chilkalguda police station
-
సూపర్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: ‘మెడలో లావుపాటి బంగారం గొలుసు వేసుకొని, ఫోన్ మాట్లాడుతూ ఎంచక్కా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు ఓ బాటసారి. వెనకాలే బైక్ మీద వచ్చిన ఇద్దరు స్నాచర్లు అతని మెడ మీద నుంచి చెయిన్‌ను స్నాచింగ్ చేసే ప్రయత్నం చేయగా.. వెంటనే బైక్ వెనకాల నుంచి బుల్లెట్ పేలింది. అంతే బైక్ వెనక కూర్చున్న స్నాచర్ కాలిలో బుల్లెట్ దిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్నాచర్ల బైక్ రేస్ పెంచి అక్కణ్నుంచి ఉడాయించారు’... ఇదీ స్నాచర్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వేసిన ప్లాన్. ఇటీవల కాలంలో నగరంలో ధార్, బవారియా గ్యాంగ్‌ల వరుస చెయిన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు స్నాచర్ల కోసం వల వేశారు. స్థానిక ఠాణా, సీఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో యాంటీ స్నాచింగ్ డెకాయ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.ముందు చెయిన్, వెనక తుపాకీ..సిటీలోని ప్రతి పోలీసు స్టేషన్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురితో ఈ టీమ్ ఉంటుంది. ఠాణాకు చెందిన పోలీసు మఫ్టీ డ్రెస్‌లో మెడలో చెయిన్ వేసుకొని, బయటికి కనిపించేలా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటాడు. ఇతనికి కాస్త దూరంలో తుపాకీతో సీఆర్ హెడ్ క్వార్టర్ పోలీసు నిఘా పెడుతూ నడుస్తుంటాడు. వీరిని సామాన్యులుగా భావించిన స్నాచర్లు స్నాచింగ్ చేసేందుకు వీరిని వెంబడిస్తారు. స్నాచింగ్ చేసే క్రమంలో పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వెనకాల తుపాకీతో గస్తీ కాస్తున్న పోలీసు వెంటనే నిందితులపై కాల్పులు జరుపుతారు.రెండు చోట్ల కాల్పులు, ఏడుగురు అరెస్టు..ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిలకలగూడ పీఎస్ పరిధిలోని ఆలుగడ్డ బావి ప్రాంతంలో మెడలో చెయిన్ వేసుకొని పోలీసులు వెళుతుండగా.. వెనక నుంచి ఇద్దరు స్నాచర్లు బైక్ వచ్చి స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వెనక నుంచి మరో పోలీసు కాల్పులు జరపడంతో ఓ స్నాచర్కు కాలులో బుల్లెట్ దిగింది. గాయంతోనే బైక్ మీద పారిపోయిన ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో శనివారం మార్కెట్ స్టేషన్ పరిధిలోని బాట వద్ద స్నాచింగ్ చేసేందుకు వచ్చిన రెండు బృందాలపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. శనివారం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ ఛబుత్రా’ టీమ్స్ పని చేయనున్నాయి. అర్థరాత్రి వీధుల్లో తిరిగే ఆకతాయిలను ఈ బృందాలు పట్టుకొని, కౌన్సెలింగ్ ఇస్తాయి. -
పథకం ప్రకారమే నజ్మా హత్య
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బాలిక నజ్మా హత్య పథకం ప్రకారమే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో సీసీ కెమెరాల ఫూటేజీ కీలకంగా మారింది. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు సుమారు వందలాది సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. అనుమానస్పద మృతి అని ముందుగా భావించినా హత్య అని నిర్ధారణకు వచ్చిన వెంటనే మూడు బృందాలను రంగంలోకి దింపి నిందితుడిని గంటల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నారు. చిలకలగూడ ఠాణా పరిధిలోని వారాసిగూడలో బాలిక నజ్మా శుక్రవారం వేకువజామున దారుణ హత్యకు గురైన సంగతి విధితమే. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు డయల్ 100కు సమాచారం అందిన 5 నిమిషాల్లో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. భవనం పైనుంచి పడి మృతి చెందినట్లు భావించినా మృతదేహం ఒంటిపై గాయాలు ఉండటంతో అప్రమత్తమయ్యారు. రెండు భవనాల మధ్య సందులో మృతదేహం పడిఉండటంతో ఏ భవనం నుంచి పడిందో తెలుసుకునేందుకు పైకి వెళ్లారు. అక్కడ రక్తపు మరకలు చూసి నిర్ధారించుకున్నారు. పోలీసులు చెప్పేంతవరకు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియదు. నజ్మా బాత్రూంలోనో లేక మేడపైనో చదువుకుంటుందని ఆమె కుటుంబసభ్యులు భావించారు. నజ్మాను దారుణంగా చంపేశారని తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. రంగంలోకి దిగిన చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడటంతో నిందితుడు సోహెబ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల నుంచి పెళ్లి చేసుకుంటానని తమ కుమార్తె వెంటపడుతున్నాడని చెప్పడంతో సోహెబ్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఇంట్లో మంచం కింద దాక్కున్న సోహెబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో వందలాది సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. సోహెబ్ తన ఇంటి నుంచి బయటకు వస్తున్న, మృతురాలి ఇంటి మేడపైకి వెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. సోహెబ్ ఫేస్బుక్ పేజీని ఓపెన్ చేసి సీసీ కెమెరాల్లో నమోదైన ఫొటోలతో సరిపోల్చుకుని అతడే నిందితుడని నిర్ధారించుకున్నారు. మృతి చెందినట్లు నిర్ధారణ చేసుకునేందుకు మరోమారు.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.45 గంటలకు సోహెబ్ మృతురాలి ఇంటికి వచ్చి టెర్రాస్ పైకి వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న నజ్మాతో ప్రేమ, పెళ్లి వ్యవహరాలపై గొడవ పడ్డాడు. ఇతరులతో చాటింగ్ చేయడాన్ని సహించలేని సోహెబ్ అందుబాటులో ఉన్న గ్రానైట్ రాయితో దాడి చేసి నజ్మాను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి రెండు భవనాల మధ్య కిందికి తోసేసి ఇంటికి వెల్లిపోయాడు. నజ్మా మృతి చెందిదా లేదా అనే అనుమానంతో వేకువజాము 3.15 నిమిషాలకు మరోమారు అక్కడకు చేరుకుని మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాడు. రెండవ మారు వచ్చివెళ్లిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా వ్యవహరించి బాలిక నజ్మా హత్య కేసును గంటల వ్యవధిలో చేధించిన పోలీసులను ఉన్నతాధికారులు, ప్రజలు అభినందించారు. -
పెళ్లికి ముందే వరకట్నం కేసు..
చిలకలగూడ(హైదరాబాద్): అనుకున్న 'మాట' ప్రకారం నిశ్చితార్థం జరిగిపోయింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న వివాహాం ఏర్పాట్లలో మునిగిపోయింది అమ్మాయి కుటుంబం. అంతలోనే ఒక పిడుగుపాటు. అనుకున్న 'మాట' కాకుండా ఇంకా పెద్ద మూటలిస్తేనే పెళ్లన్నారు వరుడి కుటుంబీకులు. మోసపోయామని గ్రహించిన అమ్మాయి కుటుంబం చివరికి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి జరగకముందే వరుడిపై వరకట్నం వేధింపుల కేసు నమోదయింది. మంగళవారం నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటాద్రి తెలిపిన వివరాలను బట్టి.. చిలకలగూడకు చెందిన భారతి అనే మహిళ తన కుమార్తె అయిన హేమలతకు ఓ సంబంధం ఖాయం చేసింది. అబ్బాయి పేరు ఎం. సదాశివం. ఉండేది తమిళనాడులోని వల్లూరులో. 40 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు కట్నంగా ఇచ్చేందుకు అంగీకారం కుదరటంతో గతేడాది అక్టోబర్ 19న హబ్సిగూడలోని ఓ కళ్యాణ మండపంలో నిశ్చితార్ధం జరిగింది. ఇక పెళ్లి ఏర్పాట్లలో పడ్డ అమ్మాయి తల్లి.. తేదీల ఖరారు కోసం మాట్లాడగా.. అతడు, అతడి తల్లిదండ్రులు మాటమార్చారు. పెళ్లి జరగాలంటే 150 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే వివాహం రద్దవుతుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా కలిస్తేనన్నా కాస్త మెత్తబడతారేమోనని భారతి ఇటీవలే వల్లూరులోని వరుడి ఇంటికి వెళ్లింది. అక్కడ సదాశివం, అతని సోదరుడు దినేష్‌లు భారతిని అసభ్య పదజాలంతో దూషించి దాడిచేశారు. గాయాలపాలైన భారతి హైదరాబాద్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదుచేసింది. వరుడు, అతని సోదరునిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు.