ఇంకా ఇల్లు దొరకలేదు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి , ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఇంటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ముఖ్యమంత్రి హోదాలో తనకు లభించిన నివాసంలోనే ఇప్పటికీ ఉంటున్న ఆయన, కొత్త చోటికి మారడానికి కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. సివిల్‌లైన్స్‌లోని కాంగ్రెస్ మాజీ ఎంపీ తనయుడి ఇంటికి ఆయన మారడం ఖాయమనే అనుకున్నారు. కానీ ఇంతలో దానికి కోర్టు కేసు అడ్డమొచ్చింది. కేజ్రీవాల్ సివిల్‌లైన్స్‌లోని ఇంటికి మారబోరని ఆప్ వర్గాలు తెలిపాయి. ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని నరేన్ జైన్ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు కేజ్రీవాల్ గతవారం ధ్రువీకరించారు.
ఈ వార్త బయటకు రాగానే నరేన్ జైన్ సోదరుడు ఆ ఇంటిపై తనకు సగం హక్కు ఉందని హైకోర్టుకు వెళ్లారు. అద్దె గురించి మాట్లాడుకున్న సమయంలో తమకు కోర్టు కేసు గురించి తెలియదని ఆప్ నాయకులు చెప్పారు. కోర్టు కేసు దృష్ట్యా కేజ్రీవాల్ ఆ ఇంటికి మారకూడదని నిర్ణయించారని తెలిపారు. కేజ్రీవాల్ తిలక్‌మార్గ్‌లోని ప్రభుత్వ నివాసంలో ఆయన జూలై ఆఖరి వరకు ఉండొచ్చు. ఆ తరువాత ఆయన ఎక్కడ ఉంటారన్నది కేజ్రీవాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులకేగాక పార్టీకి కూడా సమస్యగా మారింది.
కేజ్రీవాల్ భార్య సునీత అగర్వాల్ ఐఆర్‌ఎస్ అధికారిణి కాబట్టి ఆమెకు అధికారిక నివాసం లభించవచ్చని లేనట్లయితే ఆయన కౌశాంబీలోని సొంత ఇంటికి మకాం మార్చవచ్చని అంటున్నారు. అదీగాక న్యూఢిల్లీ ఎంపీతోపాటు న్యూఢిల్లీ ఎమ్మెల్యే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ), ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు అవుతారు. కార్పొరేషన్ నిబంధనల ప్రకారం న్యూఢిల్లీ ఎమ్మెల్యే అయిన కేజ్రీవాల్‌కు అధికారిక నివాసాన్ని కేటాయించవచ్చు. ఈ వేరకు ఒక తీర్మానాన్ని ఎన్‌డీఎంసీ ఆమోదించింది. హోంమంత్రిత్వశాఖ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించినట్లయితే కేజ్రీవాల్ కూడా నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.