Civil exam
-
సివిల్ సర్వీసెస్ రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత!
అమెరికాలో తెలుగువారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్ధులకు ఉచితంగా మెటిరియల్ పంపిణీ చేసింది. నాట్స్ తాజా మాజీ అధ్యక్షులు బాపయ్య చౌదరి(బాపు)నూతి చొరవతో ఈ 50 వేల పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు లక్ష్మణరావు రూపొందించిన ఈ పుస్తకాలను గుంటూరులో నాట్స్ బోర్డ్ డైరెక్టర్ రాజేంద్ర మాదల ఆవిష్కరించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం పోటీ పడే పేద విద్యార్ధులకు సాయం చేయాలనే సంకల్పంతోనే నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టిందని రాజేంద్ర మాదల అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే పేద విద్యార్ధులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. పేద విద్యార్ధుల కోసం బాపు నూతి చూపిన చొరవ ప్రశంసనీయమని, నాట్స్ చేపడుతున్న సేవ కార్యక్రమాలు సమాజంలోని యువతలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయన్నారు.50 వేల పుస్తకాలను సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసే పేద విద్యార్ధులకు ఉచితంగా అందిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పేద విద్యార్ధుల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన బాపు నూతి, రాజేంద్ర మాదలకు నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.(చదవండి: తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం) -
సివిల్స్ ర్యాంకులపై సీఎం హర్షం
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. ఆలిండియా నంబర్ వన్ ర్యాంకు సాధించిన మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను సీఎం అభినందించారు. 9వ ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యా శర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా రాష్ట్ర విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను సంసిద్ధం చేయడానికి ప్రభుత్వపరంగా స్టడీ సర్కిళ్ల ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. -
సివిల్స్ నోటిఫికేషన్ వాయిదా
న్యూఢిల్లీ: ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష నోటిఫికేషన్ విడుదలను యూపీఎస్సీ వాయిదా వేసింది. నోటిఫికేషన్ శనివారం ఇవ్వాల్సి ఉండగా, ఎలాంటి కారణాలు చూపకుండానే వాయిదా వేసింది. త్వరలో నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా పలు కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగాల కోసం ప్రతీ ఏటా యూపీఎస్సీ సివిల్ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేస్తుందన్న విషయం తెలిసిందే.