గ్రామాలు.. మురికి కూపాలు
చిన్న ముల్కనూరు గ్రామజ్యోతిలో సీఎం కేసీఆర్
* ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు సమాన బాధ్యులు
* ఇకనైనా వైరుధ్యాలు, తగాదాలను వదిలి ముందుకు సాగాలి
* మంత్రులు, అధికారులు ‘గ్రామజ్యోతి’ ఆరకుండా చూడాలి
* గ్రామల్లో మార్పునకే ఎర్రవెల్లి, చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నా
* రెండేళ్లలో ముల్కనూరును ఆదర్శ గ్రామంగా చేస్తా
* రోజంతా గ్రామంలోనే గడిపి ఊరువాడా కలియ తిరిగిన ముఖ్యమంత్రి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు.
ఈ పరిస్థితికి ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులంతా సమాన బాధ్యులేనన్నారు. ఇకపై వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో తాను దత్తత తీసుకున్న చిన్న ముల్కనూరు గ్రామానికి సీఎం వచ్చారు. ఉదయం 11 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8 గంటల వరకు అక్కడే గడిపారు.
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, కలెక్టర్ నీతూ ప్రసాద్ సహా నాయకులు, అధికార యంత్రాంగంతో కలిసి వాడవాడలా తిరిగారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి చెందిన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామాభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
మధ్యాహ్నం గ్రామస్తులందరితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సాయంత్రం గ్రామజ్యోతి కార్యక్రమం నిర్వహించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘గత 70 ఏళ్లుగా గ్రామాలన్నీ మురికి కూపాలుగా మారాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రి సహా ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ అధికారులంతా ఇందుకు సమాన బాధ్యులే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సమగ్రాభివృద్ధికి గ్రామసభల్లో ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కార్యాచరణ చేపట్టాలి.
ఈ విషయంలో వైరుధ్యాలు, తగాదాలు, పిచ్చి ఆలోచనలను వదిలేసి కలిసికట్టుగా ముందుకు సాగాలి’’ అని సూచిం చారు. గ్రామాల్లో మార్పు చూపించాలనే ఉద్దేశంతోనే తాను చిన్న ముల్కనూర్, ఎర్రవెల్లి గ్రామాలను దత్తత తీసుకున్నానని చెప్పారు. రాష్ర్టంలోని గ్రామాలన్నీ మనవేనని, ఆయా గ్రామాల్లో ‘గ్రామజ్యోతి’ ఆరిపోకుండా కొనసాగించాల్సిన బాధ్యత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులదేనని స్పష్టం చేశారు. ముఠా తగాదాలు, పెత్తనం పంచాయతీలను బంద్ చేసి గ్రామజ్యోతిని నిరంతరం వెలిగేలా చూడాలని చెప్పారు.
రెండేళ్లలో ఆదర్శ గ్రామం చేస్తా
రెండేళ్లలో చిన్న ముల్కనూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని, ప్రపం చ దేశాలన్నీ చిన్న ముల్కనూరును సందర్శిం చేలా చేస్తానని సీఎం చెప్పారు. ‘‘వరంగల్ జిల్లాలో గంగదేవిపల్లె ఆదర్శ గ్రామం కావడానికి అక్కడి ప్రజలు 22 ఏళ్లు కష్టపడ్డారు. 77 దేశాల ప్రతినిధులు గంగదేవిపల్లెను సందర్శించారు. ఆనాడు గంగదేవిపల్లెకు ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం లేదు. కానీ చిన్న ముల్కనూరుకు నాతో సహా మంత్రులు, కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా ఉంది. ఎంత డబ్బు అయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పనులూ రెండేళ్లలోనే పూర్తి కావాలి. రాబోయే రెండేళ్లలోనే ముల్కనూరు మారాలి. గంగదేవిపల్లె మాదిరిగా ప్రపంచ దేశాలన్నీ చిన్న మూల్కనూరు సందర్శించాలె’’ అని అన్నారు.
తిడితే రూ.50 జరిమానా వేయండి
చిన్న ముల్కనూర్ ప్రజలు తిట్లు బంద్ చేసి ప్రేమాభిమానాలతో కలిసి మెలసి ఉం డాలని సీఎం కోరా రు. ఇకపై ఎవరైనా తిడితే రూ.50 జరిమానా వేయాలన్నారు. గ్రామంలో ఏ ఆధారం లేని వారిని అందరూ ఆదుకోవాలని సూచిం చారు. ఇందుకు తన వద్ద బృహత్తర ప్రణాళిక ఉందన్నారు. ఊరి ప్రజలను త్వరలోనే అంకాపూర్‌కు తీసుకె ళ్లాలని కలెక్టర్ నీతూప్రసాద్‌ను ఆదేశించారు.
ఇళ్లు లేని వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తానని, జాగా లేని వారికి ప్రభుత్వమే స్థలం కొని ఇళ్లు కట్టిస్తుందని హామీ ఇచ్చారు. ఇందుకు స్థలం అమ్మడానికి ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, మళ్లీ 10, 15 రోజుల్లో చిన్న ముల్కనూర్ వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానన్నారు. యుద్ధప్రాతిపదికన ఇళ్ల నిర్మాణం చేపట్టి ఐదు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాభివృద్ధికి పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగులు, పలువురు దాతలు ముందుకొచ్చారు. గ్రామానికి చెందిన 40 మంది ప్రభుత్వ ఉద్యోగులు రూ.2 లక్షల విరాళం సీఎం సమక్షంలో కలెక్టర్‌కు అందజేశారు. మరికొందరు తమ ఇళ్ల స్థలాలను ప్రభుత్వానికి అప్పగించారు. అందరం కలిసి జిద్దుతో పనిచేస్తే ఐదారు నెలల్లో చిన్న ముల్కనూరును స్వర్గసీమను చేయవచ్చని సీఎం పేర్కొన్నారు.
33 ఏళ్లుగా మద్యం అమ్మకాల్లేవ్
గంగదేవిపల్లె మాజీ సర్పంచ్ రాజమౌళిని ముఖ్యమంత్రి కే సీఆర్ సోమవారం చిన్న ముల్కనూర్‌కు తీసుకొచ్చారు. గంగదేవిపల్లెను గ్రామస్తులంతా కలిసి ఎట్లా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారనే అంశంపై రాజమౌళితో మాట్లాడించారు. రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘1982 నుండి ఇప్పటి వరకు గంగదేవిపల్లెలో మద్యం తయారీ, అమ్మకాల్లేకుండా చేశాం. తొలుత మద్యం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించాం. వారందరినీ ఒప్పించి మద్యం వద్దు అనేలా చేశాం.
1991లో తాగునీటి కొరత ఏర్పడితే బాలవికాస సంస్థ సహకారంతో ట్యాంక్ నిర్మించి ఇంటింటికీ నీళ్లు అందించాం. నాటి నుంచి నేటి వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నీటిని సరఫరా చేస్తున్నాం. 2000 సంవత్సరం నాటికే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించాం. 3 నెలల్లోనే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ వాటిని గ్రామస్తులు వినియోగించేలా చేయడానికి మాత్రం మూడేళ్లు పట్టింది. 2007లో గంగదేవిపల్లెకు రాష్ట్రపతి అవార్డు లభించింది’’ అని వివరించారు.
కరీంనగర్‌లోనే రాత్రి బస
చిన్న ముల్కనూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న సీఎం రాత్రి 8 గంటలకు కరీంనగర్ చేరుకున్నారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్లో మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ముచ్చటించారు. రాత్రి ఉత్తర తెలంగాణ భవన్‌లోనే బస చేశారు.