chennamaneni rajeswara rao
-
పత్రికా చక్రవర్తి రాఘవాచారి
తెలుగు పత్రికా రచయితల్లో నిరుపమానమైన మేధావి చక్రవర్తుల రాఘవాచారి. తెలుగు, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో పండితుడు. ఆయన మూర్తీభవించిన నిజాయితీపరుడు. ఆ నిజా యితీ వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సాంప్రదాయక అష్టగోత్ర బ్రాహ్మణ కుటుంబంలో జన్మిం చారు. అయిదో ఏటి నుంచే ప్రబంధాలు, ప్రాచీన కావ్యాలు, రామాయణ మహాభారతాలు చదివారు. ఆయనకు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ నేర్పడానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించారు. సంస్కృతం నేర్చుకోవడానికి ఆయనను ఆంధ్ర ప్రాంతంలోని పొన్నూరు పంపించారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం శాతాపురం గ్రామంలో జన్మించిన రాఘవాచారి సికింద్రాబాద్ సమీపంలోని లాలాగూడ రైల్వే పాఠశాలలో 11వ ఏట అయిదో తరగతిలో చేరారు. 1953 నుంచి రాఘవాచారి విశాలాంధ్ర చదవడం ప్రారంభించారు. నిజాం కళాశాలలో పి.యు.సి.లో చేరిన తరువాత పిలక తీసేశారు. పి.యు.సి.లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతటిలో ఆరవ ర్యాంకు సాధిం చారు. ఉస్మానియా విశ్వ విద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. కానీ ఇంజనీరింగు రెండో సంవత్సరంలోకి వచ్చేటప్పటికి ఆయనకు చదువు మీద ఆసక్తి తగ్గింది. వరంగల్ వెళ్లి బీఎస్సీలో చేరారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘంలో చేరారు. కళాశాల విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచారు. పట్టభద్రుడైన తరువాత హైదరాబాద్ వచ్చి న్యాయశాస్త్రం అభ్యసించారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ప్రతినిధిగా లా కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్ష స్థానానికి పోటీ చేశారు. అప్పుడు ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లిష్ చదువుతున్న ఎస్. జైపాల్ రెడ్డి వంటి వారు తీవ్రమైన వ్యతిరేక ప్రచారం చేసినా రాఘవాచారి అఖండ విజ యం సాధించారు. న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత ఎల్.ఎల్.ఎం. చేశారు. 1969–71 మధ్య ఆయన ఢిల్లీ నుంచి వెలువడే వామపక్ష అనుకూల పేట్రియట్ ఇంగ్లిష్ పత్రిక విలేకరిగా పని చేశారు. 1971లో ఆయన విజయవాడ వెళ్లి విశాలాంధ్రలో చేరారు. కొద్ది కాలానికే ఆ పత్రికకు సంపాదకులయ్యారు. 28 ఏళ్ల సుదీర్ఘ కాలం విశాలాంధ్ర సంపాదకులుగా ఉన్నారు. ఆయన సంపాదకీయాలు సూటిగా, స్పష్టంగా ఉండేవి. స్పష్టత, సంక్షిప్తత ఆయన శైలి. ‘తెలుగు పత్రికల పరిణామం–ప్రయోగాలు–ప్రయోజనం‘ అన్న వ్యాసంలో తెలుగు పత్రికా రంగంలో వాడే భాష ప్రామాణీకరణ జరగలేదని విచారం వ్యక్తం చేశారు. విజయవాడలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ఉపన్యాసకుడిగా ఆయనను ఆహ్వానించే వారు. ఆయన మాటల్లో అడుగడుగునా వ్యంగ్యం తొణికిసలాడుతుంది. ఆయన గొప్పవాడిగా కనిపించే ప్రయత్నం ఎన్నడూ చేయరు. మేధావిగా ఆయనకు ఎంత గుర్తింపు ఉన్నా ఎనిమిది పదుల వయసు నిండిన రాఘవాచారిలో కలివిడితనం తగ్గలేదు. ఆయనతో మాట్లాడిన వారు ఎవరైనా ఆయన జ్ఞాన విస్తృతి చూసి ముచ్చ టపడతారు. తెలుగు పత్రికా రంగానికి ఆయన చేసిన సేవను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్న రాఘవాచారి నిస్సందేహంగా మేధావి అయిన సంపాదకుడే. (రాఘవాచారి 81వ జన్మదినోత్సవం సందర్భంగా..) వ్యాసకర్త: చెన్నమనేని రాజేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు -
చెన్నమనేనికి ఘన నివాళి..
-
నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం
లౌక్యం, చతురత ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకునే వాగ్దానాలు చేసే నాయకులే సర్వసాధారణమైన రాజ కీయాల్లో... ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం, ముక్కుకు సూటిగా వ్యవహరించడం అరుదు. అలాంటి అరుదైన నేతే, ఎంఎస్ఆర్గా సుప్రసిద్ధులైన ఎం. సత్యనారాయణరావు. 82 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు దగ్గరలోని వెదిర గ్రామంలో ఆయన జన్మిం చారు. చిన్నప్పటి నుంచి పది మందితో అన్యోన్యంగా ఉండటం, సంభాషించడం ఆయనకు అలవాటు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అంటే విపరీతమైన అభిమానం. 1954 నుండి ఆయన యువజన కాంగ్రెస్ కార్యకలాపాల్లో పనిచేశారు. వి.పురుషోత్తమ్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కె.రామిరెడ్డి వంటి నాయకులతో సత్సంబంధాలుండేవి. విద్యానంతరం కరీంనగర్లో న్యాయవాద వృత్తి చేపట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెస్సార్ చురుగ్గా పాల్గొని, జైలు శిక్ష కూడా అనుభవించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసి గెలి చారు. అప్పటి నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని ఆయన ఎస్. బి.గిరితో కలిసి తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభలోనే ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. అయినా ఇందిరాగాంధీ కుట్రలు, కుతంత్రాలు ఎరుగని ఎమ్మెస్సార్‌ను అభిమానించి ఆయనను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 1977లో కాంగ్రెస్ ఓటమిపాలై, 1978లో చీలిపోయినప్పుడు ఆయన నిర్ద్వంద్వంగా ఇందిరను బలపరిచారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యద ర్శిగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణా టక, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రా ల్లో పార్టీని పర్యవేక్షించారు. ఆంధ్రప్ర దేశ్‌లో మర్రి చెన్నారెడ్డి తర్వాత టి. అంజయ్యను ముఖ్య మంత్రిని చేయడానికి ఆయనెంతో కృషిచేశారు. రాజీవ్ గాంధీ ఏపీ పర్యటన సందర్భంగా అంజయ్యతో అనుస రించిన వైఖరి అనుచితమని ఇందిరాగాంధీకి నిర్మొహ మాటంగా నివేదించారు. అది గిట్టని రాజీవ్‌గాంధీ 1984లో ఆయనకు లోక్‌సభ టికెట్ దక్కనియ్యలేదు. అయినా ఆయన పార్టీని వీడలేదు, నాయకత్వాన్ని విమ ర్శించలేదు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన సోనియాగాంధీ అనుయాయిగా ఉన్నారు. 2000లో సోనియా ఎమ్మెస్సార్‌ను ఏపీపీసీసీ అధ్యక్షునిగా నియ మించారు. ఆ పదవిలో ఉన్న మూడేళ్లు ఆయనకు రాజకీయంగా అత్యంత తృప్తినిచ్చిన కాలం. 2004 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్లో విజయం సాధించి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా చేరారు. 1990లో మొదటిసారి రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ అధ్యక్షులుగా పద వీ స్వీకారం చేసిన తర్వాత దఫాలుగా ఆయన మొత్తం దాదాపు 20 ఏళ్లు ఆ పదవిని నిర్వహించారు. అనారోగ్యం వల్ల గత కొద్దికాలంగా ఎమ్మెస్సార్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. అయినా ఇప్పటికీ ఆయన జ్ఞాపకశక్తి చెక్కుచెదరలేదు. ఎమ్మెస్సార్‌తో పరిచయం ఉన్న ప్రతివారూ గుర్తుపెట్టుకునేది ఆయన నిష్కల్మష త్వం, నిర్మొహమాటత్వం. రాజకీయాలలో ఆయన బల హీనత, బలం కూడా అవే. ఏ పదవిలో ఉన్నప్పటికీ ఎన్నడూ అవినీతి ఆరోపణలు ఎరుగని అరుదైన నిష్కళంక రాజకీయ నేత. సహస్ర చంద్ర దర్శనం (82 ఏళ్లు) చేసుకుంటున్న ఎం. సత్యనారాయణరావుకు శుభాకాంక్షలు, శుభకామనలు. (ఎమ్మెస్సార్ సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా) -చెన్నమనేని రాజేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు