సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కాంగ్రెస్ రాజకీ యం చేవెళ్ల లోక్‌సభ స్థానం చుట్టూ పరిభ్రమిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి బరిలో దిగేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి ఈ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇక్కడి నుంచి పోటీచేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ఈ సారి రాజేంద్రనగర్ శాసనసభ స్థానం నుంచి బరిలోకి దిగే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న కార్తీక్.. పాత పరిచయాలతో గట్టెక్కవచ్చని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు రాజేంద్రనగర్ ప్రాంతం చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండేది. ఈ నియోజకవర్గానికి తల్లిదం డ్రులు సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించినందున స్థానికంగా గట్టి పట్టుంది. ఈ పలుకుబడితో శాసనసభలోకి అడుగు పెట్టడం సులువని కార్తీక్ భావిస్తున్నారు.
సబితమ్మ కూడా..
గత ఎన్నికల్లో కుమారుడి కోసం టికెట్‌ను త్యాగం చేసిన సబితా ఇంద్రారెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబానికి ఒకే టికెట్ అనే పార్టీ నిబంధనల నేపథ్యంలో 2014లో మహేశ్వరం సిట్టింగ్ స్థానాన్ని ఆమె వదులుకున్నారు. ఈ సారి మాత్రం ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి నిబంధనలూ విధించకూడదని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, అసెంబ్లీకి పోటీచేయాలా? పార్లమెంటు బరిలో దిగాలా? అనే అంశంపై ఇటీవలి వరకు ఊగిసలాటలో ఉన్న సబిత.. తాజాగా మహేశ్వరం వైపే మొగ్గుచూపుతున్నట్లు ఆంతరంగికులు చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే పీసీసీ పెద్దలందరూ సీఎం పదవి రేసులో ఉంటారు గనుక జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం మంచిదని మొన్నటివరకు సబిత భావించారు. అయితే, చేవెళ్ల ఎంపీ స్థానం ఆర్థికంగా, వయసురీత్యా మంచిది కాదనే భావనలో ఆమె ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాను కలిసి మనసులోని మాట వెల్లడించినట్లు తెలుస్తోంది. కార్తీక్, తాను శాసనసభ స్థానాలకే పోటీ చేస్తామనే అంతరంగాన్ని సబిత బహిర్గతం చేశారు.
కేఎల్లార్ బెటర్!
ఎంపీ సీటుకు పోటీచేసేందుకు ఆసక్తి చూపని సబిత.. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్లార్) అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని సూచించినట్లు తెలిసింది. స్థానికుడేగాకుండా లోక్‌సభ స్థానం పరిధిలోని అన్ని సెగ్మెంట్ల ప్రజలతో సత్సంబంధాలుండడం పార్టీకి కలిసివస్తుందనే భావన వ్యక్తం చేశారు. ఆయన బరిలో దిగితే అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లుపార్టీవర్గాలు తెలిపాయి. అయితే, ఇదే అంశంపై కేఎల్లార్ మనోగతాన్ని కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని కేఎల్లార్ స్పష్టం చేస్తున్నా.. ఆయన మాత్రం మేడ్చల్ నుంచి అసెంబ్లీకే పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అనూహ్యంగా తెరపైకి కాసాని
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ‘మన పార్టీ’ని స్థాపించిన ఆయన 2009లో ప్రజారాజ్యంలో విలీనం చేశారు. అదే పార్టీ తరఫున చేవెళ్ల లోక్‌సభ స్థానానికి పోటీచేసి భంగపడ్డ తర్వాత సొంత గూటికి చేరిన ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చేవెళ్ల ఎంపీ సీటుపై కన్నేశారు. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరిపారు. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ పెద్దలు కుంతియా, కొప్పుల రాజును కలిసి మనోగతాన్ని వెల్లడించారు. ఆ తర్వాత కాసాని అభ్యర్థిత్వంపై చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని అధిష్టానం ముఖ్యులు తెలుసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ మాత్రం.. సబిత, కేఎల్లార్ ఒప్పుకోకపోతే కాసాని పేరును పరిశీలించాలని నివేదించినట్లు సమాచారం. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జ్ఞానేశ్వర్ తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment