ఎంతో కష్టపడ్డా
తన మాదిరే కూతురు కూడా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా పనిచేసి పేరు తెచ్చుకోవాలని తండ్రి కోరుకున్నా, పత్రలేఖ మాత్రం సినిమాలపై దృష్టి పెట్టింది. హన్సల్ మెహతా తాజాగా తీస్తున్న సిటీ ఆఫ్ లైట్స్ ద్వారా ఈమె బాలీవుడ్లో అడుగుపెడుతోంది. బెంగాలీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఈ అందగత్తె సినిమాల్లో అవకాశం సంపాదించుకోవడానికి ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. ‘నేను సీఏ చదవాలని మా నాన్న కోరుకునేవారు. నేనేమో సినీ లోకాల్లో విహరించేదాన్ని. నా కలను సాకారం చేసుకోవడానికి నటనా శిక్షణ తరగతులకు వెళ్లేదాన్ని. వర్క్‌షాప్‌లలోనూ పాల్గొనేదాన్ని.
చాలా ఆడిషన్లకూ వెళ్లాను’ అని చెప్పిన పత్రలేఖ... షిల్లాంగ్‌లో పుట్టినా ముంబైలోనే డిగ్రీ పూర్తి చేసింది. ఇక సిటీ ఆఫ్ లైట్స్‌లో హీరో రాజ్‌కుమార్ రావుకు జోడీగా ఈమె కనిపిస్తోంది. వీళ్లిద్దరూ ఇందులో రాజస్థాన్ గ్రామీణ దంపతులుగా కనిపిస్తారు. బ్రిటిష్ సినిమా మెట్రో మనీలా ఆధారంగా దీనిని తీస్తున్నారు. ‘ఇది ఒక సామాన్యుడి గురించి వివరించే సినిమా. నేను అలాంటి దానినే. రాజస్థాన్ నాకు పూర్తిగా కొత్త కాబట్టి అక్కడి పరిస్థితులకు అలవాటుపడేందుకు చాలా కష్టపడ్డా. షూటింగ్ కోసం అక్కడ మూడు వారాలు ఉన్నాం. స్థానికులతో మాట్లాడి వాళ్ల పద్ధతులు, భాష, ఆహార అలవాట్ల గురించి తెలుసుకున్నాను.
రాజస్థానీ సంప్రదాయ ఆహారం దాల్ బటీ చుర్మా నాకు చాలా ఇష్టం’ అని ఈమె వివరించింది. మెట్రో నగరాల్లో గ్రామీణ ప్రాంతాల వలస ప్రజలు దోపిడీ గురికావడాన్ని హృద్యంగా వివరించే సిటీ లైట్స్ ఈ నెల 30న థియేటర్లకు రానుంది. ‘పొట్టకూటి కోసం వేలాదిమంది నగరాలకు వస్తున్నారు. ఇలాంటి వాళ్లకు మెట్రో నగరాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇది పూర్తిగా ఆధునిక భారత సినిమా’ అని పత్రలేఖ చెప్పింది. అన్నట్టు ఈ బ్యూటీ ‘డకేర్ షాజ్’ అనే బెంగాలీ సినిమాలోనూ అవకాశం సంపాదించుకుంది.