చిలకలగూడ(హైదరాబాద్): అనుకున్న 'మాట' ప్రకారం నిశ్చితార్థం జరిగిపోయింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న వివాహాం ఏర్పాట్లలో మునిగిపోయింది అమ్మాయి కుటుంబం. అంతలోనే ఒక పిడుగుపాటు. అనుకున్న 'మాట' కాకుండా ఇంకా పెద్ద మూటలిస్తేనే పెళ్లన్నారు వరుడి కుటుంబీకులు. మోసపోయామని గ్రహించిన అమ్మాయి కుటుంబం చివరికి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి జరగకముందే వరుడిపై వరకట్నం వేధింపుల కేసు నమోదయింది. మంగళవారం నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటాద్రి తెలిపిన వివరాలను బట్టి..
చిలకలగూడకు చెందిన భారతి అనే మహిళ తన కుమార్తె అయిన హేమలతకు ఓ సంబంధం ఖాయం చేసింది. అబ్బాయి పేరు ఎం. సదాశివం. ఉండేది తమిళనాడులోని వల్లూరులో. 40 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు కట్నంగా ఇచ్చేందుకు అంగీకారం కుదరటంతో గతేడాది అక్టోబర్ 19న హబ్సిగూడలోని ఓ కళ్యాణ మండపంలో నిశ్చితార్ధం జరిగింది. ఇక పెళ్లి ఏర్పాట్లలో పడ్డ అమ్మాయి తల్లి.. తేదీల ఖరారు కోసం మాట్లాడగా.. అతడు, అతడి తల్లిదండ్రులు మాటమార్చారు.
పెళ్లి జరగాలంటే 150 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే వివాహం రద్దవుతుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా కలిస్తేనన్నా కాస్త మెత్తబడతారేమోనని భారతి ఇటీవలే వల్లూరులోని వరుడి ఇంటికి వెళ్లింది. అక్కడ సదాశివం, అతని సోదరుడు దినేష్‌లు భారతిని అసభ్య పదజాలంతో దూషించి దాడిచేశారు. గాయాలపాలైన భారతి హైదరాబాద్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదుచేసింది. వరుడు, అతని సోదరునిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు.
పెళ్లికి ముందే వరకట్నం కేసు..
Published Tue, Jan 19 2016 10:43 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM
Advertisement
Advertisement