యూపీఎస్సీ అభ్యర్థుల నిరసన ప్రదర్శన
- మెట్రో స్టేషన్లు బంద్
- పలు రోడ్ల మూసివేత
- ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
సాక్షి, న్యూఢిల్లీ: హిందీలో పరీక్ష రాసే అభ్యర్థులపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పక్షపాతం చూపుతోందని ఆరోపిస్తూ ఈ సంస్థ సివిల్ సర్వీసుల పరీక్షలు రాసే అభ్యర్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్‌ఘాట్‌లో వీళ్లు శుక్రవారం నిరసనకు దిగడంతో నగరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్‌ఏటీ) రద్దు చేయాలని కోరుతూ సివిల్‌లైన్స్‌లో వందలాది మంది గుమిగూడడంతో నాలుగు మెట్రో స్టేషన్లను మూసివేశారు.
నిరసనకారులు రేస్‌కోర్సు రోడ్డులోని ప్రధానమంత్రి నివాసం వద్దకు వెళ్లే అవకాశం ఉందని భావించిన పోలీసులు సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, ఉద్యోగ్‌భవన్, రేస్‌కోర్సు మెట్రో స్టేషన్లలోని ప్రవేశనిష్ర్కమణ ద్వారాలను మూసివేయాలని ఢిల్లీ మెట్రో అధికారులను ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు నాలుగు మెట్రో స్టేషన్లను కొంతసేపు మూసివేసి తిరిగి తెరిచారు. సాయంత్రం మరోమారు నిరసనకారులు పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ ముందు గుమిగూడారు.
దీంతో రేస్‌కోర్సు స్టేషన్‌ను సాయంత్రం ఐదు గంటలకు మరోమారు మూసివేశారు. రేస్‌కోర్సు రోడ్డుకు దారితీసే రోడ్లు కూడా మూసివేశారు. అభ్యర్థులు ప్రధానమంత్రికి వినతిపత్రం సమర్పించాలని భావించడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా మెట్రో స్టేషన్లను మూసివేసినట్లు మెట్రో స్టేషన్ల గేట్ల అధికారులు నోటీసులు అంటించారు. మెట్రో స్టేష న్లకు వచ్చిన ప్రయాణికులు వీటిని చూసి నిరాశతో వెనుదిరిగారు.