చెరువులు ఆక్రమిస్తే కఠినచర్యలు
తిరుపతి : చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు చెరువును వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం పరిశీలించారు. ఈ చెరువు భూములు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపణలు రావడంతో గతంలో అధికారులు చెరువు వద్దకు వెళ్లగా వారిపై ఆక్రమణ దారులు దాడికి దిగారు. ఈ నేపధ్యంలో మంత్రి గురువారం చెరువును పరిశీలించి ఆక్రమణల దారులపై చర్యలు తీసుకుని చెరువుకు సంబంధించిన భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ చెరువు కింద 400 ఎకరాల ఆయకట్టు ఉందని, తలకోన సప్లయ్ ఛానల్ నుంచి నీటిని చెరువుకు మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఎమ్మెల్సీలు గాలి ముద్దుకృష్ణమనాయుడు, గౌనివారి శ్రీనివాసులు, నీటిపారుదల అధికారులు ఉన్నారు.