Chief Secretary SP Singh
-
స్వేచ్ఛా భారత్ దిశగా కదలండి
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారత్ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్ జర్నలిస్టు ప్రతిభానందకుమార్ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్ పబ్లిక్ స్కూల్లో హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు. కుచించుకుపోతున్న ప్రజాస్వామిక వాతావరణం పద్మావత్ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు. కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్‌మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు. భిన్న సంస్కృతులకు నిలయం.. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు. స్పెయిన్ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్ ఆఫ్ మిషన్ ఎడ్యురో సాంచెజ్ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్‌మాన్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్‌లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు అనంతరం స్పెయిన్ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్, సినీ దర్శకుడు డాక్టర్ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు. లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్. చిత్రంలో బుర్రా వెంకటేశం -
కొత్త సీఎస్ ఎస్పీ సింగ్
► ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బాధ్యతల స్వీకరణ ► నెల రోజులకే పదవీ విరమణ పొందిన ప్రదీప్ చంద్ర ► పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు ► మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఏకే ఖాన్ నియామకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్ ప్రసాద్ సింగ్ (ఎస్పీ సింగ్) నియమితులయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనను సీఎస్‌గా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో పూర్తయింది. కేవలం నెల రోజుల పాటే ఆయన సీఎస్‌గా కొనసాగారు. వాస్తవానికి మరో మూడు నెలల పాటు ప్రదీప్ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ అనుమతి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు కూడా మిగతా కేంద్రం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యమైంది. దీంతో కొత్త సీఎస్ నియామకంపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి... ప్రదీప్‌చంద్ర తర్వాత సీనియారిటీ జాబితాలో ఉన్న ఐఏఎస్ అధికారి ఎస్పీ సింగ్‌కు అవకాశం కల్పించారు. సీఎస్ పదవి కోసం ఎస్పీ సింగ్‌తో పాటు సీనియర్ ఐఏఎస్‌లు ఎంజీ గోపాల్, ఎస్కే జోషి, ఆర్ఆర్ ఆచార్య, వీకే అగర్వాల్‌ల పేర్లు సైతం ముఖ్యమంత్రి పరిశీలించినట్లు తెలిసింది. అయితే అనుభవమున్న అధికారి కావడం, వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు సర్వీసు ఉండడంతో ఎస్పీ సింగ్ నియామకానికి మొగ్గు చూపినట్లు సమాచారం. వివిధ శాఖల్లో చురుకైన పాత్ర 1983 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్ బీహార్‌కు చెందిన వారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. స్పెషల్ సీఎస్ హోదా కూడా పొందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ‘మిషన్ భగీరథ’ప్రాజెక్టు పురోగతిలో చురుకైన పాత్ర పోషించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సింగ్ నూతన సీఎస్‌గా నియమితులైన ఎస్పీ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్పీ సింగ్ మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి బృహత్తర లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్‌కు పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు. అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి వరకు పరిశ్రమల శాఖతో పాటు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అరవింద్‌కుమార్... ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టకరమంటూ వేలెత్తి చూపారు. ఇంధన శాఖ నుంచి బదిలీకి ఒక రోజు ముందు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ స్వయంగా ఈఆర్సీకి లేఖ రాశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ లేఖ రాయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అరవింద్‌కుమార్‌ను అంతగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిట్లుగా అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. సలహాదారుగా ఏకే ఖాన్ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి, శనివారం రిటైర్ అయిన ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. ఏకే ఖాన్ సేవలను వినియోగించుకోవాలని భావించిన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.