chhatrapati
-
‘ఛత్రపతి’ కోసం రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్!
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో డా. జయంతి లాల్ గడ ఈ రీమేక్‌ని నిర్మించనున్నారు. తెలుగు ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్రప్రసాద్ హిందీకి తగ్గట్టు కొన్ని మార్పులతో కథను తయారు చేస్తున్నారట. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్ డైరెక్టర్ సునీల్‌బాబు ఓ విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 22న షూటింగ్ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్ బాగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సెట్‌ని మళ్లీ సెట్ చేసి, కోవిడ్ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. -
బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి మూవీ మేకర్స్‌కు భారీ నష్టం
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ రీమేక్ చిత్రం ‘ఛత్రపతి’ మేకర్స్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ తెలుగు రీమేక్ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఛత్రపతి కోసం మేకర్స్ హైదరాబాద్‌లో 6 ఎకరాల స్థలంలో ఓ భారీ విలేజ్ సేట్ వేశారట. ఇప్పటికే కోవిడ్‌తో నష్టపోయిన నిర్మాతలకు ప్రస్తుతం కురుస్తున్న వరుస వర్షాల కారణంగా దాదాపు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పడు షూటింగ్ కోసం వేసిన ఈ భారీ విలేజ్ సేట్ ఈ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినట్లు సమాచారం. ఇంకా సినిమా షూటింగ్ మొదలు కాకముందే మేకర్స్‌కు 3 కోట్ల నష్టం రావడం నిజంగా బాధించే విషయమే. ఇక ఈ సెట్ సినిమాకు చాలా కీలకం కానుండటంతో మరో ఆలోచన లేకుండా నిర్మాతలు దీనిని పున:నిర్మించే ఆలోచనలో పడ్డారట. ఈ వర్షాలు తగ్గిన వెంటనే తిరిగి సెట్‌ను నిర్మించే పనులు చేపట్టాలని మేకర్స్ నిర్ణయించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా అల్లుడు శీను సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇప్పటిదాకా ఒక్క పెద్ద హిట్ కూడా పడలేదు. దీంతో రీమేక్ చిత్రాలనే నమ్ముకొని సినిమాలు చేస్తున్నాడు. తమిళ రీమేక్ రాక్షసుడు అనంతరం ప్రస్తుతం బెల్లంకొండ చేస్తోన్న రీమేక్ చిత్రం ఛత్రపతి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బెల్లంకొండ సరసన అనన్య పాండే నటిస్తున్నట్లు సమాచారం. చదవండి: ఛత్రపతి రీమేక్‌లో సాయి శ్రీనివాస్ -
మళ్లీ కాంబినేషన్ షురూ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి ‘అల్లుడు శీను’ తొలి సినిమా. డైనమిక్ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ సినిమాతో శ్రీనివాస్‌ను హీరోగా తెలుగుకు పరిచయం చేశారు. మంచి సక్సెస్‌ను కూడా తనకు అందించారు. ఇప్పుడు మరోసారి తన తొలి దర్శకుడితో బాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు సాయి శ్రీనివాస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఛత్రపతి’ హిందీలో రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్‌ను వీవీ వినాయక్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రభాస్ చే సిన రోల్‌ను సాయి శ్రీనివాస్ చేస్తారు. ఈ రీమేక్ సాయి శ్రీనివాస్‌కే కాదు వినాయక్‌కి కూడా హిందీలో తొలి సినిమా అవుతుంది. పెన్ స్టూడియోస్ పతాకంపై జయంతిలాల్ గడ ఈ సినిమాను నిర్మిస్తారు. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ – ‘‘నా బాలీవుడ్ ఎంట్రీకి ఇదే సరైన ప్రాజెక్ట్ అని నమ్ముతున్నాను. ఈ పాత్ర చేయడం గొప్ప బాధ్యతలా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు. ‘‘ఛత్రపతి’ కథకు సాయి శ్రీనివాస్ కరెక్ట్. రీమేక్స్‌లో వినాయక్‌గారి నైపుణ్యం అందరికీ తెలిసిందే’’ అన్నారు జయంతిలాల్ గడ. -
మమ్మమ్మాస్ ఎంట్రీ షురూ
ప్రభాస్‌ని మంచి మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో ‘ఛత్రపతి’ (2005) ఒకటి. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుంది. హీరోగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నటించనున్నారు. ‘అల్లుడు శీను’ చిత్రంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయిశ్రీనివాస్. తన ప్రతి చిత్రాన్ని హిందీలోకి డబ్బింగ్ చేసుకుంటూ వచ్చారు. అలా డబ్బింగ్ సినిమాల ద్వారా బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు శ్రీను. ఇప్పుడు డైరెక్ట్ సినిమాతో హిందీ తెరపై కనిపించాలనుకున్నారు. మంచి మాస్ కథాంశంతో రూపొందిన ‘ఛత్రపతి’ రీమేక్ అయితే బాగుంటుందనుకున్నారు. ఈ రీమేక్ కోసం ఓ ఫోటోషూట్ చేశారట సాయి. బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. -
ప్రాణం పోయినా సరే... పని జరగాలి!
‘ఎక్కడ ఉన్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి.మన ప్రాణాలు పోయినా సరే’ లివాటు వ్యవహారం, పెంకితనం, మూర్ఖత్వం కలగలిసిన ‘ఆకాశ్’గా ‘ఛత్రపతి’లో నటించినా, ప్రాణాలు పోయినా సరే అనుకున్నది సాధించాలనే కరడుగట్టిన ఉగ్రవాది అజార్గా ‘ఖడ్గం’ సినిమాలో కనిపించినా... దుర్మార్గంలోని రకరకాల ఫ్లేవర్స్‌ను నేర్పుగా ప్రకటించగలిగే నటుడు షఫీ. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకున్న ఈ చంద్రగిరి కుర్రాడు పెద్ద పెద్ద వాళ్ల దగ్గర నటనలో మెళకువలు నేర్చుకున్నాడు. ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయేంత నైపుణ్యాన్ని సాధించాడు. ‘ఖడ్గం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన షఫీ, ‘ఛత్రపతి’ సినిమాలో విలన్‌తో చేతులు కలిపిన కథానాయకుడి తమ్ముడు ‘ఆకాశ్’గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు.‘‘నేను రైటర్, డైరెక్టర్, యాక్టర్‌ని’’ అని చెప్పుకునే షఫీలో ‘నేను ఇలా అనుకుంటున్నాను. ఇలా మాత్రమే నటిస్తాను’ అనే పట్టింపులేమీ లేవు. ఆయన దృష్టిలో రచయితకు, దర్శకుడికి మంచి ప్రాధాన్యత ఉంది. రచయిత ఊహలకు డైరెక్టర్ ఒక రూపం కల్పిస్తే నటుడు దానికి ప్రాణం పోస్తాడు అని నమ్ముతాడు షఫీ. ‘నా నుంచి డైరెక్టర్ తీసుకున్నట్లే... డైరెక్టర్ నుంచి కూడా నేను తీసుకుంటాను’ అంటాడు. అంత మాత్రాన భారం మొత్తం ఆ ఇద్దరి మీదే వేయడు. తాను చేస్తున్న పాత్రలో జీవం తీసుకురావడానికి రకరకాలుగా కసరత్తులు చేస్తుంటాడు.‘శ్యామ్‌గోపాల్‌వర్మ’ సినిమా కోసం ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో మంది వ్యక్తులను ఇంటర్వూ్య తీసుకొని నోట్స్ రాసుకున్నా, ‘కమ్లీ’ సినిమాలో రేడ్యా పాత్ర కోసం మహబూబ్‌నగర్ కూలీలను కలిసి వారి వేషభాషలు అధ్యయనం చేసినా, ‘ఖడ్గం’ సినిమా కోసం చార్మినార్ ప్రాంతంలో అద్దెకు ఉన్నా.... ఒక పాత్ర పండించడం కోసం చేయాల్సినంత హోంవర్క్ చేయడంలో ముందుంటాడు షఫీ. ‘డబ్బులు ముఖ్యం కాదు...సంతృప్తి ముఖ్యం’ అంటున్న షఫీ ఆచితూచి పాత్రలను ఎంచుకుంటాడు. ఒక్కసారి ఓకే అన్నాక...దానికి వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. ‘ఖడ్గం’లో అజార్ నుంచి ‘శివమ్’లో ముస్తాఫా వరకు, ‘రెడీ’లో నాగప్ప నుంచి ‘ఖలేజా’లో సిద్దప్ప వరకు రకరకాల పాత్రలను విజయవంతంగా పండించాడు షఫీ.‘నటుడు తెల్లటి కాన్వాస్లాంటి వాడు’ అంటున్న షఫీ ఆ కాన్వాస్‌పై ‘విలన్’ అనే పెయింటింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ‘ఉత్తమ విలన్’ అనిపించుకున్నాడు. -
డై..లాగి కొడితే....
సినిమా : ఛత్రపతి రచన: ఎం. రత్నం, దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి శ్రీలంక నుంచి వలస వచ్చిన వారితో వైజాగ్ పోర్ట్ ఏరియాను బేస్ చేసుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తుంటాడు బీహార్ నుంచి వచ్చి స్థిరపడ్డ రౌడీ బాజీరావ్ (నరేంద్ర ఝా). ఓ సందర్భంలో బాజీరావ్ అనుచరుణ్ణి చంపేస్తాడు శివాజి (ప్రభాస్). దాంతో స్వయంగా బాజీరావ్ రంగంలోకి దిగితే, అతణ్ణి కూడా చంపేస్తాడు శివాజి. పోర్ట్ ఏరియాలో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్న మంత్రి అప్పలనాయుడు (కోటా శ్రీనివాసరావు) వద్దకు బాజీరావ్ శవంతో వెళతాడు. ‘వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే...?’ నా ఏరియాలో ఇంక ఎవ్వడూ అడుగు పెట్టకూడదు’ అంటూ అప్పలనాయుడికి వార్నింగ్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. -
ప్రభాస్‌కు టెన్షన్ పట్టుకుందట..
న్యూఢిల్లీ : మనిషి అన్నాక టెన్షన్ ఉంటుంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెట్టి... దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించిన బాహుబలి చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం ప్రేక్షక్షులు ఆకట్టుకుంటుందో లేదో అని బాహుబలి చిత్ర యూనిట్ కన్నా ఆ సినిమా హీరో ప్రభాస్‌కు టెన్షన్ పట్టుకుందట. ఆ టెన్షన్‌ను ఓ రేంజ్లో అనుభవిస్తున్నట్లు యంగ్ రెబల్ స్టార్ చెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుని... విడుదలకు సిద్ధమైన బాహుబలి కోసం తాను పడిన కష్టాన్ని ప్రభాస్ శుక్రవారం విలేకర్లతో పంచుకున్నారు. 'సినిమాలో సాధారణంగా ఓ వ్యక్తి ద్విపాత్రాభినయం చేయడం కష్టం. అదీ తండ్రికొడుకులుగా నటించడం మరింత కష్టం. తండ్రి పాత్ర 'బాహుబలి'లో ఒదిగిపోయేందుకు శరీరాన్ని భారీగా పెంచాను. అందుకోసం ఎంతో కష్టపడ్డాను. అలాగే అతడి కొడుకు శివుడు పాత్రలో లీనమైయ్యేందుకు అదే శరీరాన్ని సన్నగా మార్చేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆ క్రమంలో దాదాపు 30... 40 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం కోడిగుడ్లులోని తెల్లసొన మాత్రమే తీసుకున్నట్లు' ప్రభాస్ వివరించారు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం కత్తి యుద్ధం, కిక్ బాక్సింగ్, కుంగ్ ఫూ, గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపారు. వియత్నాంకు చెందిన కత్తి యుద్ధ నిపుణుల వద్ద... యుద్దంలో మెళుకువలు నేర్చున్నట్లు ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో కొండపై నుంచి జలపాతంలోకి దూకాల్సి ఉందని... ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 25 రోజుల సమయం పట్టిందన్నారు. అలాగే దర్శకుడు రాజమౌళితో తన అనుబంధాన్ని ప్రభాస్ నెమరువేసుకున్నారు. జక్కన్న దర్శకత్వంలో హీరోగా నటించిన ఛత్రపతి 2005లో విడుదలైందని, ఆ చిత్రం పెద్ద హిట్ సాధించిందన్నారు. ఆ చిత్రాన్ని జక్కన్న 70 నుంచి 100 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. సినిమాలపై రాజమౌళికి ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేమన్నారు. అయితే ఛత్రపతి కంటే బాహుబలి పది వేల రెట్లు పెద్దదని ప్రభాస్ తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన రెండు భాగాల బాహుబలి చిత్రం... మొదటి భాగం జూలై 10 న విడుదల కానుంది. -
కళా దర్శకుడు రవీందర్‌కు అరుదైన పురస్కారం
సినీ పరిశ్రమలో కళాదర్శకునిగా రవీందర్ స్థానం ప్రత్యేకం. ఛత్రపతి, మగధీర, మర్యాదరామన్న, ఈగ, రాజన్న, జులాయి చిత్రాలకు కళా దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలందుకున్నారాయన. కళాదర్శకునిగా ఇప్పటికి మూడుసార్లు నంది పురస్కారాలు అందుకున్న రవీందర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి మెరవనుంది. ‘ఈగ’ చిత్రం కోసం రవీందర్ వేసిన విలన్ హౌస్ సెట్, మైక్రో ఆర్ట్ వర్క్‌కు గాను బ్రెజిల్ చలనచిత్రోత్సవంలో ‘ఉత్తమ కళా దర్శకుడు’ పురస్కారానికి రవీందర్ ఎంపికయ్యారు. ఈ చలనచిత్రోత్సవంలో పురస్కారం అందుకోబోతున్న తొలి తెలుగు సినీ సాంకేతిక నిపుణుడు రవీందరే కావడం విశేషం. పవన్‌కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రానిక్కూడా రవీందరే కళా దర్శకుడు. పలు బాలీవుడ్ చిత్రాలక్కూడా పనిచేస్తున్నారాయన.