
ఆదివారం నగరంలో వెలవెలబోతున్న చికెన్ దుకాణాలు
సాక్షి, విశాఖపట్నం: ‘అవును.. కోడి తింటే కరోనా వస్తోంది. అందుకే.. చికెన్ కొనొద్దు..’ అంటూ ఈ వదంతులు షికారు చేస్తుండటంతో.. మాంసప్రియులు కోడి జోలికి పోవడం లేదు. దీంతో మొత్తం పౌల్ట్రీ పరిశ్రమకే ఈ వైరస్ సోకి విలవిల్లాడుతోంది. ఈ వైరస్ వదంతులు కారణంగా నగరంలో చికెన్ అమ్మకాలు 70 శాతానికిపైగా పడిపోయాయి. ధర కూడా సగానికి తగ్గిపోయినా.. చికెన్ దుకాణాల వైపు ప్రజలెవ్వరూ చూడకపోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు.
చైనాతో పాటు అనేక దేశాలను అతలాకుతలం చేస్తూ వేల మందిని పొట్టన పెట్టుకున్న కరోనా వైరస్ ఇక్కడ కోళ్ల పరిశ్రమనీ వదలడం లేదు. కోడి తింటే... కరోనా వస్తుందో రాదో అన్నది పక్కనపెడితే.. సోషల్ మీడియాలో ప్రచారం వల్ల.. చికెన్ దుకాణాలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయింది. డిమాండ్ పూర్తిగా లేకుండా పోయింది. నెల రోజుల క్రితం కొండెక్కి కూర్చున్న కోడి ధరలు.. ఇప్పుడు నేల చూపులు చూస్తూ పాతాళానికి పడిపోయాయి. నగరంలో ఎక్కడ చూసినా.. చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఇదే సమయంలో మటన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రతి మటన్ దుకాణంలో జనం బారులు తీరుతున్నారు. నెల రోజుల క్రితం కిలో చికెన్ రూ.200 వరకూ అమ్ముడు పోగా.. ఇప్పుడు రూ.100కి పడిపోయిందంటే.. కరోనా ఎంతలా ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు.
చికెన్ అమ్మకాలు ఇలా..
సాధారణ రోజుల్లో నగరంలో చికెన్ అమ్మకాలు – లక్షా 30 వేల కిలోలు
కరోనా దెబ్బకు ప్రస్తుతం అమ్ముడు పోతున్న చికెన్ – 50 వేల కిలోలు
ఆదివారం నగరంలో చికెన్ అమ్మకాలు – 2 లక్షల 70 వేల కిలోలు
కరోనా దెబ్బకు ఆదివారం అమ్ముడు పోతున్న చికెన్ – 60 వేల కిలోలు
Comments
Please login to add a commentAdd a comment