సివిల్స్‌ ర్యాంకులపై సీఎం హర్షం | CM KCR greetings to the Civil rank toppers | Sakshi
Sakshi News home page

సివిల్స్‌ ర్యాంకులపై సీఎం హర్షం

Published Sun, Apr 29 2018 2:37 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

CM KCR greetings to the Civil rank toppers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సివిల్స్‌ పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండటం గర్వకారణమని కొనియాడారు. ఆలిండియా నంబర్‌ వన్‌ ర్యాంకు సాధించిన మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లాకు చెందిన కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్‌ జిల్లా పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్‌ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్‌ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను సీఎం అభినందించారు.

9వ ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యా శర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా రాష్ట్ర విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సివిల్‌ సర్వీస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను సంసిద్ధం చేయడానికి ప్రభుత్వపరంగా స్టడీ సర్కిళ్ల ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement