సాక్షి, సిటీబ్యూరో: పొగరాయుళ్ల నుంచి మంచి డిమాండ్ ఉండటంతో నగరానికి సిగరెట్ల అక్రమ రవాణా ఆగట్లేదు. ఓ పక్క ఖరీదైన వాటిని ఇండోనేషియా, దుబాయ్ తదితర దేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తుండగా... తక్కువ ధరకు లభించే వాటిని బంగ్లాదేశ్ నుంచి ‘దిగుమతి’ చేసుకుంటున్నారు. ఈ దందాపై కన్నేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం రాత్రి బేగంబజార్‌లోని ఓ దుకాణం దాడి చేశారు. అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్న అధికారులు రూ.6.48 లక్షల విలువైన అక్రమ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు గురువారం పేర్కొన్నారు. నితిన్ రంకా, విపుల్ రంక అనే సోదరులు ఫీల్ ఖానాలోని సిద్ధి అంబర్‌బజార్ మసీదు ప్రాంతంలో ఉంటూ బేగంబజార్‌లో డి రాజేష్ అండ్ కో పేరుతో దుకాణం నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరు చేసే వ్యాపారం టైలరింగ్ మెటీరియల్, గృహోపకరణాలు విక్రయించడం. అయితే అక్రమంగా నగరానికి రవాణా అవుతున్న ప్యారిస్ బ్రాండ్‌ను పోలిన నకిలీ సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తే మంచి లాభాలు ఉంటాయని భావించారు. దీంతో కోల్‌కతాకు చెందిన కొందరితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు, స్వాధీనం చేసుకున్న సిగరెట్లు
అక్కడి స్మగ్లర్ల నుంచి ఒక్కో ప్యాకెట్ రూ.6కు ఖరీదు చేస్తున్న వీరు రైలు పార్శిల్‌లో సరుకు తెప్పించి తమ దుకాణంలో నిల్వ చేస్తున్నారు. ఆపై హోల్‌సేల్‌గా ప్యాకెట్ రూ.20 చొప్పున అమ్ముతుండగా... దుకాణదారులు వినియోగదారులకు రూ.30కి విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులు తమ బృందంతో బేగంబజార్‌లోని డి రాకేష్ అండ్ కో దుకాణంపై దాడి చేశారు. నితిన్, విపుల్‌లను అదుపులోకి తీసుకుని రూ.6.48 లక్షల విలువైన అక్రమ ప్యారిస్ సిగరెట్ల స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో ఆ ప్యాకెట్లపై ‘హెచ్చరిక బొమ్మ’ లేకపోవడాన్ని గుర్తించారు.
విచారణలో ఆ సిగరెట్లు ప్యారిస్ పేరుతో తయారవుతున్న నకిలీవిగా తేలింది. బంగ్లాదేశ్‌లో తయారవుతున్న ఈ సిగరెట్లు రైల్వే కార్గొ ద్వారా, వివిధ పేర్లతో భారత్‌లోకి వస్తున్నాయి. ఆపై ఢిల్లీ, లక్నో, కోల్‌కతాల్లో ఉన్న సూత్రధారుల నుంచి రైల్వే కార్గొ రూపంలోనే హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడైంది. ఈ మొత్తం వ్యవహారంలో వీరు ఏ దశలోనూ బిల్లులు రూపొందించట్లేదు. ఫలితంగా ప్రభుత్వానికి భారీగా పన్ను నష్టం కూడా వస్తోంది. మరోపక్క ఈ నాసిరకం సిగరెట్లను కాలుస్తున్న వారు సైతం తీవ్రమైన ఆనారోగ్యాల బారినపడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందతులను సరుకుతో సహా బేగంబజార్ పోలీసులకు అప్పగించిన టాస్క్‌ఫోర్స్ టీమ్ ఈ సిగరెట్ల స్మగ్లింగ్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకోవడంపై దృష్టి పెట్టింది. నగరంలో ఇలాంటి దందాలు చేసే గ్యాంగ్స్ మరికొన్ని ఉన్నట్లు అనుమానిస్తున్నామన్న టాస్క్‌ఫోర్స్ డీసీపీ వారికీ చెక్ చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment