280 మందికి విదేశీ విద్యా భాగ్యం
మైనార్టీ విద్యార్థులకు సర్కారు సాయం
‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం’ కింద విద్యార్థుల ఎంపిక
ఉపకార వేతనాల కింద రూ.10 లక్షలు.. 233 దరఖాస్తుల తిరస్కరణ
హైదరాబాద్: నిరుపేద మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత చదువులు అందించేందుకు ప్రవేశపెట్టిన ‘ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం’ కింద 280 మందికి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఈ పథకం కింద వారికి విదేశాల్లో విద్యాభాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఉపకారవేతనం రూపంలో ఆర్థిక చేయూత అందించనుంది. 2015-16 విద్యాసంవత్సరానికి మొత్తం 513 మంది దరఖాస్తు చేసుకున్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు జరుగుతుండటంతో ప్రభుత్వం హడావుడిగా విద్యార్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఐదుగురు సభ్యులు గల రాష్ట్రస్థాయి స్క్రీనింగ్ కమిటీకి పంపారు. వీరు 280 దరఖాస్తులను ఆమోదించి, మరో 233 దరఖాస్తులను తిరస్కరించారు. కమిటీ తుది జాబితాను ప్రభుత్వానికి పంపింది.
స్పష్టత లేని నిబంధనలు
ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్టడీ స్కీం నిబంధనలు గందరగోళంగా ఉన్నాయి. రెండుసార్లు సవరించిన వీసాపై స్పష్టత ఇవ్వలేదు. వీసా ఉన్నవారితో పాటు వీసాలేని వారు సైతం విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్క్రీనింగ్ కమిటీ సైతం అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జన పడింది. అభ్యర్థుల వయోపరిమితిని చివరి నిమిషంలో సవరించారు. తొలుత వయోపరిమితిని 30 ఏళ్ల లోపుగా ప్రకటించి, తిరిగి జూలైలో దీన్ని 35 ఏళ్లుగా సవరించారు. అదీగాక దరఖాస్తు చేసుకునేందుకు కేవలం 15 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. పథకానికి విసృ్తత ప్రచారం లేకపోవడంతో అభ్యర్థులు చివరి క్షణంలో హడావుడిగా దరఖాస్తు చేసుకోవడంతో అనేక పొరపాట్లు దొర్లినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 33 శాతం మహిళా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది.