ధారూరు రైల్వేస్టేషన్లో అధికారుల పర్యటన
ధారూరు, న్యూస్‌లైన్: సైడింగ్ రైల్వే లైన్ల ఏర్పాటు విషయమై ఆదివారం ఓ రైల్వే ఉన్నతాధికారి ఇంజినీరింగ్ సిబ్బంది, చెట్టినాడు సిమెంట్ కంపెనీ ప్రతినిధులు కలిసి ధారూరు రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. వికారాబాద్ మార్గంలో ఉన్న సోనీ సుద్ద కంపెనీ నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు మధ్యలో ఉన్న దూరాన్ని ఆయన పరిశీలించారు.
కాగా అధికారులు సందర్శన విషయాన్ని గోప్యంగా ఉంచారు. తాండూరు మార్గంలో రైల్వే స్టేషన్ సమీపంలో కొత్తగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి విషయంలో గతంలో స్థానికులు ఆందోళన దిగిన నేపథ్యంలో అధికారులు రైల్వే సైడింగ్ లైన్ల నిర్మాణం విషయాన్ని గోప్యతను పాటిస్తున్నట్లు తెలిసింది. రైల్వే శాఖ సీసీఎస్ క్రిస్టఫర్ రైల్వే సైడింగ్ లైన్లు ఎన్ని వేయాలి..? ఎంత దూరం ఏర్పాటు చేయాలి..? ఎన్ని గూడ్స్ రైళ్లు ఆగే వీలుందనే వివరాలను సేకరించారు. రైల్వే సైడింగ్ లైన్లు వేయాలంటే తాండూరు వైపు ఎక్కువ వంపుగా ఉండడంతో చదును చేసేందుకు తీసుకోవాల్సి చర్యలను గురించి ఇంజినీరింగ్ సిబ్బందితో మాట్లాడారు.
ముందుగానే సిద్ధం చేసుకున్న మ్యాప్ ప్రకారం సైడింగ్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అధికారుల పర్యటన వివరాల కోసం విలేకరులు రైల్వే అధికారిని వివరణ కోరగా ఆయన స్పందించలేదు. కాగా ధారూరులో స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. మీ స్టేషన్ నుంచి రోజుకు 150 మంది మాత్రమే ప్రయాణం చేస్తున్నారని, ప్రస్తుతం నడుపుతున్న ప్యాసింజర్ రైళ్లలో కొన్నింటిని హాల్టింగ్ నుంచి తప్పించాల్సి ఉంటుందన్నారు.
ధారూరుకు 4 కిలోమీటర్ల దూరంలో స్టేషన్ ఉండడంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగకపోవడంతో తాండూరు, వికారాబాద్‌కు బస్సుల్లో వెళ్లి అక్కడి నుంచి రైళ్లలో వెళ్తున్నట్లు విలేకరులు చెప్పగా.. అయితే మీ గ్రామం వరకు కొత్తగా రైల్వే లైన్ వేయమంటారా..? అంటూ ఎదురు ప్రశ్నించా రు. ఆయన వైఖరితో విలేకరులు నిర్ఘాంతపోయారు.