నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం | m satyanarayana rao 82nd birth anniversary | Sakshi
Sakshi News home page

నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం

Published Wed, Jan 14 2015 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం

నిర్మొహమాటం... నిండైన వ్యక్తిత్వం

లౌక్యం, చతురత ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకునే వాగ్దానాలు చేసే నాయకులే సర్వసాధారణమైన రాజ కీయాల్లో... ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం, ముక్కుకు సూటిగా వ్యవహరించడం అరుదు. అలాంటి అరుదైన నేతే, ఎంఎస్‌ఆర్‌గా సుప్రసిద్ధులైన ఎం. సత్యనారాయణరావు. 82 ఏళ్ల క్రితం కరీంనగర్‌కు దగ్గరలోని వెదిర గ్రామంలో ఆయన జన్మిం చారు. చిన్నప్పటి నుంచి పది మందితో అన్యోన్యంగా ఉండటం, సంభాషించడం ఆయనకు అలవాటు. నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అంటే విపరీతమైన అభిమానం. 1954 నుండి ఆయన యువజన కాంగ్రెస్ కార్యకలాపాల్లో పనిచేశారు. వి.పురుషోత్తమ్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, కె.రామిరెడ్డి వంటి నాయకులతో సత్సంబంధాలుండేవి.

విద్యానంతరం కరీంనగర్‌లో న్యాయవాద వృత్తి చేపట్టారు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెస్సార్ చురుగ్గా పాల్గొని, జైలు శిక్ష కూడా అనుభవించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి తరఫున పోటీ చేసి గెలి చారు. అప్పటి నుండి వరుసగా మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని ఆయన ఎస్. బి.గిరితో కలిసి తీవ్రంగా వ్యతిరేకించారు. లోక్‌సభలోనే ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. అయినా ఇందిరాగాంధీ కుట్రలు, కుతంత్రాలు ఎరుగని ఎమ్మెస్సార్‌ను అభిమానించి ఆయనను అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.

1977లో కాంగ్రెస్ ఓటమిపాలై, 1978లో చీలిపోయినప్పుడు ఆయన నిర్ద్వంద్వంగా ఇందిరను బలపరిచారు. అఖిల భారత కాంగ్రెస్ కార్యద ర్శిగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణా టక, కేరళ, తమిళనాడు, గోవా రాష్ట్రా ల్లో పార్టీని పర్యవేక్షించారు. ఆంధ్రప్ర దేశ్‌లో మర్రి చెన్నారెడ్డి తర్వాత టి. అంజయ్యను ముఖ్య మంత్రిని చేయడానికి ఆయనెంతో కృషిచేశారు. రాజీవ్ గాంధీ ఏపీ పర్యటన సందర్భంగా అంజయ్యతో అనుస రించిన వైఖరి అనుచితమని ఇందిరాగాంధీకి నిర్మొహ మాటంగా నివేదించారు. అది గిట్టని రాజీవ్‌గాంధీ 1984లో ఆయనకు లోక్‌సభ టికెట్ దక్కనియ్యలేదు.  అయినా ఆయన పార్టీని వీడలేదు, నాయకత్వాన్ని విమ ర్శించలేదు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా ఆయన సోనియాగాంధీ అనుయాయిగా ఉన్నారు. 2000లో సోనియా ఎమ్మెస్సార్‌ను ఏపీపీసీసీ అధ్యక్షునిగా నియ మించారు. ఆ పదవిలో ఉన్న మూడేళ్లు ఆయనకు రాజకీయంగా అత్యంత తృప్తినిచ్చిన కాలం. 2004 శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్‌లో విజయం సాధించి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా చేరారు. 1990లో మొదటిసారి రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ అధ్యక్షులుగా పద వీ స్వీకారం చేసిన తర్వాత దఫాలుగా ఆయన మొత్తం దాదాపు 20 ఏళ్లు ఆ పదవిని నిర్వహించారు.

అనారోగ్యం వల్ల గత కొద్దికాలంగా ఎమ్మెస్సార్ రాజకీయాల్లో చురుగ్గా లేరు. అయినా ఇప్పటికీ ఆయన జ్ఞాపకశక్తి చెక్కుచెదరలేదు. ఎమ్మెస్సార్‌తో పరిచయం ఉన్న ప్రతివారూ గుర్తుపెట్టుకునేది ఆయన నిష్కల్మష త్వం, నిర్మొహమాటత్వం. రాజకీయాలలో ఆయన బల హీనత, బలం కూడా అవే. ఏ పదవిలో ఉన్నప్పటికీ ఎన్నడూ అవినీతి ఆరోపణలు ఎరుగని అరుదైన నిష్కళంక రాజకీయ నేత. సహస్ర చంద్ర దర్శనం (82 ఏళ్లు) చేసుకుంటున్న ఎం. సత్యనారాయణరావుకు శుభాకాంక్షలు, శుభకామనలు.  

(ఎమ్మెస్సార్ సహస్ర చంద్ర దర్శనం సందర్భంగా)
-చెన్నమనేని రాజేశ్వరరావు  సీనియర్ జర్నలిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement