Child Genius
-
జ్ఞాపకశక్తిలో భళా దేవాన్షి
రామచంద్రాపురం (పటాన్చెరు): అద్భుత మేధస్సు.. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చెబితే చాలు.. గుర్తించి దాని పేర్లను చెబుతుంది. ఏడాది 9 నెలల వయసున్న ఆ బాల మేధావి అసమాన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023లో చోటు సంపాదించింది. వివరాలివి. రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతానికి చెందిన బండారి విజయేంద్ర, మౌనిక దంపతుల కుమార్తె దేవాన్షి.. వస్తువులను గుర్తించడం, అంకెలను ఒకటి నుండి పది వరకు చెప్పడం, ఐదు రకాల జంతువుల్లా అరవడంలో దిట్ట. దీంతో కుటుంబ సభ్యులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. వారి సూచనల ప్రకారం కుమార్తె ప్రతిభపై చిత్రీకరించిన వీడియోలు, జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువులను సమర్పించారు. ఆ వీడియోలో దేవాన్షి 15 బొమ్మలు, ఆరు శిశువు ఉత్పత్తులు, తొమ్మిది కూరగాయలు, ఐదు కార్టూన్ పాత్రలు, శరీరంలోని 11 భాగాల చిత్రాలను గుర్తించినట్టు చూపించారు. అదనంగా 6 రైమ్‌లు, 10 యాక్షన్ పదాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం, ఐదు జంతువుల శబ్ధాలను అనుసరించడం వంటివి రికార్డు చేశారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దేవాన్షికి చోటు కల్పించారు. కాగా చిన్నారి తండ్రి విజయేంద్ర జూరాల ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నారు. -
ఆసియాలోనే అతి పిన్నవయసు డేటా సైంటిస్ట్
అతనో అద్భుతం.. అసాధ్యాలను సుసాధ్యం చేయగల బాలనగధీరుడు. అంతర్జాతీయ స్థాయిలో అసమాన ప్రతిభాపాటవాలను చాటి అబ్బురపరిచిన జ్ఞానయోధుడు.. 15 ఏళ్లకే ఆసియాలోనే అతిపిన్న వయసున్న డేటా సైంటిస్టుగా గుర్తింపు పొందిన శక్తిమాన్.. తెలంగాణ ప్రభుత్వమూ అతని మహత్తర ప్రజ్ఞకు ముగ్ధురాలైంది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను అప్పగించింది. ఈ బృహత్తర ఆవిష్కరణను భుజానికెత్తుకున్న బాలమేధావి ఎవరో కాదు.. పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. స్వస్థలం తెనాలి. తెనాలి: ప్రియ మానస, రాజ్‌కుమార్ దంపతుల ముద్దుల కొడుకు పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్. సిద్ధార్థకు చిన్ననాటి నుంచి కంప్యూటర్ అంటే మక్కువ ఎక్కువ. అతడి ఆసక్తిని గుర్తించిన తండ్రి నాలుగో తరగతినుంచే కంప్యూటర్ బేసిక్స్, టెక్నాలజీ, లాంగ్వేజెస్‌ను నేర్పిస్తూ వచ్చారు. నాలుగైదేళ్లు గడిచేసరికి సిద్ధార్థకు కంప్యూటర్‌పై పట్టు చిక్కింది. అడ్వాన్స్ లెవెల్‌కు చేరుకోగలిగాడు. సొంతంగా ఆన్లైన్లో కొన్ని నమూనా ప్రాజెక్టులు చేశాడు. ఉద్యోగం చేస్తానని తండ్రిని కోరాడు. కానీ ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కంప్యూటర్ సంస్థలో అతడిని చేర్చాలని తీసుకువెళ్లగా బాలుడన్న కారణంతో తిరస్కరించారు. చేసేదిలేక రాజ్‌కుమార్ ఆన్లైన్ కోర్సులను కొనిచ్చారు. ఆ వీడియోలు చూస్తూ స్వయం అధ్యయనం ప్రారంభించిన సిద్ధార్థ వాటిపై కమాండ్ సాధించాడు. సడలని సంకల్పం ఉద్యోగం చేయడం భారత్‌లో సాధ్యం కాదని తండ్రి నిరాశపరిచినా సిద్ధార్థ పట్టు సడలలేదు. స్వయంగా రెజ్యూమ్ తయారుచేసుకుని ప్రముఖ కంపెనీలకు పంపాడు. కొన్ని కంపెనీలు ఫోన్లో సంప్రదించాయి. అతడి కంప్యూటర్ పరిజ్ఞానానికి అబ్బురపడినా వయసు తెలిసి మిన్నకున్నాయి. ఈ విషయం మోంటెగ్న్ కంపెనీ సీఈఓ వరకు వెళ్లడంతో ఆయన సిద్ధార్థను స్వయంగా పిలిపించుకుని సుదీర్ఘ ఇంటర్వ్యూ చేశారు. ‘నీతో వండర్స్ చేయిస్తా’నంటూ ఉద్యోగ ఆఫర్ ఇచ్చారు. చదువుకు ఆటంకం కలగరాదన్న తండ్రి షరతుతో వారంలో మూడురోజుల ఉద్యోగానికి సిద్ధార్థ ఓకే చేశాడు. పాఠశాల యాజమాన్యం సహకారంతో ఏడో తరగతిలోనే ఐటీ ఉద్యోగిగా నెలకు రూ.25 వేల జీతంతో చేరాడు. ప్రస్తుతం ఇనిఫినిటీ లెర్న్ అనే సంస్థలో డేటా సైంటిస్ట్‌గా నెలకు రూ.45 వేల వేతనం అందుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వినూత్నమైన గేమ్ డిజైనింగ్‌లో కృషి చేస్తున్నాడు. చదువుకు ఆటంకం కలగకుండానే.. స్వస్థలం తెనాలి అయినా సిద్ధార్థ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సిద్ధార్థ హైదరాబాద్‌లోని శ్రీచైతన్యలో పదోతరగతి చదువుతున్నాడు. వారంలో మూడురోజులు స్కూలుకు వెళ్లే అతను మూడురోజులు ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఐటీ సంస్థలో ఉద్యోగానికి వెళ్తాడు. అంతేకాకుండా అమెరికన్ కంపెనీ ‘రైట్ ఛాయిస్’తరపున అక్కడి విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా కోడింగ్ క్లాసులనూ నిర్వహిస్తున్నాడు. అందుకే సిద్ధార్థను బైజూస్ కంపెనీ ‘యంగ్ జీనియస్’ అవార్డుతో సత్కరించింది. బృహత్తర బాధ్యత ఈ నేపథ్యంలో సిద్ధార్థకు తెలంగాణ ప్రభుత్వం బృహత్తర బాధ్యతను అప్పగించింది. భూకంపాల రాకను ముందుగానే గుర్తించే కేంద్రప్రభుత్వ రీసెర్చ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని కోరింది. తెలంగాణ ఐటీ మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్ స్వయంగా సిద్ధార్థను ఆహ్వానించి ఈ ప్రాజెక్టును అప్పగించారు. సిద్ధార్థ పరిశోధనలు ఫలిస్తే ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారని అతడి తండ్రి రాజ్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో ఈ ప్రాజెక్టు రీసెర్చ్ కొనసాగిస్తున్న సిద్ధార్థ.. మరోవైపు కోడింగ్ క్లాసులు చెబుతూ ఉద్యోగం చేస్తూ బాగానే ఆర్జిస్తున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పైనా ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాడు. (క్లిక్: పుష్పపై ‘ఫైర్’.. స్మగ్లర్ వీరప్పన్‌కే ముచ్చెమటలు పట్టించి..) లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోపాటు జుకర్ బర్గ్, సుందర్ పిచాయ్‌ల జీవితచరిత్రలు, బిల్‌గేట్స్ మాటలు, స్టీవ్‌జాబ్స్ పనితీరు నాకు ఆదర్శం. వారి ప్రేరణతోనే నా కలల సౌధాన్ని నిర్మించుకుంటున్నా. ప్రపంచ టాప్ ఫైవ్‌లోని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలని ఉంది. మంచి గేమ్ డిజైన్ చేయాలనేది నా లక్ష్యం. ప్రజోపయోగ ప్రాజెక్టులు చేయాలనేది ధ్యేయం. వీలైతే మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపొందించాలని ఉంది. నా లక్ష్యాల సాధనకు ప్రతిక్షణం కష్టపడతా. – పిల్లి సిద్ధార్థ శ్రీవాత్సవ్, డేటా సైంటిస్టు -
ప్రపంచ బాల మేధావి ఈశ్వర్ శర్మ
లండన్: ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్ విద్యార్థి, బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర్ శర్మను ప్రపంచ బాల మేధావి–2020 అవార్డుతో బ్రిటన్ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘45 దేశాల నుంచి 15 వేల మంది దరఖాస్తుదారుల్లో ప్రపంచ బాల మేధావి అవార్డుకు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు. -
ఐన్‌స్టీన్‌నే మించినోడు!
లండన్: బ్రిటన్‌లో ఓ టీవీ షోలో పాల్గొన్న 12 ఏళ్ల భారత సంతతి బాలుడు ఒక్కరోజులో హీరో అయ్యాడు. చానెల్ 4లో ప్రసారమైన ‘చైల్డ్ జీనియస్’ కార్యక్రమం తొలిరౌండ్లో రాహుల్ అనే బాలుడు 14 ప్రశ్నలకు సరిగా సమాధానమిచ్చి అబ్బురపరిచాడు. వారం పాటు నిర్వహించే ఈ పోటీలో పాల్గొంటున్న 8–12 ఏళ్లున్న 20 మంది బాలల నుంచి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు. ఈ వారాంతంలో ఫైనల్ జరుగుతుంది. స్పెల్లింగ్ టెస్ట్‌లో రాహుల్ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తి పరీక్షలో 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాడు. అతని ఐక్యూ 162గా నిర్ధారించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ కన్నా ఇది ఎక్కువ కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఐక్యూ కలిగిన వారి క్లబ్ అయిన మెన్సాలో సభ్యుడయ్యేందుకు రాహుల్ అర్హత సాధించాడు.