సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి | First posting to Dhanunjaya Reddy in YS Jagan Government | Sakshi
Sakshi News home page

సీఎంఓ అదనపు కార్యదర్శిగా ధనుంజయరెడ్డి

Published Fri, May 31 2019 4:52 AM | Last Updated on Fri, May 31 2019 4:52 AM

First posting to Dhanunjaya Reddy in YS Jagan Government - Sakshi

సాక్షి, అమరావతి/రాయచోటి: ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) అదనపు కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి కె.ధనుంజయరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ధనుంజయరెడ్డి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) అదనపు కమిషనర్‌గా, అనంతరం రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ)గా, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ, విపత్తు నిర్వహణ శాఖల డైరెక్టర్‌గా,  శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూనే గోదావరి పుష్కరాల ఇన్‌ఛార్జిగా కూడా రేయింబవళ్లు పనిచేసి ప్రశంసలందుకున్నారు.

ధనుంజయరెడ్డికి ఏ బాధ్యతలు అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తారనే గుర్తింపు పొందారు. ఆయన ఇప్పటివరకూ పనిచేసిన ప్రతిచోటా ప్రణాళికాబద్ధంగా కష్టపడి పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించారని అధికారవర్గాల్లో పేరుంది. వైఎస్సార్‌ జిల్లా రాయచోటికి చెందిన ధనంజయరెడ్డికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంతో మంచి అనుబంధం ఉంది. వైఎస్‌ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుల్లో ఆయన ఒకరు. వీటన్నింటికీ తోడు సమర్థవంతమైన అధికారిగా మంచి పేరుండటంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన్ను తన అదనపు కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేషీలో నియమితులైన మొట్టమొదటి అధికారి ధనుంజయరెడ్డి కావడం గమనార్హం.

సర్పంచ్‌ నుంచి అదనపు కార్యదర్శిగా..
ధనుంజయరెడ్డి 1988లో కడప జిల్లా రాయచోటి మండల చెన్నముక్కపల్లె సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచిగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ సివిల్స్‌లో ఉత్తీర్ణతను సాధించారు. 1992లో సర్పంచి పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ పరిపాలనా విభాగంలో చేరారు. పాలనాదక్షుడిగా పేరు సంపాదించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ కొలువులో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు.అభివృద్ధితో పాలకులు, ఉన్నతాధికారుల మన్ననలు అందుకున్నారు.

టీడీపీ పాలనలో విపత్తుల శాఖ రాష్ట్రాధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, శ్రీకాకుళం కలెక్టరుగా, అనంతరం పర్యాటక శాఖ రాష్ట్ర అధికారిగా ఉంటూ ప్రగతిపై తనదైన ముద్రను వేసుకున్నారు. ఎక్కడున్నా ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలతో మమేకమయ్యే తత్వముంది. విశిష్ట లక్షణాలున్న ఈ అధికారి రాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక వహించగలరనే నమ్మకంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి ముందే ధనుంజయరెడ్డిని అడిషనల్‌ సెక్రటరీగా నియమించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement