chicken sales down
-
‘కోళ్లు’కోలేని దెబ్బ
సాక్షి, విశాఖపట్నం: ‘అవును.. కోడి తింటే కరోనా వస్తోంది. అందుకే.. చికెన్ కొనొద్దు..’ అంటూ ఈ వదంతులు షికారు చేస్తుండటంతో.. మాంసప్రియులు కోడి జోలికి పోవడం లేదు. దీంతో మొత్తం పౌల్ట్రీ పరిశ్రమకే ఈ వైరస్ సోకి విలవిల్లాడుతోంది. ఈ వైరస్ వదంతులు కారణంగా నగరంలో చికెన్ అమ్మకాలు 70 శాతానికిపైగా పడిపోయాయి. ధర కూడా సగానికి తగ్గిపోయినా.. చికెన్ దుకాణాల వైపు ప్రజలెవ్వరూ చూడకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చైనాతో పాటు అనేక దేశాలను అతలాకుతలం చేస్తూ వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ఇక్కడ కోళ్ల పరిశ్రమనీ వదలడం లేదు. కోడి తింటే... కరోనా వస్తుందో రాదో అన్నది పక్కనపెడితే.. సోషల్ మీడియాలో ప్రచారం వల్ల.. చికెన్ దుకాణాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. డిమాండ్ పూర్తిగా లేకుండా పోయింది. నెల రోజుల క్రితం కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తూ పాతాళానికి పడిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా.. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇదే సమయంలో మటన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి మటన్ దుకాణంలో జనం బారులు తీరుతున్నారు. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.200 వరకూ అమ్ముడు పోగా.. ఇప్పుడు రూ.100కి పడిపోయిందంటే.. కరోనా ఎంతలా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. చికెన్ అమ్మకాలు ఇలా.. సాధారణ రోజుల్లో నగరంలో చికెన్ అమ్మకాలు – లక్షా 30 వేల కిలోలు కరోనా దెబ్బకు ప్రస్తుతం అమ్ముడు పోతున్న చికెన్ – 50 వేల కిలోలు ఆదివారం నగరంలో చికెన్ అమ్మకాలు – 2 లక్షల 70 వేల కిలోలు కరోనా దెబ్బకు ఆదివారం అమ్ముడు పోతున్న చికెన్ – 60 వేల కిలోలు -
‘ముక్క’ ముట్టడం లేదు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా చికెన్ అమ్మకాలు నెల రోజుల్లో 50 శాతానికి పడిపోయాయి. ఫాం గేట్ ధర 70 శాతం తగ్గింది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బి.ఎస్.యాదవ్ తెలిపారు. వారానికి 6 లక్షల కోళ్లు విక్రయించేవారమని, నెల రోజుల్లో 40 శాతం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. వదంతులు ఆగిపోయి తిరిగి అమ్మకాలు రెండు మూడు నెలల్లో పుంజుకున్నాక చికెన్ కొరత ఏర్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రతి వారం 7.5 కోట్ల కోళ్లు అమ్ముడవుతున్నాయని, ఇది 3.5 కోట్ల కోళ్లకు వచ్చిందని గుర్తుచేశారు. కాగా, హైదరాబాద్ మార్కెట్లో కొద్ది రోజుల క్రితం స్కిన్లెస్ చికెన్ మాంసం రూ.250 దాకా దూసుకెళ్లింది. గత వారం రూ.110కి దిగొచ్చి ప్రస్తుతం రూ.130 పలుకుతోంది. ఇక్కడ సాధారణ స్థితికి.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రెండు వారాల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు సాధారణ స్థితికి వచ్చాయని స్నేహ ఫామ్స్ సీఎండీ డి.రామ్ రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 30 శాతం అమ్మకాలు పడిపోయాయి. చికెన్ ఫాం గేట్ ధర రూ.80 నుంచి రూ.35 వరకు వెళ్లింది. ఇప్పుడు రూ.42కు వచ్చింది. వారానికి సరిపడ నిల్వలు పౌల్ట్రీల వద్ద మిగిలిపోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాంసాహారం ఎక్కువ తింటారు కాబట్టి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వదంతుల ప్రభావం తక్కువగా ఉంది. సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వినియోగం సాధారణ స్థితికి వచ్చింది. ధరలు రోజురోజు కూ పెరుగుతున్నాయి. చికెన్‌కు కరోనాకు ఎటువంటి సంబంధం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి’ అని వివరించారు. నష్టం రూ.7,000 కోట్ల పైనే..! కరోనా వదంతుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పౌల్ట్రీ పరిశ్రమ రూ.700 కోట్ల వరకు నష్టపోయిందని రామ్ రెడ్డి వెల్లడించారు. కోడి ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.80 అవుతోందని, విక్రయ ధర సగానికి పడిపోవడంతో పౌల్ట్రీ సంస్థలు నష్టాలను మూటగట్టుకున్నాయని చెప్పారు. ఈ నష్టం దేశవ్యాప్తంగా ఎంత కాదన్నా రూ. 7,000 కోట్ల పైచిలుకు ఉంటుందని ఆ యన అంచనా వేశారు. తమకు సం బంధం లేకపోయినా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బ్యాచ్ వేయడానికి రైతుల వద్ద మూలధనం లేదన్నారు. వాస్తవానికి సాధారణ రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–20 లక్షల కోళ్లు అమ్ముడయ్యేవి. -
కరోనా ఎఫెక్ట్; అమ్మో చికెన్.. మాకొద్దు
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో చికెన్, వేట మాంసం అమ్మకాలపై కరోనా వైరస్(కోవిడ్–19) దెబ్బ పడింది. సోషల్ మీడియాలో మాంసాహారం వలనే చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందని ప్రచారం జరగడంతో మాంస ప్రియులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగానే చికెన్ అమ్మకాలు 60 శాతానికి పైగా పడిపోయాయి. అదేవిధంగా ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కోడి మాంసం అ మ్మకాల్లో రూ.3 కోట్లు, వేట మాంసం, చే పల అమ్మకాల్లో రూ.కోటి వరకు వ్యాపా రులు నష్టపోయివుంటారని అంచనా. సాధారణంగా ఆదివారం రెండు లక్షల కోళ్ల వరకు విక్రయిస్తుండేవారు. మిగిలిన నాలుగు రోజుల్లో మరో లక్ష కోళ్ల వరకు విక్రయించేవారు. ఈ లెక్కన జిల్లాలో వారానికి మూడు లక్షల కిలోల వరకు కోడి మాంసం విక్రయాలు జరిగేవి. ఇప్పుడు 70 వేల కిలోలు మాత్రమే అమ్ముడవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ధర కూడా స్కిన్‌తో ఉన్న చికెన్ కిలో రూ.95కు, స్కిన్లెస్ రూ.115 లకు పడిపోయింది. రెండు నెలల క్రితం ఇవే ధరలు రూ.230, రూ.250ల వరకు ఉండేవి. వేట మాంసం అమ్మకాలు కూడా పడిపోయాయి. ఆది, మంగళ వారాల్లో వేటమాంసం 30 వేల కిలోల వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు 15 వేల కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. సముద్ర చేపలను కూడా తినేందుకు మాంసాహారులు సుముఖత చూపడం లేదు. ఈ కారణంగా వాటి విక్రయాలు కూడా పడిపోయాయి. పాఠశాలలు, హాస్టళ్లలో మాంసం వడ్డిస్తున్నా విద్యార్థులు తినకపోవడంతో వార్డెన్లు, విద్యాశాఖ అధికారులు కూడా మాంసం కొనేందుకు సుముఖత చూపడం లేదు. వాటికి బదులుగా పౌష్టికాహారాన్ని వడ్డిస్తున్నారు. ఇటీవలి కాలంలో గుడ్డును తినేందుకు కూడా కొందరు విద్యార్థులు సుముఖత చూపడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అటువంటి వారిని వారించలేకపోతున్నామని చెబుతున్నారు. దీని వలన గుడ్డు ధర కూడా పడిపోయింది. 20 రోజుల క్రితం గుడ్డు ధర రూ.5.30 ల వరకు ఉండగా ఇప్పుడది రూ.4.30లకు దిగిపోయింది. ఇలా మాంసం, గుడ్డు ధరలు పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మాంసం విక్రయాలు గణనీయంగా తగ్గాయి జిల్లాలో మాంసం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. మాంసంతోపాటు గుడ్లు రేటు కూడా తగ్గిపోయాయి. మాంసం తింటే కరోనా వైరస్ సోకే ప్రమాదముందని ప్రచారం జరగడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా అని కోళ్ల మేత ధరలు కూడా తగ్గలేదు. దీని వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాం. – పోలిశెట్టి వెంకటేష్, పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యుడు -
పెద్ద నోట్ల రద్దుతో చికెన్ అమ్మకాలు ఢమాల్
-
చికెన్ అమ్మకాలు ఢమాల్
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం మాంసం వ్యాపారుల మీదా పడింది. ఆదివారం రోజు జోరుగా సాగే మాంసం వ్యాపారాలు మందగించాయి. సండే రోజు చికెన్ షాపులు ముందు వరుసకట్టే వినియోగదారులు పెద్ద నోట్ల రద్దుతో ఆవైపుకే రాలేదు. దీంతో వినియోగదారులు లేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. మామూలుగా కార్తీక మాసంలో చికెన్ అమ్మకాలు కొద్దిగా తగ్గుతాయి. రూ.500. రూ. వెయ్యి నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం, చిల్లర సమస్యలతో మాంస్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మిగతా వ్యాపారాలు కూడా డీలా పడ్డాయి. చేపల మార్కెట్లు కూడా వెలవెలబోతున్నాయి. సెలవురోజు చిల్లర ఖర్చులు డబ్బులు లేకపోవడంతో నాలుగో రోజు జనం ఏటీఎంల ముందు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే జనం ఏటీఎంల ముందు క్యూ కట్టారు. మరోవైపు బ్యాంకులు ఈరోజు కూడా పనిచేయనున్నాయి.