ఐన్‌స్టీన్‌నే మించినోడు!
లండన్: బ్రిటన్‌లో ఓ టీవీ షోలో పాల్గొన్న 12 ఏళ్ల భారత సంతతి బాలుడు ఒక్కరోజులో హీరో అయ్యాడు. చానెల్ 4లో ప్రసారమైన ‘చైల్డ్ జీనియస్’ కార్యక్రమం తొలిరౌండ్‌లో రాహుల్ అనే బాలుడు 14 ప్రశ్నలకు సరిగా సమాధానమిచ్చి అబ్బురపరిచాడు. వారం పాటు నిర్వహించే ఈ పోటీలో పాల్గొంటున్న 8–12 ఏళ్లున్న 20 మంది బాలల నుంచి ఒకరిని విజేతగా ప్రకటిస్తారు.
ఈ వారాంతంలో ఫైనల్ జరుగుతుంది. స్పెల్లింగ్ టెస్ట్‌లో రాహుల్ పూర్తి మార్కులు పొందగా, జ్ఞాపక శక్తి పరీక్షలో 15 ప్రశ్నల్లో 14 ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పాడు. అతని ఐక్యూ 162గా నిర్ధారించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ కన్నా ఇది ఎక్కువ కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక ఐక్యూ కలిగిన వారి క్లబ్ అయిన మెన్సాలో సభ్యుడయ్యేందుకు రాహుల్ అర్హత సాధించాడు.