సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సులు గత 30 రోజులుగా డిపోలకే పరిమితమైనాయి. దాంతో తిరుపతి రీజియన్లో రూ.44 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. అలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ చేపట్టి దీక్ష 30 రోజుకు చేరుకుంది.
శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో విద్యార్థి జేఏసీ ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తు చేస్తున్న దీక్ష 25వ రోజుకు చేరుకుంది. అలాగే ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్జీవోలు చేపట్టిన దీక్ష 17వ రోజుకు చేరాయి. టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆ సంస్థ ఉద్యోగుల దీక్ష 26వ రోజుకు చేరింది.
ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణకు మద్దతుగా తుడా సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరింది.