వేదికపై దళిత ఎంపీ, ఎమ్మెల్యేలకు చోటులేదు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దళితులకు తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లేదని వస్తున్న ఆరోపణలను నిజం చేసేలా శనివారం ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం జరిగింది. గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అక్కడి కల్యాణ మండపంలో నీరు-చెట్టు కార్యక్రమంపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వేదికపై ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, జెడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, రాష్ట్ర తెలుగురైతు విభాగం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి కూర్చున్నారు.
కరణం బలరామ్‌కు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినా ఆయన కొద్దిసేపు వేదికపై కూర్చుని తర్వాత పోలవరం మీటింగ్ కోసం వెళ్లిపోయారు. అయితే గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉన్న ప్రాంతం సంతనూతలపాడు నియోజవకర్గం పరిధిలోకి వస్తుంది. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ను వేదికపైకి పిలవాల్సి ఉంది. అయితే ఆయన విపక్షానికి చెందిన వారు కాబట్టి పిలవలేదు అనుకున్నా, స్థానిక ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి కూడా సమావేశానికి వచ్చారు.
ఆయనను కనీసం వేదికపైకి పిలవకపోవడంతో సమావేశంలో అధికారులు, మిగిలిన ఎమ్మెల్యేలతోపాటు కూర్చుండిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ప్రొటోకాల్ కొంతమందికే ఉంటుందని, దళితులకు ఉండదని ఆ సమావేశం చూసిన వారు వ్యాఖ్యానించారు.