Chris Gayles
-
నా సెంచరీ ఆమెకు అంకితం: గేల్
మొహాలి : క్రిస్ గేల్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్- 2018 లో మొదటి సెంచరీని గేల్ సాధించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో గేల్ విధ్వంసం సృష్టించాడు. గేల్ 1 ఫోర్, 11 సిక్స్‌లతో 63బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో సెంచరీ అనంతరం తనదైన రీతిలో గేల్ బ్యాట్‌తో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ రోజు(శుక్రవారం) గేల్ కుమార్తె క్రిసాలినా పుట్టిన రోజు. నిన్న మ్యాచ్‌లో సాధించిన సెంచరీని గేల్ తన కుమార్తె క్రిసాలినాకు పుటినరోజు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గేల్‌ను వరించింది. అనంతరం క్రిస్ గేల్ మాట్లాడుతూ.. ‘నా సెంచరీని నా కుమార్తె క్రిసాలినాకు అంకితం ఇస్తున్నాను. శుక్రవారం(ఏఫ్రిల్ 20న) మా రెండో పాట పుట్టినరోజును జరుపుకుంటోంది. క్రిసాలినా ఇండియాకు రావడం రెండోసారి. పంజాబ్ టీమ్ హోమ్‌గ్రౌండ్‌లో సెంచరీ సాధించడం చాలా సంతోషంగా ఉంద’ని గేల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ 15 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన విషయం విదితమే. టి20లో గేల్ మొత్తం 21 సెంచరీలు చేశాడు. ఆ తర్వాత మెకల్లమ్, క్రింగర్, ల్యూక్ రైట్ 7 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల రికార్డుని (6 సెంచరీలు) తన పేర లిఖించుకున్నాడు ఈ విండీస్ వీరుడు. -
మహిళా ప్రజెంటర్‌తో క్రిస్ గేల్ అసభ్య ప్రవర్తన!
మెల్బోర్న్: వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ మైదానంలో మెరుపుషాట్లతో హోరెత్తించడమే కాదు మైదానం బయట విచిత్ర ప్రవర్తనతో వివాదాలు సృష్టించడంలోనూ దిట్టనే. తాజాగా ఆయన ఓ మహిళా క్రికెట్ ప్రజెంటర్‌తో అసభ్యంగా వ్యవహరించడం వివాదం సృష్టించింది. లైవ్ ప్రసారంలో బాహాటంగా ప్రజెంటర్కు క్రిస్ గేల్ 'డేటింగ్ ఆఫర్' ఇవ్వడం విమర్శలకు కారణమైంది. బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా హోబార్ట్ హరికేన్స్-మెల్బోర్న్ రెనగేడ్స్ మ్యాచ్‌లో క్రిస్ గేల్ 15 బంతుల్లో 41 పరుగులు చేశాడు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహించి మెల్బోర్న్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం టెన్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మెలానీ మెక్‌లాఫిలిన్ ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. గేల్ ఇన్నింగ్స్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగింది. గేల్ స్పందిస్తూ 'నువ్వు చేసే ఈ ఇంటర్వ్యూ కోసమే నేను చాలా బాగా బ్యాటింగ్ చేశాను' అని పేర్కొన్నాడు. 'నీ కళ్లు చాలా అందంగా ఉన్నాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత మనం కలిసి డ్రింక్స్‌కి వెళ్తామని ఆశిస్తున్నా. మరీ సిగ్గుతో పొంగిపోకు బేబి' అని అన్నాడు. గేల్ వ్యాఖ్యలతో ప్రజెంటర్ చాలా ఇబ్బందిపడుతున్నట్టు కనిపించింది. 'నేనేమీ సిగ్గుపడటం లేదు' అని ఆమె సమాధానమిచ్చింది. గేల్ వ్యాఖ్యలను బిగ్ బాష్ లీగ్ ఆర్గనైజేషన్ తప్పబట్టింది. అవి అవమానకర వ్యాఖ్యలని పేర్కొంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాపఫ్ కూడా గేల్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.