కార్పొరేట్ కనుసన్నల్లో ప్రభుత్వాలు
- సీఐటీయూ ఆవిర్భావ సభలో గఫూర్
సాక్షి, విజయవాడ బ్యూరో: కార్పొరేట్ సంస్థల కనుసన్నల్లో పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోకపోతే సంఘటితంగా తిప్పికొడతామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ హెచ్చరించారు. విజయవాడలోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాకాన్ని ఆవిష్కరించిన గఫూర్ మాట్లాడారు. ఐక్యత-పోరాటం నినాదంతో 1970లో ఏర్పడిన సీఐటీయూ 46 ఏళ్లుగా కార్మిక-కర్షక ఐక్యత కోసం కృషి చేస్తోందని వివరించారు. దేశంలోని కార్మిక వర్గాన్ని సంఘటితపరిచే ఐక్యపోరాటాల రథసారథిగా సీఐటీయూ ఉందని అభివర్ణించారు.
అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలుచేయకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. కార్మికవర్గ ప్రయోజనాల కోసం సంఘటిత పోరాటాలు కొనసాగిస్తామన్నారు. జూన్ 26, 27, 28 తేదీల్లో విజయవాడలో సీఐటీయూ 14వ రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహాసభల ప్రారంభం రోజైన జూన్ 26న భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి, కె.సుబ్బరావమ్మ, ఆర్.వి.నర్సింహారావు మాట్లాడారు.