అక్రమ మద్యంపై గట్టి నిఘా
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : జిల్లాలో అక్రమ మద్యంపై గట్టి ని ఘా వేస్తున్నామని ఎన్నికల ప్రవర్తనా నియమావళి జిల్లా నోడల్ అధికారి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) సయ్యద్ యాసిన్ ఖురేషి తెలిపారు. శుక్రవారం ఆ యన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి రాకుండా కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జహీరాబాద్ శివారులోని చిరాగ్పల్లి చెక్‌పోస్టును మరింత బలోపేతం చేశామని వెల్లడించారు.
ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, 12 మంది కానిస్టేబుళ్లను ఈ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దీనితో పాటు ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లతో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, స్టాటిక్స్ సర్వేయల్ టీం బృందాలు నారాయణఖేడ్‌లో నాలుగు, జహీరాబాద్‌లో నాలుగు పనిచేస్తున్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో నాలుగు ఇంటెలిజెన్స్ బృందాలున్నాయని, ఎక్సైజ్‌కు సంబంధించి నేర సమాచారాలను ఈ బృందాలు సేకరిస్తారని చెప్పారు. అలాగే జిల్లాలో ఇటీవల కొత్తగా 136 మంది కొత్తగా ఎక్సైజ్ కానిస్టేబుళ్లను నియమించామని, వీరందరినీ ఎన్నికల విధుల్లోకి తీసుకుంటామన్నారు. కాగా జిల్లాలోని మద్యం దుకాణదారులు ఎంఆర్ పీ ధరలకే మద్యం విక్రయించాలని సూచించారు. బెల్ట్ షాప్‌లకు మద్యం సరఫరా చేస్తే బెల్టుషాప్‌తో పాటు సరఫరా చేసిన మద్యం దుకాణ ంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంగారెడ్డి, మెదక్‌లో కంట్రోల్ రూమ్‌లు
అక్రమ మద్యం నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇందుకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తమకు ఫోన్ చేయాలని ఖురేషి కోరారు. ఈ మేరకు సంగారెడ్డి (08455 - 276384), మెదక్ (08452 - 220301)లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అన్నారు.
మిథనాల్‌పై అప్రమత్తం
మిథనాల్ అనే రసాయనంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖురేషి సూచించారు. ఇది చూడటానికి సారాయి లాగే ఉంటుందని, దీన్ని పరిశ్రమల్లో ఉపయోగిస్తారని చెప్పారు. కొందరు పరిశ్రమలకు ఈ రసాయనాన్ని తరలిస్తూ అమ్ముకుంటున్నారని, దీన్ని సేవిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరులో మిథనాల్ తాగి ఐదుగురు మృత్యువాత పడగా మరో ఐదుగురికి తీవ్ర అస్వస్థతకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. నర్సాపూర్, అందోల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, జిన్నారం తదితర ప్రాంతాల్లో క్లోరల్ హైడ్రేట్ (సీహెచ్), డైజోఫాం, రా అడల్టరేషన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.