ముఖ్యమంత్రికి ఇచ్చినా అటకెక్కాల్సిందే..
- అందిన పిటిషన్లు 11,880
- పరిష్కారమైనవి కేవలం 59
- అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎంవో
సాక్షి, హైదరాబాద్: ‘అధికారులు.. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి వేసారిపోతున్నాం.. ఎన్ని అర్జీలు ఇచ్చినా లాభం లేదు... నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి(సీఎంవో) అర్జీ పెట్టుకుంటేనన్నా తమ సమస్యకు కనీస పరిష్కారం దొరుకుతుంది... ఎమ్మెల్యేనో, ఎంపీనో సిఫారసు లేఖ దానికి జోడిస్తే మరింత తొందరగా పని అవుతుంది...’ అనేది సగటు బాధితుడి నమ్మకం. కానీ.. సాక్షాత్తూ సీఎంవోలో ప్రజల విజ్ఞప్తులు.. అర్జీలకు దిక్కుమొక్కు లేకుండాపోయింది. వేలాది అర్జీలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. మొత్తం 11,880 పిటిషన్లు అందితే.. కేవలం 59 పరిష్కారమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ మానిటరింగ్ సెల్ లో నమోదైన ఈ అర్జీల పురోగతి తీరును చూసి సీఎంవోలోని ఉన్నతాధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు పిటిషన్ల పురోగతిపై నివేదికను పంపించాలని అన్ని విభాగాలకు లేఖలు రాశారు. సాధారణంగా ప్రజా విజ్ఞప్తులు, పిటిషన్లను సీఎంవో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రెండు వారాలకోసారి సీఎంవో అధికారులు సీఎంకు వీటి పురోగతిని నివేదించాల్సి ఉంటుంది. వీఐపీల ద్వారా లేదా సీఎంవోకు నేరుగా అందిన అర్జీలన్నింటినీ అధికారులు సంబంధిత విభాగాలకు పంపిస్తారు. అక్కడ వాటిని పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సూచిస్తారు. అందులో యోగ్యమైన వాటిని పరిష్కరించడం లేదంటే తిరస్కరించడం క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారి బాధ్యత. ఈ అర్జీపై తీసుకున్న యాక్షన్.. లేదంటే పరిష్కరించిన చర్యను.. తిరస్కరిస్తే కారణాలను తమ విభాగపు ఉన్నతాధికారుల ద్వారా తిరిగి సీఎంవోకు తెలియపరుస్తారు.
కానీ, ఇప్పుడున్న ఈ అర్జీల పురోగతి చూస్తే క్షేత్రస్థాయిలో ఇవన్నీ పెండింగ్‌లో ఉన్నాయా...? లేదా వీటికి సంబంధించిన సమాచారం సీఎంవోకు తిరిగి అందడం లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే అన్ని విభాగాల అధికారులు తమ దగ్గరున్న పిటిషన్లపై సమీక్ష జరపాలని.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నవి తక్షణమే పరిష్కరించాలని సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పిటిషన్ మానిటరింగ్ సిస్టమ్‌లో ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించడం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.
అర్జీ... అంతేసంగతి!
Published Sun, Aug 16 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM
Advertisement
Advertisement