cholasamudram
-
పాము కాటుతో రైతు మృతి
కూడేరు: మండల పరిధిలోని చోళసముద్రంలో శనివారం ఉదయం కాకర్ల వెంకటనాయుడు(55) అనే రైతు పాము కాటుకు గురై మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్ దస్తగిరి అందించిన వివరాలు మేరకు.. వెంకటనాయుడు మంజునాథ్ అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో కళింగర పంట సాగు చేశాడు. పంట కాలం పూర్తవడంతో కళింగర తీగలు తొలగించేందుకు సిద్ధపడ్డాడు. తీగలతో పాటు పాము కూడా చేతికి రావడంతో పామును విసిరే ప్రయత్నం చేయగా కాటు వేసింది. వెంటనే రైతు ద్విచక్రవాహనంలో ఇంటికి వచ్చి కుమారుడికి విషయం తెలిపి అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి ఇద్దరు వెళ్లారు. అక్కడ చికిత్స పొందిన గంటలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
లేపాక్షి : మండలంలోని చోళసముద్రం సమీపంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందింది. గురువారం ఉదయమే అటుగా వెళ్తున్న వారు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. హిందూపురం సెక్షన్ రేంజ్ ఆఫీసర్ మదన్మోహన్ వెంటనే అక్కడికి చేరుకుని జింక కళేబరాన్ని లేపాక్షి పశువైద్య కేంద్రానికి తీసుకువచ్చారు. పశువైద్యాధికారిణి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో జింక కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించారు. -
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి
కూడేరు : మండలంలోని చోళసముద్రంలో సూర్యనారాయణ(50) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... లక్ష్మీదేవి, నాగరాజు, నాగలక్ష్మీ కొళాయికి మోటర్ వేసి నీరు పట్టుకుంటున్నారు. మోటర్ వేస్తే తమ కొళాయికి నీరు తక్కువగా వస్తాయని సూర్యనారాయణ, అతని భార్య అలివేలమ్మ వాదనకు దిగారు. దీంతో రెండు వర్గాలు గొడవపడుతూ.. తోసుకున్నారు. ఘటనలో సూర్యనారాయణ కిందపడి పోయాడు. రెండు వర్గాలు పోలీసు స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. సూర్యనారాయణను కూడేరులోని ఆస్పత్రికి తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని అనంతపురం పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధితుడిని అక్కడికి తీసుకుపోగా మృతి చెందాడు. తన తండ్రిని ప్రత్యర్థులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ మృతుని కుమారుడు శివ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని íఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.