురం వరకు ఫోర్‌వేగా, అక్కడి నుంచి పుదుచ్చేరి వరకు టూవేగా రోడ్డును తీర్చిదిద్దింది.
కోవళం, ముట్టుకాడు, మహాబలిపురం సమీపాల్లో భారీ వంతెనలు కూడా నిర్మించింది. ఈ మార్గంలో రెండుచోట్ల టోల్ ప్లాజాను ఏర్పాటుచేశారు. ఆమేరకు ఇక, టోల్ మోతను అటు వైపుగా సాగే వారికి మోగించేందుకు సిద్ధం అయ్యారు.పూర్తిస్థాయిలో చార్జీల వివరాలు అందాల్సి ఉన్నా, రూ. 200 నుంచి రూ. 250 వరకు రెండు టోల్ గేట్లను దాటేందుకు ఓ వాహనానికి మోత మోగుతున్నట్టు సమాచారం. నెలసరి చార్జీలు మాత్రం మరీ తక్కువగానే నిర్ణయించి ఉన్నారని, అయితే, దినసరి చార్జీలు మరీ ఎక్కువగా ఉందంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజు స్థానికుల రూపంలో ఆయా టోల్ ప్లాజా సిబ్బందికి తంటాలు తప్పలేదు.