కొత్త సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ | Telangana Chief Secretary SP Singh Takes Charges | Sakshi
Sakshi News home page

కొత్త సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌

Published Mon, Jan 2 2017 5:52 AM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

కొత్త సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌ - Sakshi

కొత్త సీఎస్‌ ఎస్‌పీ సింగ్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. బాధ్యతల స్వీకరణ
నెల రోజులకే పదవీ విరమణ పొందిన ప్రదీప్‌ చంద్ర
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు
మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఏకే ఖాన్‌ నియామకం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా శేఖర్‌ ప్రసాద్‌ సింగ్‌ (ఎస్‌పీ సింగ్‌) నియమితులయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయనను సీఎస్‌గా నియమిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. నవంబర్‌ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌ చంద్ర పదవీకాలం శనివారంతో పూర్తయింది. కేవలం నెల రోజుల పాటే ఆయన సీఎస్‌గా కొనసాగారు.

వాస్తవానికి మరో మూడు నెలల పాటు ప్రదీప్‌ చంద్ర పదవీకాలాన్ని పొడిగించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ అనుమతి రాలేదు. శనివారం అర్ధరాత్రి వరకు కూడా మిగతా కేంద్రం నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో కొత్త సీఎస్‌ నియామకం అనివార్యమైంది. దీంతో కొత్త సీఎస్‌ నియామకంపై కసరత్తు చేసిన ముఖ్యమంత్రి... ప్రదీప్‌చంద్ర తర్వాత సీనియారిటీ జాబితాలో ఉన్న ఐఏఎస్‌ అధికారి ఎస్‌పీ సింగ్‌కు అవకాశం కల్పించారు. సీఎస్‌ పదవి కోసం ఎస్‌పీ సింగ్‌తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌లు ఎంజీ గోపాల్, ఎస్‌కే జోషి, ఆర్‌ఆర్‌ ఆచార్య, వీకే అగర్వాల్‌ల పేర్లు సైతం ముఖ్యమంత్రి పరిశీలించినట్లు తెలిసింది. అయితే అనుభవమున్న అధికారి కావడం, వచ్చే ఏడాది జనవరి నెలాఖరు వరకు సర్వీసు ఉండడంతో ఎస్పీ సింగ్‌ నియామకానికి మొగ్గు చూపినట్లు సమాచారం.

వివిధ శాఖల్లో చురుకైన పాత్ర
1983 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఎస్పీ సింగ్‌ బీహార్‌కు చెందిన వారు. ఉమ్మడి ఏపీలో, తెలంగాణ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేశారు. స్పెషల్‌ సీఎస్‌ హోదా కూడా పొందారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ‘మిషన్‌ భగీరథ’ప్రాజెక్టు పురోగతిలో చురుకైన పాత్ర పోషించారు.

బాధ్యతలు స్వీకరించిన ఎస్‌పీ సింగ్‌
నూతన సీఎస్‌గా నియమితులైన ఎస్‌పీ సింగ్‌ ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎస్‌పీ సింగ్‌ మాట్లాడారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని.. సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి బృహత్తర లక్ష్యాలతో ముందుకు సాగుతున్నారని, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పేదలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ సింగ్‌కు పలువురు ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.

అరవింద్‌కుమార్‌పై బదిలీ వేటు
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలి వరకు పరిశ్రమల శాఖతో పాటు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తించిన అరవింద్‌కుమార్‌... ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్‌ ఒప్పందం రాష్ట్రానికి తీవ్ర నష్టకరమంటూ వేలెత్తి చూపారు. ఇంధన శాఖ నుంచి బదిలీకి ఒక రోజు ముందు ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ స్వయంగా ఈఆర్‌సీకి లేఖ రాశారు. ప్రభుత్వానికి తెలియకుండా ఈ లేఖ రాయడాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నట్లు చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే అరవింద్‌కుమార్‌ను అంతగా ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేసిట్లుగా అధికార వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సలహాదారుగా ఏకే ఖాన్‌
ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసి, శనివారం రిటైర్‌ అయిన ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా నియమించింది. ఏకే ఖాన్‌ సేవలను వినియోగించుకోవాలని భావించిన సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement