Chief Ministers Office
-
సీఎంవో అధికారులకు శాఖల పునఃపంపిణీ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా నియమితులైన ప్రవీణ్ ప్రకాష్ బాధ్యతలు చేపట్టడంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు ముఖ్య సలహాదారు అజేయకల్లం శనివారం సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లో పనిచేస్తున్న అధికారులకు శాఖలను పునఃపంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధానపరమైన అంశాలు.. కేడర్‌కు సంబంధించిన అంశాలు, ముఖ్యమైన ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ముఖ్య సలహాదారు అజేయకల్లం ద్వారానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంవోలో పనిచేస్తున్న అధికారులకు కేటాయించిన శాఖలు ఇవీ.. అజేయకల్లం, సీఎం ముఖ్య సలహాదారు: హోం శాఖ, ఆర్థిక, ప్రణాళిక శాఖ, రెవెన్యూ శాఖ ,న్యాయ, శాసనసభ వ్యవహారాలు, సీఎం కార్యాలయ వ్యవహారాలు, ఎవరికీ కేటాయించని శాఖలు డాక్టర్ పీవీ రమేష్ సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి: వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, విద్యా శాఖ (పాఠశాల, ఇంటర్, ఉన్నత, సాంకేతిక విద్య), పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రా ప్రవీణ్ ప్రకాష్, సీఎం ముఖ్య కార్యదర్శి: సాధారణ పరిపాలన, విద్యుత్ శాఖ, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు (పునరి్వభజన చట్టానికి సంబంధించిన అంశాలు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రధానమైన అధికారులతో సీఎం సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కార్యదర్శి అంతకంటే దిగువ స్థాయి అధికారులతో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణ, సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయనతో పాటు వెళ్లడం), డ్యాష్ బోర్డ్స్, సీఎంవో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, సీఎం కార్యదర్శి: రవాణా, రహదారులు భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, గృహ నిర్మాణం, ఆహార పౌరసరఫరా>లు, వినియోగదారుల వ్యవహారాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సెర్ప్, యువజన వ్యవహారాలు, క్రీడలు, గనులు, భూగర్భవనరులు, కారి్మక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అన్ని సంక్షేమ శాఖలు జె.మురళి, సీఎం ప్రత్యేక కార్యదర్శి: పశుసంవర్థక శాఖ, డెయిరీ, మత్స్య శాఖ, సహకార, మార్కెటింగ్ శాఖ, సాంస్కృతిక శాఖ, ఎంపీలు, ఎమ్మెల్యేల గ్రీవెన్సులు, ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) దువ్వూరి కృష్ణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి: ఆరి్థక శాఖ, విద్యుత్ శాఖ ముక్తాపురం హరికృష్ణ, సీఎం ప్రత్యేక అధికారి: ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్, జనరల్ గ్రీవెన్సెస్ పి.కృష్ణమోహన్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ: సీఎం అపాయింట్మెంట్స్, సందర్శకులు, సీఎం రోజువారీ కార్యకలాపాలు. -
సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి
సాక్షి, అమరావతి/రాయచోటి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) అదనపు కమిషనర్‌గా, అనంతరం రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డైరెక్టర్‌గా, శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూనే గోదావరి పుష్కరాల ఇన్ఛార్జిగా కూడా రేయింబవళ్లు పనిచేసి ప్రశంసలందుకున్నారు. ధనుంజయరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకూ పనిచేసిన ప్రతిచోటా ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారని అధికారవర్గాల్లో పేరుంది. వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన ధనంజయరెడ్డికి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుల్లో ఆయన ఒకరు. వీటన్నింటికీ తోడు సమర్థవంతమైన అధికారిగా మంచి పేరుండటంతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆయన్ను తన అదనపు కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేషీలో నియమితులైన మొట్టమొదటి అధికారి ధనుంజయరెడ్డి కావడం గమనార్హం. సర్పంచ్ నుంచి అదనపు కార్యదర్శిగా.. ధనుంజయరెడ్డి 1988లో కడప జిల్లా రాయచోటి మండల చెన్నముక్కపల్లె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ సివిల్స్‌లో ఉత్తీర్ణతను సాధించారు. 1992లో సర్పంచి పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. పాలనాదక్షుడిగా పేరు సంపాదించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కొలువులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు.అభివృద్ధితో పాలకులు, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు. టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్రాధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, శ్రీకాకుళం కలెక్టరుగా, అనంతరం పర్యాటక శాఖ రాష్ట్ర అధికారిగా ఉంటూ ప్రగతిపై తనదైన ముద్రను వేసుకున్నారు. ఎక్కడున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో మమేకమయ్యే తత్వముంది. విశిష్ట లక్షణాలున్న ఈ అధికారి రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక వహించగలరనే నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారానికి ముందే ధనుంజయరెడ్డిని అడిషనల్ సెక్రటరీగా నియమించుకున్నారు. -
అర్జీ... అంతేసంగతి!
ముఖ్యమంత్రికి ఇచ్చినా అటకెక్కాల్సిందే.. - అందిన పిటిషన్లు 11,880 - పరిష్కారమైనవి కేవలం 59 - అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎంవో సాక్షి, హైదరాబాద్: ‘అధికారులు.. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నాం.. ఎన్ని అర్జీలు ఇచ్చినా లాభం లేదు... నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంవో) అర్జీ పెట్టుకుంటేనన్నా తమ సమస్యకు కనీస పరిష్కారం దొరుకుతుంది... ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫారసు లేఖ దానికి జోడిస్తే మరింత తొందరగా పని అవుతుంది...’ అనేది సగటు బాధితుడి నమ్మకం. కానీ.. సాక్షాత్తూ సీఎంవోలో ప్రజల విజ్ఞప్తులు.. అర్జీలకు దిక్కుమొక్కు లేకుండాపోయింది. వేలాది అర్జీలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. మొత్తం 11,880 పిటిషన్లు అందితే.. కేవలం 59 పరిష్కారమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ మానిటరింగ్ సెల్ లో నమోదైన ఈ అర్జీల పురోగతి తీరును చూసి సీఎంవోలోని ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు పిటిషన్ల పురోగతిపై నివేదికను పంపించాలని అన్ని విభాగాలకు లేఖలు రాశారు. సాధారణంగా ప్రజా విజ్ఞప్తులు, పిటిషన్లను సీఎంవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రెండు వారాలకోసారి సీఎంవో అధికారులు సీఎంకు వీటి పురోగతిని నివేదించాల్సి ఉంటుంది. వీఐపీల ద్వారా లేదా సీఎంవోకు నేరుగా అందిన అర్జీలన్నింటినీ అధికారులు సంబంధిత విభాగాలకు పంపిస్తారు. అక్కడ వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తారు. అందులో యోగ్యమైన వాటిని పరిష్కరించడం లేదంటే తిరస్కరించడం క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారి బాధ్యత. ఈ అర్జీపై తీసుకున్న యాక్షన్.. లేదంటే పరిష్కరించిన చర్యను.. తిరస్కరిస్తే కారణాలను తమ విభాగపు ఉన్నతాధికారుల ద్వారా తిరిగి సీఎంవోకు తెలియపరుస్తారు. కానీ, ఇప్పుడున్న ఈ అర్జీల పురోగతి చూస్తే క్షేత్రస్థాయిలో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయా...? లేదా వీటికి సంబంధించిన సమాచారం సీఎంవోకు తిరిగి అందడం లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అన్ని విభాగాల అధికారులు తమ దగ్గరున్న పిటిషన్లపై సమీక్ష జరపాలని.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవి తక్షణమే పరిష్కరించాలని సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్‌లో ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. -
సీఎంవో అధికారుల శాఖల్లో మార్పులు
సతీష్‌చంద్రకు కీలక బాధ్యతలు హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) అధికారుల శాఖల్లో మార్పులు చేశారు. సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రకు కీలకమైన శాఖలు అప్పగించారు. గతంలో సీఎంవో ముఖ్య కార్యదర్శిగా పనిచేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధమైన అజయ్‌సహానీ కొద్దిరోజులుగా వైద్య,ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా చేసిన మార్పుల్లో ఆ శాఖను కూడా తొలగించారు. దీంతో ఆయన్ను సీఎం కార్యాలయం బాధ్యతల నుంచి రిలీవ్ చేసినట్లైంది. సీఎం కార్యాలయ అధికారులకు శాఖల కేటాయింపుల్లో జరిగిన మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయని ఆ కార్యాలయ ముఖ్య కార్యదర్శి శనివారం తెలిపారు. ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్రకు కేటాయించిన శాఖలు: సాధారణ పరిపాలన, హోం, పురపాలన, పట్టణాభివృద్ధి, రవాణా, రహదారులు, భవనాలు, ఆర్థిక, ప్రణాళిక, రెవెన్యూ(వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, ఆర్ఎస్), పర్యావరణం, అడవులు, సైన్స్-టెక్నాలజీ, ఉన్నత, సాంకేతిక విద్యలు, నైపుణ్యాభివృద్ధి, గనులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నూతన రాజధాని నిర్మాణం, పర్యాటక, న్యాయ శాఖ, లెజిస్లేచర్, సీఎం కార్యాలయం నిర్వహణ, సీఎం విదేశీ పర్యటనలు, సీఎంవోలోని ఇతర అధికారులకు కేటాయించని శాఖలు. సీఎం కార్యదర్శి జి.సాయిప్రసాద్‌కు కేటాయించిన శాఖలు: రెవెన్యూ(భూములు), వ్యవసాయం, సహకారం, ఉద్యాన శాఖ, పట్టుపరిశ్రమ, పశుసంవర్ధక, డెయిరీ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, నీటిపారుదల, ఇంధనశాఖ, ధరల నియంత్రణ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాలు, అన్ని సంక్షేమ శాఖలు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ(దేవాదాయ). సీఎం కార్యాలయం సంయుక్త కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్నకు కేటాయించిన శాఖలు: రెవెన్యూ(పునరావాసం, ప్రకృతివైపరీత్యాల నిర్వహణ), మానవ వనరుల అభివృద్ధి(ప్రాథమిక, సెకండరీ విద్య), గృహనిర్మాణం, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, యువజన సర్వీసులు, క్రీడలు, సాంస్కృతిక శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం, ఆర్‌ఐఏడీ, ప్రభుత్వరంగ సంస్థల శాఖ, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ. మహిళా, శిశు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం. {పత్యేకాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరికి కేటాయించిన శాఖలు: సీఎం సహాయనిధి, సీఎంకు అందే వినతుల పర్యవేక్షణ. కేంద్ర నిధుల సమీకరణ, ఖర్చుల పర్యవేక్షణ, వనరుల సమీకరణ, కేంద్ర పథకాల పర్యవేక్షణ. మరో ప్రత్యేకాధికారి సీతేపల్లి అభీష్టకు కేటాయించిన శాఖలు: ఐటీ, ఐటీ మౌలిక సదుపాయాలు, ఈ గవర్నెన్స్, ఏపీఎస్ఏసీ.