సాంస్కృతిక తెలంగాణే లక్ష్యం
తెలంగాణ రచయితల సంఘం సభలో వక్తల పిలుపు
హైదరాబాద్: సంపూర్ణ సాంస్కృతిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో తెలంగాణ రచయితల సంఘం ఏర్పడిందని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ రచయితల సంఘం ప్రారంభ సభ ఆదివారం (జీవగడ్డ విజయ్‌కుమార్ హాల్) ఎస్.సి.ఈ.ఆర్.టీ.లో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడినంత మాత్రాన సరిపోదని, నేడు సంపూర్ణ సాంసృ్కతిక తెలంగాణ నిర్మాణం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అందుకు కవులు, రచయితలు, కళాకారులను ఏకతాటి మీద నడిపించేందుకే తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు అవసరమొచ్చిందని తెలిపారు. పల్లె నాలుకల మీద మూలకు పడివున్న జాతీయాలను, సామెతలను సేకరించి కొత్త సోయగాలను అద్ది, తెలంగాణ భాషను సుసంపన్నం చేసుకోవడం నేటి కవుల కర్తవ్యమని అన్నారు. సభను ప్రముఖ ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య తన పాట ద్వారా ప్రారంభించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఏ ప్రాంతంలో లేని కవులు, కళాకారులు, రచయితలు మన ప్రాంతంలో ఉన్నారని, దీనికి కారణం ఇక్కడ జరిగిన అనేక ప్రజా ఉద్యమాలే అని అన్నారు. ఇక్కడ ఉన్న సాహితీ సంపద మరెక్కడా లేదన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వలసవాద దోపిడీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వచన కవిత్వం, పాటేనని తెలిపారు. ఈ సభలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, వి.శంకర్ ప్రసంగించారు.
సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి
తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా నందిని సిధారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వి. శంకర్, కోశాధికారిగా దాస్యం సేనాధిపతితో పాటు ఐదుగురిని సహాయ కార్యదర్శులుగా, ఐదుగురిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. కార్యనిర్వాహక కార్యదర్శులుగా నలుగురితో పాటు ముఖ్య సలహాదారులు దేశపతి శ్రీనివాస్, వేణుగోపాలస్వామి, ఏ.శ్రీధర్‌లు ఎన్నికైనట్లు సిధారెడ్డి ప్రకటించారు.