ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన చిన్నారి దేవాన్షి
రామచంద్రాపురం (పటాన్‌చెరు): అద్భుత మేధస్సు.. అమోఘమైన జ్ఞాపకశక్తి ఆ చిన్నారి సొంతం. ఒక్కసారి చెబితే చాలు.. గుర్తించి దాని పేర్లను చెబుతుంది. ఏడాది 9 నెలల వయసున్న ఆ బాల మేధావి అసమాన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2023లో చోటు సంపాదించింది. వివరాలివి.
రామచంద్రాపురం పట్టణంలోని కాకతీయ నగర్ ప్రాంతానికి చెందిన బండారి విజయేంద్ర, మౌనిక దంపతుల కుమార్తె దేవాన్షి.. వస్తువులను గుర్తించడం, అంకెలను ఒకటి నుండి పది వరకు చెప్పడం, ఐదు రకాల జంతువుల్లా అరవడంలో దిట్ట. దీంతో కుటుంబ సభ్యులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని సంప్రదించారు. వారి సూచనల ప్రకారం కుమార్తె ప్రతిభపై చిత్రీకరించిన వీడియోలు, జనన ధ్రువీకరణ పత్రం, చిరునామా రుజువులను సమర్పించారు.
ఆ వీడియోలో దేవాన్షి 15 బొమ్మలు, ఆరు శిశువు ఉత్పత్తులు, తొమ్మిది కూరగాయలు, ఐదు కార్టూన్ పాత్రలు, శరీరంలోని 11 భాగాల చిత్రాలను గుర్తించినట్టు చూపించారు. అదనంగా 6 రైమ్‌లు, 10 యాక్షన్ పదాలు, 1 నుంచి 10 వరకు సంఖ్యలను లెక్కించడం, ఐదు జంతువుల శబ్ధాలను అనుసరించడం వంటివి రికార్డు చేశారు. వాటిని పరిశీలించిన నిర్వాహకులు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో దేవాన్షికి చోటు కల్పించారు. కాగా చిన్నారి తండ్రి విజయేంద్ర జూరాల ప్రాజెక్టులో ఏఈగా పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment