వరాల జల్లు | KCR Open Meeting in Vikarabad | Sakshi
Sakshi News home page

వరాల జల్లు

Published Tue, Apr 9 2019 5:23 PM | Last Updated on Tue, Apr 9 2019 5:23 PM

KCR Open Meeting in Vikarabad - Sakshi

ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలుపుతాం. పాలమూరు ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో.. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాల మేర సాగు నీరు అందిస్తాం. సాధ్యమైనంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తాం. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తెస్తాం. అనంతగిరిని తెలంగాణ ఊటీగా అభివృద్ధి చేస్తా. రంజిత్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించండి’ 
           – వికారాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌

 వికారాబాద్‌:  ఉమ్మడి జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. వికారాబాద్‌లోని కలెక్టరేట్‌ నూతన భవనం సమీపంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ ఎత్తివేసిన వెంటనే వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలుపుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత ప్రజలు, ఉద్యోగుల డిమాండ్‌ మేరకు జోన్‌ను మార్చేస్తామని తెలిపారు. తాను 1985లో అనంతగిరికి వచ్చానని, అప్పుడే అనంతగిరి గొప్పతనం తెలుకున్నానని చెప్పారు.

ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయి కాబట్టే అప్పటి నిజాం నవాబు ఇక్కడ టీబీ ఆస్పత్రిని ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందించారని తెలిపారు. అనంతగిరి టీబీ ఆస్పత్రికి పునర్వైభవం తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా నుంచి ముగ్గురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు. జిల్లాలో అనేక సమస్యలున్నాయని.. తానే స్వయంగా వచ్చి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చదువుకున్న వ్యక్తి, బహుభాషా కోవిధుడని తెలిపారు.

కేవలం ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి లక్ష ఓట్ల మెజార్టీ అందించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తనను ఎప్పుడు కలిసినా 111 జీఓను ఎత్తివేయాలని కోరుతున్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎంత మెజార్టీ ఇస్తే అంత తొందరగా 111 జీఓను ఎత్తివేస్తామని సీఎం ఈ సందర్భంగా ప్రకటించారు.

  అనంతగిరిని అభివృద్ధి చేస్తా... 

జిల్లాలోని ప్రతీ నియోజకవర్గానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని సీఎం స్పష్టంచేశారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు లక్ష ఎకరాల చొప్పున సాగు నీరు ఇస్తామని చెప్పారు. ఈ పథకాన్ని ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతగిరి తెలంగాణ రాష్ట్రానికే ఊటీలాగ ఉంటుందని, తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. సీఎం హామీలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. చప్పట్లు కొడుతూ సీఎం కేసీఆర్‌ ప్రసంగాన్ని విన్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, నాయకులు శుభప్రద్‌పటేల్, రాంచంద్రారెడ్డి, భూమోళ్ల కృష్ణయ్య, తాండూరు విజయ్‌కుమార్, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు పలు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement