ఐఎస్ఎల్ ఫైనల్లో చెన్నైయిన్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో చెన్నైయిన్ ఎఫ్సీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రెండో అంచె సెమీస్లో అట్లెటికో డి కోల్కతా 2-1తో చెన్నైయిన్పై నెగ్గింది. అయితే రెండు సెమీస్ల్లో కలిపి చెన్నైయిన్ మొత్తం 4 గోల్స్ చేయగా, కోల్కతా రెండింటికి పరిమితమైంది. తొలి అంచె సెమీస్లో మూడు గోల్స్ వెనుకబడటం కోల్కతా అవకాశాలను బాగా దెబ్బతీసింది. చెన్నైయిన్తో జరిగిన రెండో అంచె సెమీస్ మ్యాచ్లో ఆరంభం నుంచే ఎదురుదాడి చేసినా ఎక్కువ గోల్స్ చేయడంలో విఫలమైంది.
కోల్కతా తరఫున డిజాన్ లికిస్ (22వ ని.), హ్యూమ్ (87వ ని.) గోల్స్ చేయగా, ఫిక్రు (90+2వ ని.) చెన్నైయిన్కు ఏకైక గోల్ అందించాడు. వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్న కోల్కతా మూడో గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా చెన్నైయిన్ డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు.
కోల్కతా కోచ్ హబాస్ పదేపదే రిఫరీ, లైన్స్మ్యాన్లతో గొడవపడటంతో మ్యాచ్ చివర్లో ఆయన్ని బయటకు పంపించారు. రెండో అర్ధభాగంలో వచ్చిన ఒకటి, రెండు అవకాశాలను చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో చెన్నైయిన్.. గోవా ఎఫ్సీతో అమీతుమీ తేల్చుకుంటుంది.