ఆక్వా కార్మికులను ప్రభుత్వం గుర్తించాలి
భీమవరం: ఆక్వా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ అన్నిరకాల సంక్షేమ, కార్మిక చట్టాలను అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. భీమవరంలోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆక్వా కార్మికుల ఐక్య సదస్సులో ఆమె మాట్లాడుతూ రొయ్యలు, చేపలు ఆధారిత పరిశ్రమలు, వివిధ విభాగాల్లో 50 వేల మంది కార్మికులకుపైగా పనిచేస్తున్నారన్నారు. అయితే వీరిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం అమలులో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ వంటి చట్టాలను అమలు చేయడం లేదని, అతి శీతల ప్రదేశాల్లో పనిచేయడం వల్ల కార్మికులు తరచూ రోగాలబారిన పడుతున్నారని, అయినప్పటికీ యాజమాన్యాల నుంచి వారికి ఎటువంటి సాయం అందడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం, యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టినట్టు ఆమె తెలిపారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి బి.వాసుదేవరావు, ఆక్వా యూనియన్ ప్రధాన కార్యదర్శి బీవీ వర్మ, డివిజన్ అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్ తదితరులు పాల్గొన్నారు.