children home
-
ఫాతిమాగా తప్పిపోయి.. స్వప్నగా తిరిగొచ్చింది
సాక్షి, హైదరాబాద్: గత పదిహేనేళ్లుగా సాకినా తప్పిపోయిన తన బిడ్డ ఫాతిమాను తలుచుకుని ఏడవని రోజంటూ లేదు. రెండున్నరేళ్ల వయసులో తప్పిపోయిన తన కుమార్తె.. ప్రస్తుతం ఎక్కడుందో.. ఎలా ఉందో.. అసలు బతికి ఉందో లేదో అనే ఆలోచన ఆ తల్లి గుండెని పిండేసేది. ఎక్కడో ఒక చోట తన బిడ్డ క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థించేది. ఆమె మొర ఆలకించిన దేవుడు దాదాపు 16 ఏళ్ల తర్వాత వారి గుండెకోతను దూరం చేశాడు. చివరకు కుమార్తెని తల్లిదండ్రుల వద్దకు చేర్చాడు. దాదాపు 16 ఏళ్ల క్రితం కర్నూలుకు చెందిన ఫాతిమా తన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చింది. మక్కా మసీదు సందర్శనలో ఉండగా.. తప్పిపోయింది. అప్పటి నుంచి వెతుకుతుండగా..16 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లోని ఓ చిల్డ్రన్ హోంలో తనను గుర్తించారు. ప్రస్తుతం ఆమెని కుటుంబం వద్దకు చేర్చారు. అయితే ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ముస్లిం కుటుంబంలో జన్మించిన ఫాతిమా.. ఆ తర్వాత 15 ఏళ్లు హోంలో స్వప్న పేరుతో హిందువుగా పెరిగింది. ఆమె ప్రస్తుతం తన కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతుంది. ఈ సందర్భంగా ఫాతిమా అలియాస్ స్వప్న సోదరుడు అబిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘ఇది ఓ ఉద్వేగభరిత సన్నివేశం. మేం ఫాతిమాను మా ఇంటికి తీసుకెళ్లి.. బంధువులు, స్నేహితులకు పరిచయం చేస్తాం. ఆ తర్వాత ఆమెను తిరిగి హోంకు పంపిస్తాం. తన చదువును కొనసాగిస్తుంది’ అని తెలిపాడు. (చదవండి: 16 ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బాలిక!) -
కుమారుడిని వదిలించుకున్నతల్లిదండ్రులు
సాక్షి, చిత్తూరు : నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వరాలయం వద్ద కుమారుడిని వదలి తల్లిదండ్రులు అదృశ్యమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కుబిక్కుమంటూ దిగాలుగా ఉన్న ఆ బాలుడిని భక్తులు, ఆలయ అధికారులు గమనించి చేరదీశారు. బుజ్జగించి అతడి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు ఏసు అని, తనది ఏలూరు అని, తన తండ్రి పేరు సుబ్బారావు, తల్లిపేరు పుష్ప అని తెలిపాడు. తన తల్లిదండ్రులు బాతులు మేపుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారని, రాత్రి నుంచి కనిపించకుండా పోయారని ఏడుస్తూ చెప్పాడు. ఆలయ అధికారులు ఆ బాలుడిని నాగలాపురం పోలీసులకు అప్పగించారు. స్పందించిన పోలీసులు అతను చెప్పిన వివరాలను ఏలూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేసి తల్లిదండ్రుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాలుడిని తాత్కాలికంగా సురుటపల్లి చిన్న పిల్లల హోమ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతిలోని చిన్న పిల్లల హోమ్‌కు శనివారం తరలిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. -
తండ్రి స్థానంలో ఉండి 12మంది బాలికలను..
న్యూఢిల్లీ: తండ్రి స్థానంలో ఉండాల్సిన ఉద్యోగి కామాంధుడిగా మారాడు. తన పిల్లల వయసున్న వారిపై లైంగిక వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా తన చర్యలను సెల్ ఫోన్లో వీడియోలు తీశాడు. ఇలా అతడు చేసిన దారుణం ఒక్కరిపైనో ఇద్దరిపైనో కాదు.. పన్నెండుమంది బాలికలపైన. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. మొబైల్ ఫోన్‌ను తనిఖీల నిమిత్తం పంపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీనా అనే అధికారి 1998లో ప్రభుత్వ సంక్షేమ శాఖలో ఉద్యోగిగా చేరాడు. ఇటీవలె అతడు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతడిని ప్రభుత్వం ఓ బాలికల సంరక్షణ గృహానికి అధికారిగా పంపించింది. అయితే, అలా వెళ్లిన అతడు ఈ నెల (జూన్) 2న వికృత చర్యలకు ప్రణాళిక రచించుకున్నాడు. పన్నెండుమంది 8 నుంచి 10 ఏళ్లలోపు ఉన్న బాలికలను ఓ గదిలోకి తీసుకెళ్లి టీవీ ఆన్ చేసి చూడమని చెప్పాడు. అనంతరం ఒక్కొక్కరిని తన వద్దకు వేరే గదిలోకి రావాలని ఆదేశించాడు. అలా వచ్చిన బాలికను పరీక్షల పేరుతో చేతులు కట్టేసి అనంతరం అసభ్యంగా ముట్టుకుంటూ బట్టలు విప్పేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా మొత్తం పన్నెండుమందిపై ఇలాగే చేశాడు. ఇదంతా తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. అలా అతడి బారిన పడిన బాలికలు ఇన్ ఫెక్షన్కు గురికావడంతో అసలు విషయం బయటకు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.