ప్రభాస్కు టెన్షన్ పట్టుకుందట..
న్యూఢిల్లీ : మనిషి అన్నాక టెన్షన్ ఉంటుంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చు పెట్టి... దాదాపు మూడేళ్ల పాటు కష్టపడి రూపొందించిన బాహుబలి చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం ప్రేక్షక్షులు ఆకట్టుకుంటుందో లేదో అని బాహుబలి చిత్ర యూనిట్ కన్నా ఆ సినిమా హీరో ప్రభాస్కు టెన్షన్ పట్టుకుందట. ఆ టెన్షన్ను ఓ రేంజ్లో అనుభవిస్తున్నట్లు యంగ్ రెబల్ స్టార్ చెబుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుని... విడుదలకు సిద్ధమైన బాహుబలి కోసం తాను పడిన కష్టాన్ని ప్రభాస్ శుక్రవారం విలేకర్లతో పంచుకున్నారు. 'సినిమాలో సాధారణంగా ఓ వ్యక్తి ద్విపాత్రాభినయం చేయడం కష్టం. అదీ తండ్రికొడుకులుగా నటించడం మరింత కష్టం. తండ్రి పాత్ర 'బాహుబలి'లో ఒదిగిపోయేందుకు శరీరాన్ని భారీగా పెంచాను.
అందుకోసం ఎంతో కష్టపడ్డాను. అలాగే అతడి కొడుకు శివుడు పాత్రలో లీనమైయ్యేందుకు అదే శరీరాన్ని సన్నగా మార్చేందుకు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. ఆ క్రమంలో దాదాపు 30... 40 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం కోడిగుడ్లులోని తెల్లసొన మాత్రమే తీసుకున్నట్లు' ప్రభాస్ వివరించారు. అంతేకాకుండా ఈ చిత్రం కోసం కత్తి యుద్ధం, కిక్ బాక్సింగ్, కుంగ్ ఫూ, గుర్రపు స్వారీ నేర్చుకున్నట్లు తెలిపారు.
వియత్నాంకు చెందిన కత్తి యుద్ధ నిపుణుల వద్ద... యుద్దంలో మెళుకువలు నేర్చున్నట్లు ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో కొండపై నుంచి జలపాతంలోకి దూకాల్సి ఉందని... ఆ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి 25 రోజుల సమయం పట్టిందన్నారు. అలాగే దర్శకుడు రాజమౌళితో తన అనుబంధాన్ని ప్రభాస్ నెమరువేసుకున్నారు. జక్కన్న దర్శకత్వంలో హీరోగా నటించిన ఛత్రపతి 2005లో విడుదలైందని, ఆ చిత్రం పెద్ద హిట్ సాధించిందన్నారు.
ఆ చిత్రాన్ని జక్కన్న 70 నుంచి 100 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. సినిమాలపై రాజమౌళికి ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేమన్నారు. అయితే ఛత్రపతి కంటే బాహుబలి పది వేల రెట్లు పెద్దదని ప్రభాస్ తెలిపారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన రెండు భాగాల బాహుబలి చిత్రం... మొదటి భాగం జూలై 10 న విడుదల కానుంది.