cigarette smuggling
-
స్మగుల్డ్ సిగరెట్ల విక్రయానికి చెక్!
సాక్షి, సిటీబ్యూరో: బంగారం.. ఎలక్ట్రానిక్ వస్తువులు.. మాదకద్రవ్యాలు.. ఇవి మాత్రమే కాదు సిగరెట్లు సైతం పెద్ద ఎత్తున సిటీకి అక్రమ రవాణా అవుతున్నాయి. ఇలా జరుగుతున్న స్మగ్లింగ్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు చెబుతున్నారు. నగరానికి అక్రమంగా వచ్చి చేరిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న వ్యక్తితో పాటు అతడికి సరఫరా చేస్తున్న నిందితుడినీ మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇతడి నుంచి రూ.90 వేల విలువైన వివిధ బ్రాండ్లకు చెందిన విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని మంగళవారం టాస్క్‌ఫోర్స్ డీసీపీ పి.రాధాకిషన్‌రావు వెల్లడించారు. కోల్‌కతా మీదుగా.. హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ప్యారిస్, విన్, ఎస్సీ, మోండ్, మల్‌బొరొ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు చెబుతున్నారు. ఇవి తయారవుతోంది చైనా, బంగ్లాదేశ్‌ల్లో అయినప్పటికీ అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. కోల్‌కతా మీదుగానే సిటీకి వస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ సహా వివిధ విభాగాల కళ్లుగప్పేందుకు అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోందని వివరిస్తున్నారు. ఇలా నగరానికి వచ్చిన సిగరెట్లను గోషామహల్‌కు చెందిన మిలన్‌కుమార్ జైన్ అనే వ్యక్తి తన వద్ద స్టాక్ చేసుకుని హోల్‌సేల్‌గా రిటైలర్లకు విక్రయిస్తున్నాడు. యూసుఫియాన్ దర్గా ప్రాంతంలో షరీఫ్ ఆలం జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్న అహ్మద్ ఆలం ఖాన్ ఇతడి వద్ద ఆ సిగరెట్ల ఖరీదు చేస్తున్నాడు. ఆపై వీటిని పొగరాయుళ్లకు విక్రయిస్తున్నాడు. దీనిపై సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ జావేద్ నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్ తమ బృందాలతో దాడి చేశారు. మిలన్‌కుమార్, ఆలం ఖాన్‌లను అదుపులోకి తీసుకుని రూ.90 వేల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను హబీబ్‌నగర్ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతోందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా పన్ను రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్ము రాకపోవడంతో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆరోగ్యానికి హానికరం.. చైనా, బంగ్లాదేశ్, ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతి అయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్ హెల్త్ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి భారీగా హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు వివరిస్తున్నారు. -
సిగరెట్ల అసలు రేటెంతో తెలుసా..?
సాక్షి, సిటీబ్యూరో: పొగరాయుళ్ల నుంచి మంచి డిమాండ్ ఉండటంతో నగరానికి సిగరెట్ల అక్రమ రవాణా ఆగట్లేదు. ఓ పక్క ఖరీదైన వాటిని ఇండోనేషియా, దుబాయ్ తదితర దేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తుండగా... తక్కువ ధరకు లభించే వాటిని బంగ్లాదేశ్ నుంచి ‘దిగుమతి’ చేసుకుంటున్నారు. ఈ దందాపై కన్నేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి బేగంబజార్‌లోని ఓ దుకాణం దాడి చేశారు. అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్న అధికారులు రూ.6.48 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం పేర్కొన్నారు. నితిన్ రంకా, విపుల్ రంక అనే సోదరులు ఫీల్ ఖానాలోని సిద్ధి అంబర్‌బజార్ మసీదు ప్రాంతంలో ఉంటూ బేగంబజార్‌లో డి రాజేష్ అండ్ కో పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరు చేసే వ్యాపారం టైలరింగ్ మెటీరియల్, గృహోపకరణాలు విక్రయించడం. అయితే అక్రమంగా నగరానికి రవాణా అవుతున్న ప్యారిస్ బ్రాండ్‌ను పోలిన నకిలీ సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తే మంచి లాభాలు ఉంటాయని భావించారు. దీంతో కోల్‌కతాకు చెందిన కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న సిగరెట్లు అక్కడి స్మగ్లర్ల నుంచి ఒక్కో ప్యాకెట్ రూ.6కు ఖరీదు చేస్తున్న వీరు రైలు పార్శిల్లో సరుకు తెప్పించి తమ దుకాణంలో నిల్వ చేస్తున్నారు. ఆపై హోల్‌సేల్‌గా ప్యాకెట్ రూ.20 చొప్పున అమ్ముతుండగా... దుకాణదారులు వినియోగదారులకు రూ.30కి విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో బేగంబజార్‌లోని డి రాకేష్ అండ్ కో దుకాణంపై దాడి చేశారు. నితిన్, విపుల్‌లను అదుపులోకి తీసుకుని రూ.6.48 లక్షల విలువైన అక్రమ ప్యారిస్ సిగరెట్ల స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో ఆ ప్యాకెట్లపై ‘హెచ్చరిక బొమ్మ’ లేకపోవడాన్ని గుర్తించారు. విచారణలో ఆ సిగరెట్లు ప్యారిస్ పేరుతో తయారవుతున్న నకిలీవిగా తేలింది. బంగ్లాదేశ్‌లో తయారవుతున్న ఈ సిగరెట్లు రైల్వే కార్గొ ద్వారా, వివిధ పేర్లతో భారత్‌లోకి వస్తున్నాయి. ఆపై ఢిల్లీ, లక్నో, కోల్‌కతాల్లో ఉన్న సూత్రధారుల నుంచి రైల్వే కార్గొ రూపంలోనే హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో వీరు ఏ దశలోనూ బిల్లులు రూపొందించట్లేదు. ఫలితంగా ప్రభుత్వానికి భారీగా పన్ను నష్టం కూడా వస్తోంది. మరోపక్క ఈ నాసిరకం సిగరెట్లను కాలుస్తున్న వారు సైతం తీవ్రమైన ఆనారోగ్యాల బారినపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందతులను సరుకుతో సహా బేగంబజార్ పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ టీమ్ ఈ సిగరెట్ల స్మగ్లింగ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడంపై దృష్టి పెట్టింది. నగరంలో ఇలాంటి దందాలు చేసే గ్యాంగ్స్ మరికొన్ని ఉన్నట్లు అనుమానిస్తున్నామన్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ వారికీ చెక్ చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
ఇండోనేషియా టు..హైదరాబాద్ వయా దుబాయ్
సాక్షి, సిటీబ్యూరో: బంగారం, ఎలక్ట్రానిక్ వస్తువులు, మాదకద్రవ్యాలు మాత్రమే కాదు... సిగరెట్లు కూడా భారీ స్థాయిలోనే నగరానికి అక్రమంగా రవాణా అవుతున్నాయి. నగరానికి చెందిన కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా పని చేస్తూ ఈ దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు గత వారం ఏకంగా రూ.6.5 కోట్ల విలువైన సిగరెట్లను ధ్వంసం చేశారు. ఇవన్నీ విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నవే.ఏటా రూ.వందల కోట్ల విలువైన సిగరెట్లను అక్రమంగా రవాణా చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నాయి. ఇటు కస్టమ్స్, అటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు వరుస దాడులు చేస్తూ ఈ అక్రమ రవాణా గుట్టురట్టు చేస్తున్నాయి. గడిచిన మూడేళ్లల్లో (2015–18 మధ్య ఆర్థిక సంవత్సరాల్లో) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న సిగరెట్ల సంఖ్య 52.94 లక్షలు కావడం గమనార్హం. ఇండోనేషియా నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో రెండు బ్రాండ్లే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డజరమ్ బ్లాక్, గుడాన్ గరమ్ బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో బెల్సన్ అండ్ హెడ్జెస్ వంటివీ అక్రమ రవాణా అవుతున్నట్లు పేర్కొంటున్నారు. మొదటి రెండు రకాలు ఇండోనేషియాలో తయారవుతున్నాయి. అవి అక్కడి నుంచి దుబాయ్ మీదుగానే సిటీకి వస్తున్నాయి. అధికారుల కళ్లు గప్పేందుకు ఈ అక్రమ రవాణా సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువులంటూ జరుగుతోంది. ఈ ముఠాలు గతంలో సిగరెట్లను సముద్ర మార్గంలో కంటైనర్ల ద్వారా తీసుకువచ్చేవి. పిల్లలకు వినియోగించే డైపర్లుగా పేర్కొంటూ కంటైనర్ ముందు వరుస ల్లో వాటినే పెట్టి, వెనుక సిగరెట్లను నింపి తీసుకువచేవారు. మూసాపేటలోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు (ఐసీడీ) ఇవి చేరుకున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై పంథా మార్చిన అదే గ్యాంగ్‌లు ఇంజినీరింగ్ వస్తువులు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పేరుతో విమాన మార్గంలో తీసుకువచ్చాయి. ఇప్పటికీ ఈ పంథా కొనసాగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని చేకూర్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికి ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీనే రూ.15 ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు డీఆర్ఐ దర్యాప్తులో తేలింది. సిటీలోని హోల్‌సేలర్లతో సంబంధాలు పెట్టుకున్న ఈ గ్యాంగ్ వారి ద్వారా మార్కెట్లోకి సరఫరా చేస్తున్నారు. సిగరెట్ల స్మగ్లింగ్‌లో ఒక్కోసారి ఒక్కో పంథాను అనుసరిస్తున్న ఈ ముఠా వ్యవహారాన్ని గుర్తించడానికి అధికారులకు కొంత సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారీ భారీగా సిగరెట్లు మార్కెట్లోకి వెళ్లిపోయిన తరవాతే గుర్తించగలుగుతున్నారు. అన్ని పత్రాలు సృష్టించేస్తున్నారు... విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులను ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో, ఎయిర్ కార్గో కార్యాలయాల నుంచి తీసుకోవడానికి అనేక క్లియరెన్స్‌లు అవసరం. కస్టమ్స్ డ్యూటీ నుంచి వివిధ రకాలైన నిరభ్యంతర పత్రాలు దాఖలు చేస్తేనే గూడ్స్ బయటకు వస్తాయి. ఈ నేపథ్యంలోనే సిగరెట్ల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు కస్టమ్స్ తరఫున పని చేసే కస్టమ్స్ హోమ్ ఏజెంట్లు (సీహెచ్ఏ)లతో పాటు అనేక మందితో జట్టు కడుతున్నాయి. బోగస్ కంపెనీల పేర్లతో లెటర్ హెడ్స్ నుంచి కస్టమ్స్ క్లియరెన్స్ పత్రాల వరకు అన్నీ బోగస్‌వి సృష్టించేస్తున్నారు. వీటిని చూపిస్తూనే సరుకును బయటికి తీసుకువస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ఏటా రూ.వందల కోట్ల అక్రమ వ్యాపారం సాగుతున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంపై దృష్టి పెట్టారు. ఈ రకంగా అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణ ంగా ప్రజల ఆరోగ్యానికీ హానికరమన్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ ప్యాక్‌ల మీద ‘హానికరం బొమ్మలు’ కూడా ఉండట్లేదు. అక్కడి పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమన్నారు. -
సిగరెట్లు నాలుగు రెట్లు ...
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్‌కు సిగరెట్లు అక్రమ రవాణ నాలుగు రెట్లు పెరిగిందంట. అది కూడా కేవలం 2012 -2014 మధ్య కాలంలో అని ద డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ ( డీఆర్ఐ) వెల్లడించింది. అందుకు సంబంధించిన తాజా లెక్కల జాబితాను శనివారం ఇక్కడ విడుదల చేసింది. సిగరెట్ల అక్రమ రవాణా కారణంగా 2014-15 మధ్య కాలంలో భారత్‌కు రూ. 2,363 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. కొరియా, ఇండోనేషియా, మలేసియా, సింగపూర్, చైనా, యూనైటెడ్ అరబ్ ఏమిరేట్స్ దేశాల నుంచి భారత్‌కు సిగరేట్లు అక్రమ రవాణ వెల్లువెత్తిందని చెప్పింది. ఈ అక్రమ రవాణాకు న్యూఢిల్లీ, సింగపూర్, దుబాయి నగరాలు ట్రాన్సిట్ పాయింట్లుగా ఉన్నాయిని తెలిపింది. దక్షిణాసియా ప్రాంతంలో చాలా దేశాల మధ్య సరిహద్దుల్లో ఎంత చిన్న అవకాశం దొరికిన పొగాకు ఉత్పత్తుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు సద్వినియోగం చేసుకుంటున్నారని డబ్ల్యూహెచ్‌వో దిక్షిణాసియా ప్రాంతీయ సంచాలకులు పూనమ్ క్షేత్రపాల్ సింగ్ వెల్లడించారు. స్మగ్లింగ్‌ని అరికట్టేందుకు ఈ దేశాల మధ్య చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవశ్యకతను సింగ్ ఈ సందర్భంగా తెలిపారు. అక్రమ పొగాకు వ్యాపారం గ్లొబల్ ప్రాబ్లమ్ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భాను ప్రతాప్ శర్మ పేర్కొన్నారు. సిగరెట్లు అక్రమ రవాణాపై డబ్ల్యూహెచ్‌వో తాజాగా రూపొందించిన నివేదిక ఆధారంగా డీఆర్ఐ తెలిపింది.