Chetan Kumar Ahimsa
-
భారతదేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్.. ఎవరీ పల్వంకర్ బాలూ
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి చెందిన విషయం తెలిసిందే. లీగ్ మ్యాచుల్లో అదరగొట్టి ఓటమి ఎరుగని జట్టుగా పేరుతెచ్చిన భారత్.. ఫైనల్లో చతికిలబడింది. తుదిపోరులో ఆరు వికేట్ల తేడాతో రోహిత్ సేన జట్టు కంగారుల చేతిలో ఘోర పరాజయపాలైంది. అయితే హోం గ్రౌండ్లో టీమిండియా ఓటమిని భారత క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 12 తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడుతుందనుకున్న భారత్‌కు ఇలా జరగడంపై తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఉద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ తరుణంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ కుమార్ అహింస చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. క్రికెట్లో కూడా రిజర్వేషన్లు ఉండాలని, ఒకవేళ ఇప్పటికే రిజర్వేషన్లు ఉంటే భారత్ వరల్డ్‌కప్ సులువగా గెలిచేదని తెలిపారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. డబ్బు, కీర్తి కోసం కాకుండా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లు దేశానికి అవసరమని.. 1876లో కర్ణాటకలోని ధర్వాడ్‌లో జన్మించిన భారత దేశపు మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వకంర్ బాలూ ప్రస్తావన తీసుకొచ్చారు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ క్రికెటర్(బౌలర్)గా, సామాజిక, రాజకీయ కార్యకర్తగా చురుకుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేతన్ అహింస ప్రస్తావనతో పల్వంకర్ బాలూ గురించి బయటకొచ్చింది. పల్వంకర్ బాలూ భారతీయ క్రికెటర్, రాజకీయ కార్యకర్త. 1876 మార్చి 19న కర్ణాటకలోని ధార్వాడ్‌లో(ఒకప్పటి బాంబే ప్రెసిడెన్సీ) జన్మించాడు. ప్రపంచ క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు సాధించిన దళిత సమాజానికి చెందిన మొదటి వ్యక్తిగా బాలూ చరిత్రకెక్కాడు. అతడు పరమానందాస్ జీవందాస్ హిందూ జింఖానా, బాంబే బెరార్, కేంద్ర రైల్వేశాఖకు చెందిన కార్పొరేట్ క్రికెట్ జట్టు తరపున ఆడాడు. ఎడమ చేతి స్పిన్ బౌలర్ అయిన బాలూ.. మొత్తం 33 ఫస్ట్-క్లాస్మ్యాచ్లలో (15.21 బౌలింగ్ సగటుతో) 179 వికెట్లు పడగొట్టాడు. 1911 ఇంగ్లాండ్ పర్యటనలో ఇండియా తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ‘రోడ్స్ ఆఫ్ ఇండియా’గా పేరు సంపాదించాడు. అయితే బాలూ తన సామాజిక వర్గం కారణంగా కెరీర్లో అనేక వివక్షతను ఎదుర్కొన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ముద్ర పడటంతో సమాన అవకాశాలు దక్కలేదనే విమర్శ ఉంది. ఒకసారి పుణెలో మ్యాచ్ ఆడుతుండగా.. టీ విరామం సమయంలో అతనికి టీం సభ్యులందరితో కాకుండా బయట డిస్పోజబుల్ కప్పులో అందించినట్లు, అతనికి భోజనం కూడా ప్రత్యేక టేబుల్‌పై వడ్డించినట్లు వార్తలొచ్చాయి. పల్వంకర్ తన ముఖం కడక్కోవాలనుకున్నా అణగారిన వర్గానికి చెందిన అటెండర్ అతనికి ఒక మూలన నీళ్లు తెచ్చి పెట్టేవాడని తెలుస్తోంది. అయితే బాలూ బొంబాయికి మారిన తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. క్వాడ్రాంగ్యులర్ టోర్నమెంట్లో అతనికి హిందూ జట్టు కెప్టెన్సీ నిరాకరించారు. భారత క్రికెట్ చరిత్రలో గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పల్వంకర్ పేరు గాంచారు. గాంధీ భావజాలంతో ప్రభావితమై.. దేశంలో హోమ్ రూల్ తీసుకురావడానికి కృషి చేశాడు. 1910లో పల్వంకర్ బీఆర్ అంబేద్కర్‌ను తొలిసారి కలిశాడు. అనంతరం ఇరువురు మంచి మిత్రులుగా మారారు. వీరిద్దరూ అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేసి ప్రశంసలు అందుకున్నారు. అనంతరం వీరిద్దరి మధ్య స్నేహం దెబ్బతింది. 1932లో అణగారిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన డిమాండ్‌ను బాలూ వ్యతిరేకించాడు. అనంతరం అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ‘రాజా-మూంజే ఒప్పందం’పై సంతకమూ చేశాడు. అంబేద్కర్ బౌద్ధమతంలోకి మారాలనే తన ఉద్దేశాన్ని వ్యక్తం చేసినప్పుడు.. అణగారిన వర్గాలను ఇతర మతాల్లోకి మార్చడాన్ని 'ఆత్మహత్య'గా అభివర్ణించాడు. 1933లో బాలూ హిందూ మహాసభ టికెట్‌పై బొంబాయి మున్సిపాలిటీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓటమి చెందాడు. నాలుగు సంవత్సరాల తరువాత కాంగ్రెస్‌లో చేరి బొంబాయి శాసనసభ ఎన్నికలలో బీఆర్ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసి మరోసారి పరాజయం పొందాడు. స్వాతంత్ర్యం అనంతరం 1955 జూలై4న బాంబే స్టేట్‌లో మరణించాడు. డాయన అంత్యక్రియలకు పలువురు జాతీయ నాయకులు మరియు క్రికెటర్లు హాజరయ్యారు. -
ప్రశ్నలతో తరచూ వివాదాల్లోకి! చేతన్ అహింస బ్యాక్‌గ్రౌండ్!
ముక్కుసూటిగా మాట్లాడే వైఖరి.. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పే ధైర్యం.. నటుడు చేతన్ కుమార్ సొంతం. కానీ దీనివల్ల ఎన్నో సార్లు విమర్శలు, వివాదాలు అతడిని చుట్టుముట్టాయి. అయినా వాటిని లెక్క చేయకుండా తనకు నచ్చింది చేసుకుంటూ పోతున్నాడు. భారత క్రికెట్ జట్టులో రిజర్వేషన్ ఉండి తీరాల్సిందేనంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమ్ముదుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో చేతన్ కుమార్ అలియాస్ చేతన్ అహింస ఎవరనేది ఓసారి చూద్దాం.. అమెరికా నుంచి వచ్చి.. చేతన్ కుమార్ 1983 ఫిబ్రవరి 24న అమెరికాలో జన్మించాడు. అతడికి అమెరికన్ పౌరసత్వం ఉంది. ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ అమెరికాలో డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వీరు కర్ణాటక నుంచి వలస వెళ్లినవారే! 2005లో యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న చేతన్ అక్కడ చదువుకునే సమయంలో కుల, మత, లింగ బేధాల గురించి అధ్యయనం చేశాడు. ఫుల్బ్రైట్ స్కాలర్ అందుకున్న ఇతడు ఈ ప్రాజెక్ట్‌పై మరింత అధ్యయనం చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. ఇక్కడికి వచ్చాక సమాజంలో జరుగుతున్న సమస్యలు తనను నిద్ర పోనీయకుండా చేశాయి. ఆ రెండే ఇష్టం చేతన్‌కు రెండే రెండు ఇష్టం.. ఒకటి నటన, రెండు సామాజిక సేవ. 2005లోనే చికాగో వదిలేసి పూర్తిగా ఇండియాకు షిఫ్ట్ అయిన ఇతడు తన కలలను సాకారం చేసుకున్నాడు. ముందుగా మైసూరుకు 25 కి.మీ. దూరంలో ఉన్న ముల్లూరు అనే గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. తర్వాత విస్తారా అనే థియేటర్ గ్రూపులో చేరి నటుడిగా మారాడు. ఇక తన ప్రాజెక్టు కోసం కర్ణాటక అంతా తిరుగుతున్న సమయంలో డైరెక్టర్ కేఎమ్ చైతన్యను కలిశాడు. అతడు చేతన్‌ను హీరోగా పెట్టి ఆ దినగాలు అనే కన్నడ సినిమా చేశాడు. ఇది అగ్ని శ్రీధర్ అనే అండర్ వరల్డ్ డాన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 2007లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. అలా అహింస తోడైంది తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఇతడికి హీరోగా మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా ఎనిమిది సినిమాలు చేశాక చేతన్ కుమార్ తన పేరు పక్కన అహింస అనే పదాన్ని జోడించాడు. సామాజిక కార్యకర్తగా తన ఆశయాన్ని, లక్ష్యాన్ని తన పేరులో ఇనుమడింపజేసేందుకు చేతన్ కుమార్ అహింసగా మారాడు. లింగాయత్, ఎల్జీబీటీక్యూఐ, దళితులు, ఆదివాసీలు, రైతులు.. బడుగు బలహీన వర్గాల కోసం ఎప్పటినుంచో ముందుండి పోరాడుతున్నాడు. తను నమ్మే సిద్ధాంతాలు, ఆశయాల కోసం ఎంతవరకైనా వెళ్తాడు. గర్భిణీల వెంట్రుకలు తినాలట.. సాధారణంగా సినీ సెలబ్రిటీలు దేనిపైనా స్పందించడానికి ఇష్టపడరు. కానీ చేతన్ మాత్రం అందుకు భిన్నంగా తన అభిప్రాయాన్ని బల్లగుద్ది చెప్తాడు. 2017లో అజ్జలు పద్ధతి అనే సాంప్రదాయాన్ని బహష్కరించేందుకు పెద్ద పోరాటమే చేశాడు. ఈ సాంప్రదాయం ప్రకారం ఉన్నత వర్గానికి చెందిన గర్భిణీల వెంట్రుకలు, గోళ్లను తక్కువ వర్గానికి చెందినవారు తినాలి. దీన్ని రూపుమాపాలంటూ చేతన్ చేసిన పోరాటం ప్రభుత్వాన్నే కదిలించింది. ఆ సాంప్రదాయన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా ఎన్నో పోరాటాలు చేశాడు. ఓసారి ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడంతో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. పలుమార్లు అసందర్భ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలు కూడా అయ్యాడు. పెళ్లిలో అదే స్పెషల్ చేతన్ 2020 ఫిబ్రవరి 2న మేఘ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కూడా అనాథాశ్రమంలో జరిగింది. పెళ్లి పత్రికలు కూడా విభిన్నంగా రూపొందించారు. వాటిని మట్టిలో పాతిపెట్టితే మొలకలు వచ్చేలా వెడ్డింగ్ కార్డ్‌లో విత్తనాన్ని పొందుపరిచారు. ట్రాన్స్‌జెండర్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. వివాహానికి వచ్చిన అతిథులకు భారత రాజ్యాంగ పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం విశేషం. చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
వరల్డ్‌కప్‌లో భారత్ ఓటమి.. నటుడి సంచలన వ్యాఖ్యలు
కోట్లాది మంది కల ఒక్కసారిగా బుగ్గిపాలైంది. గెలుపును మాత్రమే కలగన్నవారికి ఒక్కసారిగా భంగపాటు ఎదురైంది. అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్పు ఎగరేసుకుపోయింది. టీమిండియా ఓటమితో యావత్ భారత్ ఉద్వేగానికి లోనైంది. భారత జట్టు మరోసారి చరిత్ర తిరగరాస్తుందనుకుంటే ఇలా జరిగిందేంటని క్రికెట్ అభిమానులు కలత చెందారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో కన్నడ నటుడు, సామాజిక కార్యకర్త చేతన్ అహింస వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'నేను మళ్లీ చెప్తున్నా.. క్రికెట్ క్రీడలో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. ఆ రిజర్వేషన్స్ ఈపాటికే అమలై ఉంటే భారత్ వరల్డ్ కప్ సులువుగా గెలిచేది' అని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'అందరూ బాధలో ఉంటే నీ గోల ఏంటి?', 'ఇక్కడ కూడా రిజర్వేషన్లా?', 'పెద్ద సైకోలా ఉన్నావే?' అని ట్రోల్ చేస్తున్నారు. వరల్డ్ కప్ జరిగే రోజు చేతన్ మరో ట్వీట్ కూడా చేశాడు. 'ఈ రోజు క్రికెటర్లు బంతి క్యాచ్ చేస్తారు, లేదంటే విసురుతారు.. దాన్ని బ్యాట్‌తో కొడతారు.. అంతే తప్ప దేశ నిర్మాణం కోసం ఇసుమంత సాయం కూడా చేయరు. వందేళ్ల క్రితం పల్వంకర్ బాలూ అని ఓ దళిత క్రికెటర్ సామాజిక కార్యకర్తగా చురుకుగా పనిచేశాడు. డబ్బు, ఫేమ్ కోసం పాటుపడే వాళ్లు కాకుండా ఇతడిలా సమాజం గురించి ఆలోచించే ఆటగాళ్లే దేశానికి అవసరం' అని ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు. ఈయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I repeat, India needs reservations in cricket If India had cricket reservations, India would’ve easily won this #WorldCup ನಾನು ಮತ್ತೆ ಹೇಳುತಿದ್ದೇನೆ, ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಅಗತ್ಯವಿದೆ ಭಾರತಕ್ಕೆ ಕ್ರಿಕೆಟ್ನಲ್ಲಿ ಮೀಸಲಾತಿ ಇದ್ದಿದ್ದರೆ ಭಾರತ ಸುಲಭವಾಗಿ ಈ ವಿಶ್ವ ಕಪ್ಪನ್ನು ಗೆಲ್ಲುತ್ತಿತ್ತು — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 Indian cricketers today can throw/catch/hit a ball but dont contribute much to nation-building 100+ yrs ago, Palwankar Baloo—Dharwad-born bowler & India’s 1st Dalit cricketer—was an activist & acquaintance of Babasaheb India needs cricketrs who care fr society—not money & glory pic.twitter.com/L0Rs08LzxU — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) November 19, 2023 చదవండి: దాదాపు రూ. లక్షన్నర తీసుకునే స్థాయి నుంచి కోట్లు డిమాండ్ చేస్తోన్న హీరో