Civil Lines
-
ఇంకా ఇల్లు దొరకలేదు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇంటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో తనకు లభించిన నివాసంలోనే ఇప్పటికీ ఉంటున్న ఆయన, కొత్త చోటికి మారడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సివిల్‌లైన్స్‌లోని కాంగ్రెస్ మాజీ ఎంపీ తనయుడి ఇంటికి ఆయన మారడం ఖాయమనే అనుకున్నారు. కానీ ఇంతలో దానికి కోర్టు కేసు అడ్డమొచ్చింది. కేజ్రీవాల్ సివిల్‌లైన్స్‌లోని ఇంటికి మారబోరని ఆప్ వర్గాలు తెలిపాయి. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని నరేన్ జైన్ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు కేజ్రీవాల్ గతవారం ధ్రువీకరించారు. ఈ వార్త బయటకు రాగానే నరేన్ జైన్ సోదరుడు ఆ ఇంటిపై తనకు సగం హక్కు ఉందని హైకోర్టుకు వెళ్లారు. అద్దె గురించి మాట్లాడుకున్న సమయంలో తమకు కోర్టు కేసు గురించి తెలియదని ఆప్ నాయకులు చెప్పారు. కోర్టు కేసు దృష్ట్యా కేజ్రీవాల్ ఆ ఇంటికి మారకూడదని నిర్ణయించారని తెలిపారు. కేజ్రీవాల్ తిలక్మార్గ్లోని ప్రభుత్వ నివాసంలో ఆయన జూలై ఆఖరి వరకు ఉండొచ్చు. ఆ తరువాత ఆయన ఎక్కడ ఉంటారన్నది కేజ్రీవాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకేగాక పార్టీకి కూడా సమస్యగా మారింది. కేజ్రీవాల్ భార్య సునీత అగర్వాల్ ఐఆర్ఎస్ అధికారిణి కాబట్టి ఆమెకు అధికారిక నివాసం లభించవచ్చని లేనట్లయితే ఆయన కౌశాంబీలోని సొంత ఇంటికి మకాం మార్చవచ్చని అంటున్నారు. అదీగాక న్యూఢిల్లీ ఎంపీతోపాటు న్యూఢిల్లీ ఎమ్మెల్యే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ), ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అవుతారు. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం న్యూఢిల్లీ ఎమ్మెల్యే అయిన కేజ్రీవాల్‌కు అధికారిక నివాసాన్ని కేటాయించవచ్చు. ఈ వేరకు ఒక తీర్మానాన్ని ఎన్డీఎంసీ ఆమోదించింది. హోంమంత్రిత్వశాఖ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే కేజ్రీవాల్ కూడా నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు. -
యూపీఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శన
- మెట్రో స్టేషన్లు బంద్ - పలు రోడ్ల మూసివేత - ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సాక్షి, న్యూఢిల్లీ: హిందీలో పరీక్ష రాసే అభ్యర్థులపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పక్షపాతం చూపుతోందని ఆరోపిస్తూ ఈ సంస్థ సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే అభ్యర్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్‌లో వీళ్లు శుక్రవారం నిరసనకు దిగడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్ఏటీ) రద్దు చేయాలని కోరుతూ సివిల్‌లైన్స్‌లో వందలాది మంది గుమిగూడడంతో నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు. నిరసనకారులు రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధానమంత్రి నివాసం వద్దకు వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, ఉద్యోగ్‌భవన్, రేస్‌కోర్సు మెట్రో స్టేషన్లలోని ప్రవేశనిష్ర్కమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో అధికారులను ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు నాలుగు మెట్రో స్టేషన్లను కొంతసేపు మూసివేసి తిరిగి తెరిచారు. సాయంత్రం మరోమారు నిరసనకారులు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ముందు గుమిగూడారు. దీంతో రేస్‌కోర్సు స్టేషన్‌ను సాయంత్రం ఐదు గంటలకు మరోమారు మూసివేశారు. రేస్‌కోర్సు రోడ్డుకు దారితీసే రోడ్లు కూడా మూసివేశారు. అభ్యర్థులు ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించాలని భావించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు మెట్రో స్టేషన్ల గేట్ల అధికారులు నోటీసులు అంటించారు. మెట్రో స్టేష న్లకు వచ్చిన ప్రయాణికులు వీటిని చూసి నిరాశతో వెనుదిరిగారు. -
త్వరలో కొత్త ఇంటికి
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేసేందుకు సిద్ధమవుతునారు. ఉత్తరఢిల్లీలోని సివిల్‌లైన్స్‌లో ఆయనకు ఒక ఇల్లు దొరకడంతో తిలక్లైన్స్లోని అధికారిక నివాసాన్ని వచ్చే నెల మొదటివారానికల్లా ఖాళీ చేస్తానని ప్రకటించారు. ‘సివిల్‌లైన్స్ నరేన్ జైన్ నాకు ఒక ఇల్లు చూపించారు. త్వరలోనే అక్కడికి మారబోతున్నాను. ఇల్లు చాలా బాగుంది. ననరేన్కు కృతజ్ఞతలు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ రామ్‌జైన్ కుమారుడు అయిన నరేన్ ఢిల్లీలో స్థిరాస్తులను అద్దెకు ఇస్తుంటారు. దీని గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా జవాబు ఇవ్వడానికి మొదట తిరస్కరించారు. తదనంతరం మాత్రం ఇల్లును అద్దెకు ఇస్తున్నట్టు అంగీకరించారు. ‘అవును. సివిల్‌లైన్స్‌లోని ఆ ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇవ్వాలని మా దళారీకి నేను సూచించాను. అయితే దానిని కేజ్రీవాల్‌కు ఇస్తున్న సంగతి నాకు మొదట్లో తెలియదు’ అని నరేన్ వివరించారు. ఇక ఈ ఇంట్లో నాలుగు పడక గదులు, బాత్రూమ్లు, వంటిల్లు, భోజనాల గది, హాల్ ఉన్నాయి. ముందూ వెనుక చిన్నపాటి ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రముఖ రచయిత సల్మాన్ రష్టీ తండ్రికి చెందిన ఈ ఇంటిని ఆయన 1960లో అమ్మేశారు. దీనిని 2005లోనే నరేన్ కొనుగోలు చేసినా, అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. దీని నెల అద్దె రూపాయి మాత్రమే ఉండొచ్చని చెబుతున్నారు. నరేన్ మాత్రం అలాంటిది ఏం లేదంటున్నారు. ‘అద్దె గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అందరం కూర్చొని మాట్లాడక నిర్ణయిస్తాం. కొంత రాయితీ కూడా ఇస్తాం. వచ్చే నెలవరకల్లా ఒప్పందం ప్రక్రియ పూర్తవుతుంది. నెలకు రూ. 50-60 వేల వరకు అద్దె ఉంటుంది’ అని ఆయన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన 49 రోజులకే కేజ్రీవాల్ ప్రభుత్వం నుంచి వైదొలగడం తెలిసిందే. తన కూతురికి పరీక్షలు ఉన్నందున, అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు జూలై వరకు గడువు ఇవ్వాలని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కోరారు.దీనిపై విపక్షాలు కేజ్రీవాల్‌ను విమర్శించడం తెలిసిందే. నరేన్ జైన్ కూడా సివిల్లైన్స్లోనే ఉండడం వల్ల పనివాళ్లు ఇదే ఇంట్లో ఉండేవారు. అయితే జైన్ ఇటీవలే వారిని ఖాళీ చేయించారు. చాలాకాలంగా ఎవరూ నివాసముండకపోవడం వల్ల ఈ ఇల్లు పాతబడిపోయింది. మరమ్మతులు ముగిసిన తరువాత కేజ్రీవాల్ ఈ భవనంలోకి మారతారు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను కేజ్రీవాల్ చెల్లిస్తారని, తరువాత ఇంటి అద్దె నుంచి కత్తిరించుకుంటారని చెబుతున్నారు.