చోరీ అయిన విగ్రహం లభ్యం
రాయదుర్గం రూరల్ : ధర్మపురి అడవిలో చోరీ అయిన బేలోడు ఆంజనేయస్వామి రాతి విగ్రహం, పాదాలు సోమవారం గుమ్మఘట్ట మండలం చెరువుదొడ్డిలో లభ్యమైంది. రాయదుర్గంలోని 74 ఉడేగోళం, రాయదుర్గం, కొంతానపల్లి, రాతిబావివంక, చదం, æబేలోడు, చెరువుదొడ్డి, సౌళూరు, తాళ్లకెర, బుడిమేపల్లి, గోవిందయ్య దొడ్డి తదితర గ్రామాల ప్రజలు ఆంజనేయస్వామిని ఆరాధ్యదైవంగా పూజించేవారు. తొమ్మిదో తేదీన రాతివిగ్రహం, పాదాలు కనిపించకపోవడాన్ని గొర్రెలకాపరులు గుర్తించి సమీప గ్రామస్తులకు సమాచారమందించారు.
ఈ మేరకు భక్తులు పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భక్తులు క్షేత్రస్థాయిలో సమీప గ్రామాలన్నింటినీ తిరిగి స్వామి విగ్రహం కోసం గాలించారు. అయితే స్వామి వారి రాతి విగ్రహాన్ని ఎత్తుకుపోయి చెరువుదొడ్డి గ్రామ సమీపంలో ఆదివారం ప్రతిష్టాపన చేస్తుండగా రంగప్ప (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మహిమ గల స్వామి వారిని తీసుకెళితే తన మహత్యాన్ని చూపించారని ఆయా గ్రామాల ప్రజలు చర్చించుకుంటున్నారు.