సీమాంధ్రలో సమైక్య రాష్ట ఉద్యమం పొగలు సెగలు కక్కుతుంది. చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న బంద్ ఆదివారం ఐదో రోజుకు చేరుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తురు ఎమ్మెల్యే సీకేబాబు చేపట్టిన దీక్షకు జిల్లావాసుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులన్ని డిపోలకే పరిమితమైనాయి. తిరుపతిలో ఎస్కే యూనివర్శిటీ విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది.
వైఎస్ఆర్ జిల్లాలో కూడా నిరసనల హోరు ఉధృతమైంది. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్రెడ్డి చూస్తున్న దీక్ష మూడో రోజుకు చేరింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అనంతపురంలో ఎస్కే యూనివర్శిటీలోని అధ్యాపక బృందం తమ కుటుంబసభ్యులతో ఆదివారం యూనివర్శిటీ ఎదుట ఆందోళన చేయనుంది. అలాగే సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోల్లో నిలిచిపోయాయి.
గుంటూరు జిల్లాలో నిరసనల హోరు ఊపందుకుంది. నగరంలో బంద్ ఐదో రోజు కూడా కొనసాగుతోంది. సమైక్యాంధ్ర మద్దతుగా ఏలూరు పట్టణంలోని జూట్ మిల్లు ఎదుట ఆదివారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో పలు పార్టీలకు చెందిన నేతలతోపాటు, స్థానికులు, జూట్ మిల్లు కార్మికులు పాల్గొన్నారు.
.