Chevella Lok Sabha constituency
-
‘చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్నారు’
సాక్షి,హైదరాబాద్: తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం సమావేశం అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని తెలిపారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చిందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుండి కాంగ్రెస్, బీజెపి అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతామని అన్నారు. చదవండి: కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ కవిత వార్నింగ్.. విషయం ఏంటంటే? -
వరాల జల్లు
‘ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలుపుతాం. పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో.. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల మేర సాగు నీరు అందిస్తాం. సాధ్యమైనంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తాం. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తెస్తాం. అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తా. రంజిత్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి’ – వికారాబాద్ సభలో సీఎం కేసీఆర్ వికారాబాద్: ఉమ్మడి జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వికారాబాద్‌లోని కలెక్టరేట్ నూతన భవనం సమీపంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఎత్తివేసిన వెంటనే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల డిమాండ్ మేరకు జోన్‌ను మార్చేస్తామని తెలిపారు. తాను 1985లో అనంతగిరికి వచ్చానని, అప్పుడే అనంతగిరి గొప్పతనం తెలుకున్నానని చెప్పారు. ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయి కాబట్టే అప్పటి నిజాం నవాబు ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించారని తెలిపారు. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. జిల్లాలో అనేక సమస్యలున్నాయని.. తానే స్వయంగా వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చదువుకున్న వ్యక్తి, బహుభాషా కోవిధుడని తెలిపారు. కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి లక్ష ఓట్ల మెజార్టీ అందించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనను ఎప్పుడు కలిసినా 111 జీఓను ఎత్తివేయాలని కోరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎంత మెజార్టీ ఇస్తే అంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతగిరిని అభివృద్ధి చేస్తా... జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని సీఎం స్పష్టంచేశారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు లక్ష ఎకరాల చొప్పున సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతగిరి తెలంగాణ రాష్ట్రానికే ఊటీలాగ ఉంటుందని, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం హామీలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. చప్పట్లు కొడుతూ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, రాంచంద్రారెడ్డి, భూమోళ్ల కృష్ణయ్య, తాండూరు విజయ్‌కుమార్, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
సోనియా పర్యటన రద్దు
యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీని ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి లబ్ధిపొందాలనుకున్న కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం పూడురు మండలంలోని మీర్జాపూర్లో ఆదివారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా సోనియా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రచారానికి ఎదురు దెబ్బ తగిలింది. సోనియాగాంధీ పర్యటన రద్దయింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక్కరే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కేటీఆర్ రోడ్‌షోలు నిర్వహించటంతోపాటు కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రచారంలో గులాబీ నేతలు దూసుకుపోతుంటే హస్తం శ్రేణులు కొంత వెనకబడ్డాయి. దీన్ని అధిగమించేందుకు లక్ష మందితో సోనియాసభ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కొండా భావించారు. ఈ మేరకు మిర్జాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం సర్వం సిద్ధం చేశారు. అనుకోకుండా సోనియా పర్యటన రద్దు కావడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె వస్తే చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో విజయావకాశాలు మెరుగయ్యేవని చెబుతున్నారు. సోనియ రాకపోవటం ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆమె పర్యటన రద్దు కావడంతో కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు. జాతీయ నాయకుల రాక.. సోనియా పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్ నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పలువురు జాతీయ నాయకులను ఆహ్వానించారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాధిత్య సింథియా, ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరై ప్రసంగించనున్నారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుంది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మందితో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మీటింగ్ సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. సభను విజయవంతం చేస్తాం... చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. సోనియా పర్యటపై ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల యూపీఏ చైర్పర్సన్ సోనియా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మిర్జాపూర్‌లో లక్షమందితో యథావిధిగా బహిరంగసభ జరుగుతుందన్నారు. దీనికి సచిన్ పైలెట్, ఆజాద్, విజయశాంతి తదితరులు హాజరుకానున్నట్లు చెప్పారు. -
జెండాలు వేరు.. ఎజెండా ఒక్కటే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల గడువు మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఈ తక్కువ సమయంలో వీలైనంత అధిక సంఖ్యలో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. వీరి పార్టీల జెండాలు వేరైనా.. ఎజెండా మాత్రం ఒక్కటే. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన సమస్యలే వీరి ప్రచార అస్త్రాలుగా మారాయి. ఎక్కడికి వెళ్లినా వీటిని పరిష్కారం చేస్తామని హామీలు గుప్పిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల హామీలు ఇంచుమించు ఒకేతీరుగా ఉండటంతో ఓటర్లు ఆలోచనలో పడ్డారు. ఇచ్చిన మాటకు ఎవరు కట్టుబడి ఉంటారోనని లోతుగా విశ్లేషిస్తున్నారు. అభ్యర్థుల వ్యక్తిత్వం, రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యం, ప్రజాసేవ, ప్రజల్లో నమ్మకం, నాయకత్వ లక్షణాలు, స్థానికత, గుర్తింపు, చరిష్మా, రాజకీయపార్టీ తదితర కోణాలను పరిశీలిస్తున్నారు. వీటన్నింటిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే సరైన అభ్యర్థికి ఓటు వేస్తామని చెబుతున్నారు. ఓటర్ల అభిమతం ఇలా ఉండగా.. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ శక్తి మేరకు హామీలను నెరవేర్చుతామన్న భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. అందరి ఎజెండా ఇదే జోనల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వికారాబాద్ జిల్లాను జోగులాంబ గద్వాలలో కలిపారు. గతంలో ఈ ప్రాంతం ఆరో జోన్లో కొనసాగింది. కొత్త జోన్లో కలపడం వల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమను చార్మినార్‌లో కొనసాగించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ సమస్యను పరిష్కరిస్తామని మూడు ప్రధాన పార్టీలు హామీ ఇస్తున్నాయి. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరంలో కొంతభాగం మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రజలకు జీవనాధారం వ్యవసాయమే. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి çముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రాణహిత–చేవెళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మళ్లించి అప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాంతాల్లోని 2.46 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టింది. చేవెళ్ల ప్రాంతాన్ని ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నుంచి తొలగించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో చేవెళ్ల ప్రాంతం లేదని, కృష్ణానది బేసిన్ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నుంచి నీరిచ్చేలా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్‌కు డిజైన్లు చేశారు. రూ.32,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయంచారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్టు అతీగతీ లేకుండా పోయింది. అయితే చేవెళ్ల లోకసభ పరిధిలోని ప్రాంతాలకు నిర్దేశించిన 19, 20, 21 ప్యాకేజీల పనులు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైతుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన అభ్యర్థులు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇందుకు కోసం ఎన్ని నిధులనైనా ఖర్చు చేస్తామంటోంది. ప్రాజెక్టును పూర్తి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. అవరసమైతే ఎంతవరకైనా ఉద్యమిస్తామంటోంది. ఇక బీజేపీ పార్టీ కూడా ఇదే కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రచారం చేస్తోంది. తాండూరులో ప్రధాన పంట కంది. ఏటా పెద్ద ఎత్తున పంట దిగుబడి వస్తున్నా రైతులకు సరైన దక్కడం లేదు. దీంతో కంది బోర్డు ఏర్పాటు చేస్తే తమకు న్యాయం జరుగుతుందని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గతంలో ఆయా పార్టీలు హామీలు ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. మళ్లీ ఎన్నికల వేళ కంది ఏర్పాటు అంశంపై అన్ని పార్టీలు స్పందిస్తున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి కంది బోర్డు ఆశయం నెరవేర్చుతామని భరోసా కల్పిస్తున్నాయి. శేరిలింగంపల్లి నుంచి వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ విస్తరణ హామీ నీటిమీది రాతగానే మారిపోతోంది. ఏళ్లనాటి ఈ ఆకాంక్షని మొన్నటి వరకు రాజకీయ పార్టీలు పరిగణనలోకి తీసుకోనేలేదు. ఎంఎంటీఎస్ విస్తరణకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నాయి. వికారాబాద్ శాటిలైట్ పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. నెలలు గడుస్తున్నా రెండు అడుగులు ముందుకు.. మూడడుగులు వెనక్కి చందంగా మారింది. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి. నాపరాతికి పేరుగాంచిన తాండూరు ప్రాంతం పూర్తి కాలుష్యమయమైంది. ఇక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చడమనేది గగనం. అధికసంఖ్యలో ఉన్న నాపరాతి పరిశ్రమలు, గ్రానైట్ క్వారీల నుంచి వెలువడుతున్న కాలుష్య కారకాల నుంచి స్థానికులు ఆరోగ్యం పాలవుతున్నారు. అయితే కాలుష్య నియంత్రణకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్నా చలనం కరువైంది. దీనిపై ఆయా పార్టీలు స్పందిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాయి. రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని 84 గ్రామాలు 111 జీవో పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్‌కు తాగునీరందించే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని ఆ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలకు అనుమతి లేదు. దీంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్నా అభివృద్ధి పరంగా చాలా వెనకబడ్డామని స్థానికులు కలత చెందుతున్నారు. అభివృద్ధికి ఆటంకంగా మారిన ఈ జీఓను ఎత్తివేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు నెలల్లో జీఓను రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఈ దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా.. 111 జీఓ పరిష్కారానికి నిపుణల కమిటీతో అధ్యయనం చేయించి, న్యాయపరమైన, పర్యావరణ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని ఆ పార్టీ హామీ ఇస్తోంది. తాము గెలిస్తే వెంటనే జీఓ రద్దు చేస్తామని కాంగ్రెస్, బీజేపీలు పేర్కొంటున్నాయి. చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఈ ప్రాంతంలో 8 శాతం మందే వేతన జీవులు ఉండటం గమనార్హం. స్థానికంగా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉంది. తద్వారా ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని స్థానికులు చెబుతున్నారు. వీరి కోరిక మేరకు ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. -
చేవెళ్ల బరిలో ఎవరో..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ రాజకీ యం చేవెళ్ల లోక్‌సభ స్థానం చుట్టూ పరిభ్రమిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఈ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ఈ సారి రాజేంద్రనగర్ శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కార్తీక్.. పాత పరిచయాలతో గట్టెక్కవచ్చని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రాజేంద్రనగర్ ప్రాంతం చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండేది. ఈ నియోజకవర్గానికి తల్లిదం డ్రులు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించినందున స్థానికంగా గట్టి పట్టుంది. ఈ పలుకుబడితో శాసనసభలోకి అడుగు పెట్టడం సులువని కార్తీక్ భావిస్తున్నారు. సబితమ్మ కూడా.. గత ఎన్నికల్లో కుమారుడి కోసం టికెట్‌ను త్యాగం చేసిన సబితా ఇంద్రారెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబానికి ఒకే టికెట్ అనే పార్టీ నిబంధనల నేపథ్యంలో 2014లో మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని ఆమె వదులుకున్నారు. ఈ సారి మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి నిబంధనలూ విధించకూడదని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అసెంబ్లీకి పోటీచేయాలా? పార్లమెంటు బరిలో దిగాలా? అనే అంశంపై ఇటీవలి వరకు ఊగిసలాటలో ఉన్న సబిత.. తాజాగా మహేశ్వరం వైపే మొగ్గుచూపుతున్నట్లు ఆంతరంగికులు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే పీసీసీ పెద్దలందరూ సీఎం పదవి రేసులో ఉంటారు గనుక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదని మొన్నటివరకు సబిత భావించారు. అయితే, చేవెళ్ల ఎంపీ స్థానం ఆర్థికంగా, వయసురీత్యా మంచిది కాదనే భావనలో ఆమె ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియాను కలిసి మనసులోని మాట వెల్లడించినట్లు తెలుస్తోంది. కార్తీక్, తాను శాసనసభ స్థానాలకే పోటీ చేస్తామనే అంతరంగాన్ని సబిత బహిర్గతం చేశారు. కేఎల్లార్ బెటర్! ఎంపీ సీటుకు పోటీచేసేందుకు ఆసక్తి చూపని సబిత.. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సూచించినట్లు తెలిసింది. స్థానికుడేగాకుండా లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్ల ప్రజలతో సత్సంబంధాలుండడం పార్టీకి కలిసివస్తుందనే భావన వ్యక్తం చేశారు. ఆయన బరిలో దిగితే అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లుపార్టీవర్గాలు తెలిపాయి. అయితే, ఇదే అంశంపై కేఎల్లార్ మనోగతాన్ని కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని కేఎల్లార్ స్పష్టం చేస్తున్నా.. ఆయన మాత్రం మేడ్చల్ నుంచి అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా తెరపైకి కాసాని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ‘మన పార్టీ’ని స్థాపించిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో విలీనం చేశారు. అదే పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభ స్థానానికి పోటీచేసి భంగపడ్డ తర్వాత సొంత గూటికి చేరిన ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ సీటుపై కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ పెద్దలు కుంతియా, కొప్పుల రాజును కలిసి మనోగతాన్ని వెల్లడించారు. ఆ తర్వాత కాసాని అభ్యర్థిత్వంపై చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని అధిష్టానం ముఖ్యులు తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మాత్రం.. సబిత, కేఎల్లార్ ఒప్పుకోకపోతే కాసాని పేరును పరిశీలించాలని నివేదించినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జ్ఞానేశ్వర్ తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది. -
చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం రాత్రి వచ్చిన యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను కృష్ణయ్యను ఎపుడో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని, తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని చెప్పారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన శిబు సోరెన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీలు దండు కడి తే అన్ని పార్టీలు దారికి వస్తాయన్నారు. టీడీపీతో కలిసి పనిచేసే విషయమై తమ సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిన టీడీపీపై ఎవ్వరూ విమర్శలు చేసినా సహించే ది లేదన్నారు. మాజీ ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం చంద్రబాబును కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు టీడీపీ నేతలు నివాళులర్పించారు.