
సురుటపల్లిలో తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తున్న బాలుడు ఏసు
సాక్షి, చిత్తూరు : నాగలాపురం మండలం సురుటపల్లిలోని శ్రీ పళ్లికొండేశ్వరాలయం వద్ద కుమారుడిని వదలి తల్లిదండ్రులు అదృశ్యమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బిక్కుబిక్కుమంటూ దిగాలుగా ఉన్న ఆ బాలుడిని భక్తులు, ఆలయ అధికారులు గమనించి చేరదీశారు. బుజ్జగించి అతడి వివరాలు తెలుసుకున్నారు. తన పేరు ఏసు అని, తనది ఏలూరు అని, తన తండ్రి పేరు సుబ్బారావు, తల్లిపేరు పుష్ప అని తెలిపాడు. తన తల్లిదండ్రులు బాతులు మేపుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారని, రాత్రి నుంచి కనిపించకుండా పోయారని ఏడుస్తూ చెప్పాడు. ఆలయ అధికారులు ఆ బాలుడిని నాగలాపురం పోలీసులకు అప్పగించారు. స్పందించిన పోలీసులు అతను చెప్పిన వివరాలను ఏలూరు పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరవేసి తల్లిదండ్రుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. బాలుడిని తాత్కాలికంగా సురుటపల్లి చిన్న పిల్లల హోమ్‌కు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతిలోని చిన్న పిల్లల హోమ్‌కు శనివారం తరలిస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment