8,9 తేదీల్లో చేపప్రసాదం పంపిణీ
పంజగుట్ట: ఆస్తమా, శ్వాస సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న వారికోసం ప్రతి ఏటా ఇచ్చే చేప ప్రసాద వితరణ ఈ సంవత్సరం జూన్ 8, 9 తేదీల్లో ఇవ్వనున్నట్లు బత్తిని మృగశిర ట్రస్ట్ సెక్రటరీ బి.హరినాథ్ గౌడ్ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్ అధ్యక్షులు విశ్వనాథం గౌడ్, అమర్నా«థ్ గౌడ్, అనిరుధ్‌లతో కలిసి మాట్లాడారు. చేప ప్రసాద వితరణకు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై 9వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. పోలీసులు, ఎగ్జిబిషన్ సొసైటీ వారు, విద్యుత్, జీహెచ్ఎంసీ, వాటర్‌వర్క్స్, ఫైర్, ఆర్అండ్బీ అన్ని శాఖలు తమకు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయన్నారు.
మత్స్యశాఖ రెండు లక్షలకు పైగా చేపపిల్లలు సిద్ధం చేస్తుందన్నారు. పలు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన వారికి భోజనం, ఫలాహారం, టీ, మజ్జిగ, నీరు, అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నారన్నారు. మొత్తం 42 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు, ఎక్కడ చేపపిల్లలు దొరుకుతాయి, ఎక్కడ ప్రసాదం లభ్యమౌతుంది అనే విషయాలు వలంటీర్లు చెపుతారన్నారు. గత ఏడాది సుమారు నాలుగున్నర లక్షల మందికి ప్రసాదం అందించినట్లు, ఈసారి ఆసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మాంసాహారులకు చేపలో వేస్తామని, విజిటేరియన్స్‌కు బెల్లంద్వారా అందిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రసాదం అందుకోలేనివారు మరుసటిరోజు దూద్‌బౌలి, కవాడీగూడ, కూకట్పల్లి, వనస్థలిపురంలోని తమ నివాసాల వద్ద అందిస్తామన్నారు. సమావేశంలో వర్థన్ తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బత్తిని హరినాథ్ గౌడ్