మెడలో చెయిన్‌తో, ఫోన్ మాట్లాడుతూ రోడ్డుపై నడక
కాస్త దూరంలో తుపాకీతో మరో పోలీసు నిఘా
స్నాచర్ పారిపోయేందుకు యత్నించే లోపు కాల్పులు
ఓ స్నాచర్ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
చిలకలగూడ, మార్కెట్– 2 ఠాణాల పరిధిలో కాల్పులు
వరుస స్నాచింగ్‌ల నేపథ్యంలో స్పెషల్ టీమ్‌ల ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ‘మెడలో లావుపాటి బంగారం గొలుసు వేసుకొని, ఫోన్ మాట్లాడుతూ ఎంచక్కా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు ఓ బాటసారి. వెనకాలే బైక్ మీద వచ్చిన ఇద్దరు స్నాచర్లు అతని మెడ మీద నుంచి చెయిన్‌ను స్నాచింగ్ చేసే ప్రయత్నం చేయగా.. వెంటనే బైక్ వెనకాల నుంచి బుల్లెట్ పేలింది. అంతే బైక్ వెనక కూర్చున్న స్నాచర్ కాలిలో బుల్లెట్ దిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్నాచర్ల బైక్ రేస్ పెంచి అక్కణ్నుంచి ఉడాయించారు’... ఇదీ స్నాచర్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వేసిన ప్లాన్. ఇటీవల కాలంలో నగరంలో ధార్, బవారియా గ్యాంగ్‌ల వరుస చెయిన్ స్నాచింగ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు స్నాచర్ల కోసం వల వేశారు. స్థానిక ఠాణా, సీఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో యాంటీ స్నాచింగ్ డెకాయ్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
ముందు చెయిన్, వెనక తుపాకీ..
సిటీలోని ప్రతి పోలీసు స్టేషన్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురితో ఈ టీమ్ ఉంటుంది. ఠాణాకు చెందిన పోలీసు మఫ్టీ డ్రెస్‌లో మెడలో చెయిన్ వేసుకొని, బయటికి కనిపించేలా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటాడు. ఇతనికి కాస్త దూరంలో తుపాకీతో సీఆర్ హెడ్ క్వార్టర్ పోలీసు నిఘా పెడుతూ నడుస్తుంటాడు. వీరిని సామాన్యులుగా భావించిన స్నాచర్లు స్నాచింగ్ చేసేందుకు వీరిని వెంబడిస్తారు. స్నాచింగ్ చేసే క్రమంలో పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వెనకాల తుపాకీతో గస్తీ కాస్తున్న పోలీసు వెంటనే నిందితులపై కాల్పులు జరుపుతారు.
రెండు చోట్ల కాల్పులు, ఏడుగురు అరెస్టు..
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిలకలగూడ పీఎస్ పరిధిలోని ఆలుగడ్డ బావి ప్రాంతంలో మెడలో చెయిన్ వేసుకొని పోలీసులు వెళుతుండగా.. వెనక నుంచి ఇద్దరు స్నాచర్లు బైక్ వచ్చి స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వెనక నుంచి మరో పోలీసు కాల్పులు జరపడంతో ఓ స్నాచర్‌కు కాలులో బుల్లెట్ దిగింది. గాయంతోనే బైక్ మీద పారిపోయిన ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో శనివారం మార్కెట్ స్టేషన్ పరిధిలోని బాట వద్ద స్నాచింగ్ చేసేందుకు వచ్చిన రెండు బృందాలపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. శనివారం నుంచి టాస్క్‌ఫోర్స్ పోలీసులలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ ఛబుత్రా’ టీమ్స్ పని చేయనున్నాయి. అర్థరాత్రి వీధుల్లో తిరిగే ఆకతాయిలను ఈ బృందాలు పట్టుకొని, కౌన్సెలింగ్ ఇస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment