సిప్లా చేతికి... హెటిరో యూఎస్ వ్యాపారం?
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. ఏపీఐ, ఫినిష్డ్ డోసేజెస్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ హెటిరోకు చెందిన అమెరికా వ్యాపారాన్ని ఫార్మా సంస్థ సిప్లా కొనుగోలు చేస్తోందని సమాచారం. వార్తా సంస్థ సీఎన్‌బీసీ-టీవీ18 కథనం ప్రకారం హెటిరో యూఎస్ వ్యాపారం కాంబర్ ఫార్మాస్యూటికల్స్ పేరుతో జరుగుతోంది. యూఎస్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న జనరిక్ కంపెనీల్లో ఇది ఒకటి. ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఓరల్ సొల్యూషన్స్‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీని రూ.3,250-3,575 కోట్లు వెచ్చించి సిప్లా దక్కించుకుంటోంది. డీల్‌లో భాగంగా కాంబర్కు చెందిన తయారీ యూనిట్లు కూడా సిప్లా పరం కాబోతున్నాయి. కాంబర్ ఫార్మాస్యూటికల్స్ ద్వారా హెటిరోకు ఏటా రూ.1,625 కోట్ల ఆదాయం వస్తోంది.